త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Red Fort Blast | టార్గెట్ రెడ్‌ ఫోర్ట్ కాదు.. లాల్ మందిర్‌.. ఢిల్లీ పేలుడుపై సంచ‌ల‌న విష‌యాలు

Red Fort Blast | ఎర్ర‌కోట వ‌ద్ద బ్లాస్ట్‌ (Red Fort Blast)పై ఎన్ఐఏ ఛార్జిషీట్‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. సూసైడ్ బాంబ‌ర్ టార్గెట్ రెడ్ ఫోర్ట్ కాద‌ని తేలింది. చాందినీ చౌక్ వ‌ద్ద ఉన్న లాల్ మందిర్‌ను తొలుత టార్గెట్ చేసిన‌ట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది.

D

National | Published On Sep 10, 2026, 1.31 pm IST

Red Fort Blast | టార్గెట్ రెడ్‌ ఫోర్ట్ కాదు.. లాల్ మందిర్‌.. ఢిల్లీ పేలుడుపై సంచ‌ల‌న విష‌యాలు
Advertisement

Red Fort Blast | త్రినేత్ర‌.న్యూస్ : దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద గతేడాది నవంబర్‌లో జరిగిన కారు బాంబు పేలుడుకు సంబంధించి జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (NIA) ఛార్జిషీట్‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆత్మాహుతి బాంబర్ డాక్ట‌ర్ ఉమ‌ర్ ఉన్ న‌బీ టార్గెట్ రెడ్ ఫోర్ట్ కాద‌ని తేలింది. చాందినీ చౌక్ వ‌ద్ద ఉన్న లాల్ మందిర్‌ను తొలుత టార్గెట్ చేసిన‌ట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. అయితే, ఢిల్లీలో భారీ ట్రాఫిక్, పోలీసుల కార‌ణంగా చివ‌రి నిమిషంలో త‌న టార్గెట్‌ను ఉమ‌ర్ మార్చుకున్న‌ట్లు భావిస్తోంది.

ఉమ‌ర్ మొద‌ట త‌న పేలుడు ప‌దార్థాల‌తో నిండిన ఐ20 కారును జైన్ దేవాల‌య‌మైన లాల్ మందిర్ (Lal Mandir) స‌మీపంలో పార్క్ చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో గుర్తించారు. న‌బీ న‌వంబ‌ర్ 10వ తేదీ సాయంత్రం 6:37 గంట‌ల స‌మ‌యంలో లాల్ మందిర్ వ‌ద్ద పార్క్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే, ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉండ‌టం, పోలీసుల త‌నిఖీల కార‌ణంగా అత‌ను యూ ట‌ర్న్ తీసుకుని రెడ్ ఫోర్ట్‌వైపు వెళ్లాడు. కొన్ని నిమిషాల్లోనే అంటే 6:50 స‌మ‌యంలో ఎర్ర‌కోట వ‌ద్ద సిగ్న‌ల్‌లో బాంబు పేలింది.

గ‌తేడాది న‌వంబ‌ర్ 10వ తేదీన ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో లాల్‌ కిలా మెట్రో స్టేషన్‌ గేట్‌ సిగ్న‌ల్ వ‌ద్ద బాంబు పేలుడు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. ఓ కారులో పేలుడు సంభ‌వించి 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు స‌మ‌యంలో ఢిల్లీ స‌మీపంలోని ఫ‌రీదాబాద్‌లో గ‌ల అల్ ఫ‌లా యూనివ‌ర్సిటీలో ప‌నిచేస్తున్న క‌శ్మీరీ వైద్యుడు ఉమ‌ర్ ఉన్ న‌బీ కారు న‌డుపుతున్నాడు. ఫ‌రీదాబాద్‌లో 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్ సహా ఇతర పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకోవ‌డంతో.. తీవ్ర ఆందోళ‌న‌కు గురైన ఉమ‌ర్ ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు వైద్యుల‌ను అధికారులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. వీరంద‌రికీ అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ 'అన్సార్ గజ్వాతుల్ హింద్'కు చెందిన వైట్ కాలర్ ఉగ్రవాద ముఠాతో సంబంధాలు ఉన్న‌ట్లు గుర్తించారు.

2023-25 మ‌ధ్య సూసైడ్ బాంబ‌ర్ ఉమ‌ర్ 12 సార్లు రెడ్ ఫోర్ట్‌ను సంద‌ర్శించిన‌ట్లు ఎన్ఐఏ గ‌తంలోనే గుర్తించింది. చివ‌రిసారిగా గ‌తేడాది మే 1న ఆయ‌న రెడ్ ఫోర్ట్‌ను విజిట్ చేసిన‌ట్లు గుర్తిచింది. అయితే, ఇది కేవ‌లం వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న కాద‌ని.. పేలుడుకు ప్ర‌ణాళిక ర‌చించేందుకే అక్క‌డ ప‌లుమార్లు రెక్కి నిర్వ‌హించి ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించి ఉంటార‌ని ద‌ర్యాప్తు సంస్థ భావిస్తోంది. అంతేకాదు, డిజిట‌ల్ ఆధారాల ద్వారా త‌మ క‌ద‌లిక‌ల‌ను గుర్తించ‌కుండా ఉమ‌ర్‌, అత‌ని అనుచ‌రులు ప‌ర్య‌ట‌న‌ల స‌మ‌యంలో త‌మ మొబైల్ ఫోన్‌ల‌ను స్విచ్ ఆఫ్ చేసేవార‌ని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఉమ‌ర్ నుహ్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సుమారు 11 రోజుల పాటూ నివ‌సించాడు. అక్క‌డే అత‌ను పేలుడు ప‌దార్థాల‌ను త‌యారు చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా.. బాంబు పేలుడు ఘ‌ట‌న‌ వెనుక‌ ఆల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (Al Qaeda in Indian Subcontinent) హస్తం ఉందని ఐక్య‌రాజ్య స‌మితి భద్రతా మండలి (UNSC) సంచ‌ల‌న నివేదిక వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

Also Read..

సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న‌ 80s ట్రెండ్‌.. వింటేజ్ లుక్‌లో ప్ర‌ధాని మోదీ, రాహుల్‌..

త‌మ్ముడు విజ‌య్‌.. మీరు చెప్పింది నిజ‌మే.. పోలీసుల దాష్టీకానికి నా ద‌వ‌డ ప‌గిలింది : ఎంకే స్టాలిన్‌

ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధ‌ర‌.. మార్కెట్ల‌లో తీవ్ర అనిశ్చితి..

Advertisement
Advertisement