త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy Gandhi Bhavan Speech | కాంగ్రెస్ జెండా మోసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మన బాధ్యత

గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతల తీరుపై హెచ్చరికలు జారీ చేస్తూనే, వచ్చే ఎన్నికల్లో 90 సీట్లే లక్ష్యమని ప్రకటించారు.

J

Telangana | Published On Nov 22, 2026, 7.56 pm IST

Revanth Reddy Gandhi Bhavan Speech | కాంగ్రెస్ జెండా మోసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మన బాధ్యత

సంక్షిప్త సారాంశం

గాంధీభవన్, ఢిల్లీ చుట్టూ తిరిగితే పదవులు రావని, గ్రామాలు, తండాలకు వెళ్లి పేదలకు అండగా నిలిచిన వారికే గుర్తింపు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోటి ఓట్లతో 90 సీట్లు గెలుస్తామని, అలాగే 15 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, గిగ్ వర్కర్ల చట్టంతో పాటు ఉచిత బస్సు, రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం వంటి పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ తప్పే నేతల కదలికలను నిశితంగా గమనిస్తున్నామని హెచ్చరించిన సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Advertisement
  • గాంధీభవన్, ఢిల్లీ చుట్టూ తిరిగితే పదవులు రావు
  • సొంత నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
  • బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు

Revanth Reddy Gandhi Bhavan Speech | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే.. మరోవైపు సొంత పార్టీ నేతల పనితీరు, క్రమశిక్షణపై సీఎం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోటి ఓట్లతో 90 సీట్లు గెలుస్తామని, 15 ఎంపీ సీట్లు సాధించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని ఆయన ప్రకటించారు.

'ఢిల్లీకి కాదు.. గ్రామాలు, తండాలకు వెళ్లండి'

పార్టీ నేతల ప్రవర్తన, మాట తీరును అధిష్టానం నిశితంగా గమనిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. "ఏ నాయకుడు ముందు ఏం మాట్లాడుతున్నారు, వెనుక ఏం మాట్లాడుతున్నారో పార్టీ దగ్గర సంపూర్ణ సమాచారం ఉంది. రాజకీయాల్లో బ్యాలెన్స్ షీట్ ఐదేళ్లకు ఒకసారి వస్తుంది. ఎన్నికల సమయంలో ఎవరి శ్రమ ఎంత ఉందో కొలుస్తాం. కష్టపడిన వాళ్లను గుర్తిస్తాం, అలాగే కష్టపడి చెడగొట్టే వాళ్లను కూడా కచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం" అని ఆయన హెచ్చరించారు.

CM Revanth Reddy Warns Congress Leaders at Gandhi Bhavan Targets 90 Seats in Next Polls

గాంధీభవన్ చుట్టూ, ఢిల్లీ చుట్టూ తిరిగినంత మాత్రాన పదవులు వస్తాయనుకోవడం అపోహ మాత్రమేనని రేవంత్ రెడ్డి అన్నారు. నేతలు వెళ్లాల్సింది ఢిల్లీకి కాదని.. గ్రామాలు, తండాలు, పేదల వద్దకు వెళ్లాలని సూచించారు. పార్టీ లైన్‌లో ఉంటూ పేదలకు ఆత్మబంధువుగా నిలిచిన వారికే ఇంటికి పదవి దానంతట అదే వస్తుందన్నారు. "పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎదురుగా వచ్చి డిస్కో డ్యాన్స్ చేస్తుంది.. చూసీ చూడనట్లు ఉంటే కొంతమంది నాయకులు ఇలాంటి వ్యవహారాలు చేస్తుంటారు" అంటూ క్రమశిక్షణ తప్పే నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు.

కష్టపడిన వారికే పదవులు.. త్యాగాలకు గుర్తింపు

తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కేసీఆర్ బలవంతంగా, అక్రమ కేసులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ లేదని విర్రవీగిన తరుణంలో, డిజిటల్ మెంబర్‌షిప్ చేపట్టి 90 రోజుల్లోనే దేశంలో అత్యధికంగా 48 లక్షల సభ్యత్వ నమోదు చేయించామని తెలిపారు. కార్యకర్తల కృషి వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో 92,35,833 ఓట్లు సాధించి 64 సీట్లు (సీపీఐతో కలిపి 65) గెలుచుకున్నామని చెప్పారు.

