త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple iPhone 18 Pro | ఐఫోన్‌ 18 ప్రొ సిరీస్‌ వచ్చేసింది.. ధర రూ.1.64 లక్షల నుంచి..

Apple iPhone 18 Pro | యాపిల్‌ ఐఫోన్‌ 18 ప్రొ, ఐఫోన్‌ 18 ప్రొ మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. కంప్యూటేషనల్‌ ఫొటోగ్రఫీ, ఎక్కువసేపు మెరుగైన పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, కృత్రిమ మేధస్సు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఈ కొత్త ప్రీమియం ఐఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు మోడళ్లలోనూ 2 నానోమీటర్‌ తయారీ ప్రక్రియతో రూపొందించిన ఎ20 ప్రొ చిప్‌ను ఉపయోగించారు.

S

Technology | Published On Sep 10, 2026, 12.33 pm IST

Apple iPhone 18 Pro | ఐఫోన్‌ 18 ప్రొ సిరీస్‌ వచ్చేసింది.. ధర రూ.1.64 లక్షల నుంచి..
Advertisement

Apple iPhone 18 Pro | యాపిల్‌ ఐఫోన్‌ 18 ప్రొ, ఐఫోన్‌ 18 ప్రొ మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. కంప్యూటేషనల్‌ ఫొటోగ్రఫీ, ఎక్కువసేపు మెరుగైన పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, కృత్రిమ మేధస్సు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఈ కొత్త ప్రీమియం ఐఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు మోడళ్లలోనూ 2 నానోమీటర్‌ తయారీ ప్రక్రియతో రూపొందించిన ఎ20 ప్రొ చిప్‌ను ఉపయోగించారు. ఇందులో రెండు పనితీరు కోర్లు, నాలుగు సామర్థ్య కోర్లతో కూడిన ఆరు కోర్ల సీపీయూ, న్యూరల్‌ యాక్సిలరేటర్లతో కూడిన ఏడు కోర్ల జీపీయూ ఉన్నాయి. ఎ19 ప్రొతో పోలిస్తే గ్రాఫిక్స్‌ రెండరింగ్‌ వేగం 40 శాతం వరకు పెరిగిందని యాపిల్‌ చెబుతోంది. 32 కోర్ల డ్యుయల్ 16-కోర్‌ న్యూరల్‌ ఇంజిన్‌ ద్వారా ఫోన్‌లోనే కృత్రిమ మేధస్సు మోడళ్లను అమలు చేయడానికి వీలుంటుంది. మెమరీ బ్యాండ్‌విడ్త్‌ కూడా గత తరం కంటే 50 శాతం పెరిగింది.

కెమెరా విభాగంలో మార్పులు..

ఐఫోన్‌ 18 ప్రొ సిరీస్‌లో కెమెరా విభాగంలో కీలకమైన మార్పు చేశారు. కొత్త 48 మెగాపిక్స‌ల్‌ ఫ్యూజన్‌ మెయిన్‌ కెమెరాకు మెకానికల్‌ వేరియబుల్‌ అపెర్చర్‌ను అందించారు. ఆరు లేజర్‌ కట్‌ బ్లేడ్లతో కూడిన కొత్త రోటర్‌ వ్యవస్థ ద్వారా కెమెరాలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని, డెప్త్‌ ఆఫ్‌ ఫీల్డ్‌ను ఆటోమేటిక్‌గా లేదా మాన్యువల్‌గా మార్చుకోవచ్చు. నాలుగు ప్రీసెట్‌ అపెర్చర్‌ స్థాయిల్లో దీన్ని నియంత్రించవచ్చు. తక్కువ వెలుతురు పరిస్థితుల్లో ఎఫ్‌/1.48 వరకు అపెర్చర్‌ను ఉపయోగించవచ్చు. ప్రొ కంట్రోల్స్‌లో భాగంగా షట‌ర్‌ స్పీడ్‌, వైట్‌ బ్యాలెన్స్‌, అపెర్చర్‌ ఎంపిక, ఆన్‌-స్క్రీన్‌ హిస్టోగ్రామ్‌ వంటి మాన్యువల్‌ నియంత్రణలను యాపిల్‌ అందించింది. వీడియో విషయంలోనూ పలు కొత్త ఫీచర్లు ఉన్నాయి. షూట్‌ చేసిన తర్వాత సినిమాటిక్‌ ఎఫెక్ట్‌లను సెకనుకు 60 ఫ్రేమ్‌ల వరకు జోడించవచ్చు. 4కె డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌ టైమ్‌ల్యాప్స్‌ రికార్డింగ్‌తోపాటు, డైలాగ్‌ లేదా సంగీతాన్ని ప్రత్యేకంగా వేరు చేయడానికి అల్గారిథమిక్‌ ఆడియో సెపరేషన్‌ సదుపాయం ఉంది.

ప్ర‌త్యేక థ‌ర్మ‌ల్ మేనేజ్‌మెంట్‌..

కెమెరాతో తీసిన పిక్స‌ల్‌ డేటాకు క్రిప్టోగ్రాఫిక్‌ సంతకం చేసే వ్యవస్థను కూడా యాపిల్‌ ప్రవేశపెట్టింది. ప్రైవేట్‌ క్లౌడ్‌ కంప్యూట్‌ ద్వారా ప్రాసెస్‌ చేసిన తర్వాత, అసలు చిత్రానికి సంబంధించిన మార్పులేనటువంటి రిఫరెన్స్‌ ఇమేజ్‌ను ఫొటోస్‌ యాప్‌లో అందుబాటులో ఉంచుతుంది. దీంతో తర్వాత జరిగే ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ను గుర్తించేందుకు వీలు కలుగుతుంది. సింథ్‌ఐడీ ప్రమాణానికి అనుకూలమైన మెటాడేటా ట్రాకింగ్‌ వ్యవస్థను కూడా ఇందులో కలిపారు. థర్మల్‌ మేనేజ్‌మెంట్‌లోనూ మార్పులు చేశారు. సిలికాన్‌ డైను సిస్టమ్‌ మెమరీకి పక్కన ఉంచి, మెమరీని ప్రధాన వేడి మార్గం నుంచి తొలగించారు. కొత్తగా రూపొందించిన వేపర్‌ ఛాంబర్‌ ఐఫోన్‌ 17 ప్రొ తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంది. దీంతో ఎక్కువసేపు నిరంతరంగా పనిచేసే సమయంలో పనితీరు 40 శాతం వరకు మెరుగుపడుతుందని యాపిల్‌ తెలిపింది.

ఎన్‌1 చిప్‌తో క‌నెక్టివిటీ..

కనెక్టివిటీ కోసం ఎన్‌1 చిప్‌ను ఉపయోగించారు. ఇది వైఫై 7, బ్లూటూత్‌ 6, థ్రెడ్‌ సాంకేతికతలకు మద్దతు ఇస్తుంది. సెల్యులార్‌ కనెక్టివిటీ కోసం సి2 మోడెమ్‌ ఉంది. సి1ఎక్స్‌తో పోలిస్తే ఇది విద్యుత్‌ వినియోగాన్ని 15 శాతం తగ్గిస్తుంది. అమెరికా ఎంఎంవేవ్‌ బ్యాండ్లకు కూడా మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే, చిన్న పరిమాణంలో పునఃరూపకల్పన చేసిన డైనమిక్‌ ఐలాండ్‌ను అందించారు. ఇందులో ఫేస్‌ఐడీ సెన్సార్‌ వ్యవస్థను కొనసాగిస్తూ ఒకేసారి మూడు లైవ్‌ యాక్టివిటీలను చూడ‌వచ్చు. ఐఫోన్‌ 18 ప్రొ లో 6.3 ఇంచులు, ఐఫోన్‌ 18 ప్రొ మ్యాక్స్‌లో 6.9 ఇంచుల ఓఎల్‌ఈడీ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేల‌ను ఇచ్చారు. 460 పీపీఐ, ప్రొ-మోషన్‌ టెక్నాలజీతో 120 హెడ్జ్‌ వరకు అడాప్టివ్‌ రిఫ్రెష్‌ రేట్‌, ఆల్వేస్‌-ఆన్‌ డిస్‌ప్లే, ట్రూ టోన్‌, సిరామిక్‌ షీల్డ్‌ 2 రక్షణ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పెరిగిన బ్యాట‌రీ బ్యాక‌ప్‌..

ఈ-సిమ్‌ మోడళ్లలో ఐఫోన్‌ 18 ప్రొ గరిష్ఠంగా 36 గంటల వీడియో ప్లేబ్యాక్‌, ఐఫోన్‌ 18 ప్రొ మ్యాక్స్‌ 45 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. సాధారణ వినియోగంలో ఇవి వరుసగా 24 గంటలు, 30 గంటల వరకు పనిచేస్తాయని కంపెనీ పేర్కొంది. వైర్డ్‌ ఛార్జింగ్‌తో సుమారు 15 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుంది. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో సుమారు 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ పొందవచ్చు. ఈ-సిమ్‌ మాత్రమే ఉండే వేరియంట్లను 12 దేశాలు, ప్రాంతాలకు విస్తరించనున్నారు. ఫిజికల్‌ సిమ్‌ ట్రే కోసం ఉపయోగించే అంతర్గత స్థలాన్ని పెద్ద బ్యాటరీ సెల్స్‌ కోసం ఉపయోగించడం ద్వారా ప్లేబ్యాక్‌ సమయం సుమారు రెండు గంటల వరకు పెరుగుతుందని యాపిల్‌ తెలిపింది. ఐఓఎస్‌ 27తో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. యాపిల్‌ ఇంటెలిజెన్స్‌పై ఆధారపడిన సిరి ఏఐ బీటా వెర్షన్‌ను ఇందులో పరిచయం చేశారు. స్క్రీన్‌పై కనిపిస్తున్న అంశాలను అర్థం చేసుకోవడం, వివిధ యాప్‌ల మధ్య సందర్భాన్ని గుర్తించడం, కెమెరా ద్వారా సమాచారం విశ్లేషించడం వంటి సామర్థ్యాలను కొత్త సిరి అందిస్తుంది. ఒకే ఫోన్‌ నంబర్‌ను పలు డివైస్‌ల‌లో ఉపయోగించేందుకు ఐఫోన్‌ హ్యాండాఫ్‌, మెరుగైన పేరెంటల్‌ మేనేజ్‌మెంట్‌ సెట్టింగ్స్‌, సఫారీలో వెబ్‌పేజీలకు సంబంధించిన అప్‌డేట్లను ట్రాక్‌ చేసేందుకు నోటిఫై మీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ప‌ర్యావ‌ర‌ణ హితంగా..

పర్యావరణ పరంగా కూడా కొత్త ఐఫోన్లలో మార్పులు చేశారు. మొత్తం 40 శాతం రీసైకిల్‌ మెటీరియల్‌ను ఉపయోగించారు. బ్యాటరీల్లో 100 శాతం రీసైకిల్‌ కోబాల్ట్‌, ఎన్‌క్లోజర్‌లలో 85 శాతం రీసైకిల్‌ అల్యూమినియంను ఉపయోగించారు. ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌కు బదులుగా ఫైబర్‌ ఆధారిత పదార్థాలను వినియోగించారు. ఐఫోన్‌ 18 ప్రొ బరువు 211 గ్రాములు కాగా ఐఫోన్‌ 18 ప్రొ మ్యాక్స్‌ బరువు 249 గ్రాములుగా ఉంది. రెండు ఫోన్లలోనూ 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ, 2 టీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు ఉన్నాయి. బ్లాక్‌, సిల్వర్‌, గ్లేసియర్‌, బర్గండీ రంగుల్లో ఇవి లభిస్తాయి. కెమెరా విభాగంలో 48 మెగాపిక్స‌ల్‌ ప్రొ ఫ్యూజన్‌ వైడ్‌ కెమెరా, 48 మెగాపిక్స‌ల్‌ 120 డిగ్రీల అల్ట్రా వైడ్‌ కెమెరా, 48 మెగాపిక్స‌ల్‌ ఫ్యూజన్‌ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. 8ఎక్స్‌ ఆప్టికల్‌-క్వాలిటీ జూమ్‌ ఇన్‌, 2ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ అవుట్‌, 16ఎక్స్‌ ఆప్టికల్‌-క్వాలిటీ జూమ్‌ రేంజ్‌, 40ఎక్స్‌ వరకు డిజిటల్‌ జూమ్‌ అందుబాటులో ఉంటుంది. ప్రధాన కెమెరాతో 4కె డాల్బీ విజన్‌ వీడియోను సెకనుకు 120 ఫ్రేమ్‌ల వరకు రికార్డ్‌ చేయవచ్చు. ఫ్రంట్‌లో 18 మెగాపిక్స‌ల్‌ సెంటర్‌ స్టేజ్‌ కెమెరా ఉంది. ఆటోఫోకస్‌, ఫోకస్ పిక్స‌ల్స్‌, రెటీనా ఫ్లాష్‌, 4కె డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌ వీడియో రికార్డింగ్‌, 1080పి స్లో-మోషన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫేస్‌ఐడీ కోసం ట్రూడెప్త్‌ కెమెరా, స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

ఐఫోన్‌ 18 ప్రొ 256 జీబీ వేరియంట్‌ భారత్‌లో రూ.1,64,900 ప్రారంభ ధరకు లభిస్తుంది. 512 జీబీ ధర రూ.1,89,900 కాగా, 1 టీబీ వేరియంట్ ధ‌ర రూ.2,39,900, 2 టీబీ వేరియంట్ ధ‌ర‌ రూ.3,14,900గా ఉంది. ఐఫోన్‌ 18 ప్రొ మ్యాక్స్‌ 256 జీబీ ధర రూ.1,79,900 నుంచి ప్రారంభమవుతుంది. 512 జీబీ ధర రూ.2,04,900, 1 టీబీ ధర రూ.2,54,900, 2 టీబీ ధర రూ.3,29,900గా ఉంది. ఈ ఐఫోన్లను యాపిల్‌ అధికారిక స్టోర్‌, యాపిల్‌ స్టోర్‌ యాప్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానుండగా, సెప్టెంబర్‌ 18 నుంచి 65కు పైగా దేశాలు, ప్రాంతాల్లో రిటైల్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement