JEE Main 2027 | జేఈఈ మెయిన్-2027 వెల్లువెత్తిన దరఖాస్తులు
JEE Main 2027 | దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2027 తొలి విడత పరీక్ష దరఖాస్తులకు గడువు ఆదివారంతో ముగియనుంది. నవంబర్ 22 రాత్రి 11.50 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
- జేఈఈ మెయిన్-2027 వెల్లువెత్తిన దరఖాస్తులు
- ఇప్పటికే ఫీజు చెల్లించిన 13.10లక్షల మంది
- ఈ నెల 26 వరకు లేట్ ఫీజుతో దరఖాస్తుకు ఛాన్స్
JEE Main 2027 | దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2027 తొలి విడత పరీక్ష దరఖాస్తులకు గడువు ఆదివారంతో ముగియనుంది. నవంబర్ 22 రాత్రి 11.50 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రానికి 15,04,866 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరిలో 13,10,493 మంది పరీక్ష ఫీజు కూడా చెల్లించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఇంకా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయని వారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే రిజిస్ట్రేషన్‌తోపాటు ఫీజు చెల్లించాలని సూచించింది.
రేపటి నుంచి రూ.500 లేట్ ఫీజుతో..
నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు ఎన్‌టీఏ మరో అవకాశం కల్పించింది. నవంబర్ 23 నుంచి ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఇందుకోసం అదనంగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నవంబర్ 26 రాత్రి 11.50 గంటల వరకు గడువు ఇచ్చింది. అయితే సాధారణ రుసుముతో దరఖాస్తు చేసుకునే చివరి అవకాశం నవంబర్ 22తోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చివరి రోజు సర్వర్ సమస్యలు, ఆన్‌లైన్ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుగానే ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.
ఆరు రోజుల్లో డబుల్..
జేఈఈ మెయిన్ తొలి విడతకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. నవంబర్ 16 నాటికి 9,05,144 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారిలో 7,04,316 మంది మాత్రమే ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేశారు. తాజాగా ఈ సంఖ్య 13.10 లక్షలకు చేరింది. అంటే ఆరు రోజుల వ్యవధిలోనే ఫీజు చెల్లించిన అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాత్రమే సరిపోదని, ఫీజు చెల్లించి కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
డిజీలాకర్ వివరాలపై అప్రమత్తం
దరఖాస్తు సమయంలో గుర్తింపు వివరాల్లో ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. డిజీలాకర్, జనపరిచయ్, ఈ-ప్రమాణ్ (మేరీ పెహచాన్) ఖాతాల ద్వారా అభ్యర్థులు స్వయంగా లాగిన్ కావాలని తెలిపింది. ఇతరుల లాగిన్ వివరాలు ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో గుర్తింపు ధ్రువీకరణ, బయోమెట్రిక్ ప్రక్రియలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దరఖాస్తు చేయడానికి ముందే డిజీలాకర్‌లో రీ-కేవైసీ (Re-KYC) పూర్తి చేసుకోవాలని సూచించింది. తద్వారా అభ్యర్థుల తాజా వ్యక్తిగత వివరాలు, గుర్తింపు సమాచారం సరిగ్గా అందుబాటులోకి వస్తాయని వివరించింది. ఆన్‌లైన్ దరఖాస్తులో నమోదు చేసే వివరాలను ధ్రువపత్రాలతో సరిపోల్చుకోవాలని సూచించింది.
విదేశీ అభ్యర్థులకు ప్రత్యేక సూచనలు..
దేశంలో, విదేశాల్లో ఉన్న అభ్యర్థులు తమ పౌరసత్వం, ఆధార్ స్థితికి అనుగుణంగా సరైన కేటగిరీని ఎంపిక చేసుకోవాలని ఎన్‌టీఏ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. భారతీయ పౌరులు, ఆధార్ కార్డు కలిగిన ఎన్నారైలు ‘ఇండియన్ నేషనల్స్’ కేటగిరీని ఎంచుకోవాలి. విదేశీ పౌరులు, ఓసీఐ (OCI) కార్డుదారులు ‘ఫారిన్ నేషనల్స్’ విభాగంలో దరఖాస్తు చేయాలి. భారతీయ పాస్‌పోర్టు ఉండి, ఆధార్ కార్డు లేని ఎన్నారైలు ‘ఎన్నారై హేవింగ్ నో ఆధార్’ కేటగిరీని ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేసింది.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వివరాలతో లాగిన్ కావాలి. అనంతరం అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేసి, వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిందని భావించి ఫీజు చెల్లింపును మరిచిపోవద్దని ఎన్‌టీఏ మరోసారి స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Revanth Reddy Gandhi Bhavan Speech | కాంగ్రెస్ జెండా మోసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మన బాధ్యత
- ●Nayanthara | నయనతారకు 10 కోట్ల లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన విఘ్నేశ్ శివన్!
- ●PVNRTVU | వెటర్నరీ వర్సిటీలో 117 అధ్యాపక పోస్టులు.. సర్కార్ గ్రీన్‌సిగ్నల్!
- ●Nvidia Chip Smuggling China | ఎన్విడియా చిప్ స్మగ్లింగ్ కేసులో కొత్త మలుపు.. ఆలిస్ హువాంగ్ వెనుక అసలు సూత్రధారి చైనా వ్యాపారవేత్త
- ●Bomb Threat Email | హైదరాబాద్‌లో బాంబు దాడులు చేస్తం.. బెదిరింపు మెయిల్ కలకలం
- ●Maruti Suzuki | మారుతి కార్ల ధరలకు మరోసారి రెక్కలు.. నేటి నుంచే కొత్త రేట్లు!

Revanth Reddy Gandhi Bhavan Speech | కాంగ్రెస్ జెండా మోసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మన బాధ్యత

Nayanthara | నయనతారకు 10 కోట్ల లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన విఘ్నేశ్ శివన్!

PVNRTVU | వెటర్నరీ వర్సిటీలో 117 అధ్యాపక పోస్టులు.. సర్కార్ గ్రీన్‌సిగ్నల్!

Nvidia Chip Smuggling China | ఎన్విడియా చిప్ స్మగ్లింగ్ కేసులో కొత్త మలుపు.. ఆలిస్ హువాంగ్ వెనుక అసలు సూత్రధారి చైనా వ్యాపారవేత్త