CM Revanth Reddy Warns Congress Leaders at Gandhi Bhavan Targets 90 Seats in Next Polls

కష్టకాలంలో పార్టీ జెండా మోసిన బడుగు, బలహీన వర్గాల నేతలకు, 70 శాతం జిల్లా అధ్యక్షులకు టికెట్లు ఇచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలను చేశామని సీఎం పేర్కొన్నారు. అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను ఆయన ప్రస్తావించారు.

పార్టీ కోసం ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అయ్యి, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారని, నారాయణఖేడ్ టికెట్ వదులుకున్న సురేష్ షెట్కర్ ఎంపీ అయ్యారని గుర్తుచేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 3,700 ఓట్లే వచ్చినా వెనకడుగు వేయకుండా పోటీ చేసిన బల్మూర్ వెంకట్‌తో పాటు, పార్టీ కోసం కష్టపడిన సామా రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలకు అడగకుండానే ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చామని, అనుబంధ విభాగాల్లో పనిచేసిన 65 మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చామని వివరించారు.

కులగణనతో దేశానికి ఆదర్శం.. పార్టీలకు అతీతంగా పథకాలు

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, సామాజిక కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

సామాజిక న్యాయం: 95 ఏళ్ల తర్వాత న్యాయస్థానాలు, చట్టాల ముందు నిలబడేలా కులగణన చేసి తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామని, దీనిని అనుసరించాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంతో పాటు, గిగ్ వర్కర్ల కోసం దేశంలోనే తొలిసారిగా చట్టం చేశామన్నారు.

CM Revanth Reddy Warns Congress Leaders at Gandhi Bhavan Targets 90 Seats in Next Polls

అభివృద్ధి, సంక్షేమం: ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ హయాంలో అమలైన పథకాలను కొనసాగిస్తూనే మరిన్ని కొత్త పథకాలు తెచ్చామన్నారు. రోజుకు 37 లక్షల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తున్నారని, ఇందుకోసం ఆర్టీసీకి రూ.13 వేల కోట్లు చెల్లించామని చెప్పారు.

రైతు, మహిళా సంక్షేమం: రూ.25 వేల కోట్ల రైతు రుణమాఫీ, రూ.36 వేల కోట్ల రైతు భరోసా, రూ.95 వేల కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టామన్నారు. 4.75 లక్షల మందికి కొత్త పింఛన్లు, 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు (2.25 లక్షల ఇళ్లు పూర్తి), కోటి కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా, 52 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 3.42 కోట్ల మందికి 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించి, రూ.2 వేల కోట్ల వడ్డీని ప్రభుత్వమే చెల్లించిందన్నారు.

CM Revanth Reddy Warns Congress Leaders at Gandhi Bhavan Targets 90 Seats in Next Polls

మహనీయులకు గౌరవం: జ్యోతిబా ఫూలే దంపతులు, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే పండుగ సాయన్న విగ్రహంతో పాటు అచ్చంపేట వద్ద సేవాలాల్ మందిరాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. కాళేశ్వరం పాపాలు కడుక్కోవడానికే కేసీఆర్ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని ఆయన ఆరోపించారు.

బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి

కృష్ణా, గోదావరి జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాము అందిస్తున్న సన్నబియ్యం, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రభుత్వ ఉద్యోగాలను బీఆర్ఎస్ నేతలు, వారి కుటుంబ సభ్యులు కూడా పొందుతున్నారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరుపైనా, మాజీ మంత్రి హరీశ్ రావుపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గతంలో టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వరుసగా పదేళ్ల చొప్పున అధికారంలో ఉన్నాయని, ఇప్పుడు మళ్లీ వరుసగా పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తామని, ప్రభుత్వం చేస్తున్న మంచిని మైక్‌లో చెప్పాలని, ఏమైనా లోపాలుంటే చెవిలో చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందిరా గాంధీ మెదక్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి తెలంగాణకు కాంగ్రెస్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని, రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేసే బాధ్యతను తెలంగాణ కాంగ్రెస్ నేతలు భుజాన వేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement