త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | భారత్ కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటులో సగభాగమే : ప్ర‌ధాని మోదీ

PM Modi | వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలపై తప్పుడు నిందలు మోపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మండిపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల తలసరి కార్బన్ ఉద్గారాలు (per capita carbon emissions) భారత్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

D

National | Published On Sep 19, 2026, 1.59 pm IST

PM Modi | భారత్ కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటులో సగభాగమే : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలపై తప్పుడు నిందలు మోపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మండిపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల తలసరి కార్బన్ ఉద్గారాలు (per capita carbon emissions) భారత్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధన రంగాల్లో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆధ్వర్యంలో నిర్వహించిన “ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్” అంతర్జాతీయ సదస్సులో ప్ర‌ధాని పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అధికారిక ‘ఎన్‌జీటీ మొబైల్ యాప్’ను లాంఛనంగా ప్రారంభించారు. అనంత‌రం స‌ద‌స్సును ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

వాతావ‌ర‌ణ స‌వాళ్ల‌కు భార‌త్ ప‌రిష్కారాలు

"కార్బన్ ఉద్గారాల బాధ్యతను తరచూ అభివృద్ధి చెందుతున్న దేశాలపై తప్పుగా మోపుతుంటారు. కానీ చారిత్రక వాస్తవం ఏమిటంటే... నేటికీ భారత్ తలసరి కార్బన్ ఉద్గారాల వాటా ప్రపంచ సగటులో సగభాగం కంటే తక్కువే ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి కర్బన ఉద్గారాలు భారత్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్ర‌తి భార‌తీయుడు ఈ విష‌యాన్ని గ‌ట్టిగా చెప్పాలి" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రకృతి, పర్యావరణానికి సంబంధించిన అంశాలపై శతాబ్దాలుగా భారత్​ ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంద‌ని ప్ర‌ధాని గుర్తు చేశారు. ఆ చారిత్ర‌క స్ఫూర్తితోనే ప్ర‌స్తుత వాతావ‌ర‌ణ స‌వాళ్ల‌కు భార‌త్ త‌గిన ప‌రిష్కారాల‌ను చూపుతోంద‌న్నారు.

12 ఏళ్ల‌లో అన్ని రంగాల్లోనూ పురోగ‌తి

గత 12 ఏళ్లలో పర్యావరణ స‌మ‌స్య‌ల‌పై భార‌త్ సాధించిన పురోగ‌తిని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. భార‌త్‌ గ‌త 12 ఏళ్ల‌లో ప‌ర్యావ‌ర‌ణానికి సంబంధించిన ప్ర‌తీ రంగంలోనూ అసాధార‌ణ ప‌రోగ‌తి సాధించింద‌ని చెప్పారు. ముఖ్యంగా పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌పై (Renewable Energy) ప్రత్యేక దృష్టి పెట్టామ‌ని.. పర్యావరణ పరిరక్షణలో ఇది కీలక పాత్ర పోషించిందని చెప్పుకొచ్చారు. జీ-20 దేశాల కూటమిలో పారిస్ సీఓపీ-21 సమ్మిట్ హామీలను నిర్దేశిత గడువు కంటే ముందే అమలు చేసి చూపిన ఏకైక దేశం భార‌త్ మాత్ర‌మేన‌ని ప్ర‌ధాని స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించారు.

అణు విద్యుత్ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు

అదేవిధంగా భారత్ వేగంగా అణు విద్యుత్ ఉత్పాదన (Nuclear Power Generatio) వైపు అడుగులు వేస్తోందని ప్రధాని తెలిపారు. అయితే, ప‌ర్యావరణం గురించి సుదీర్ఘ ప్రసంగాలు ఇచ్చేవారే.. తాము అణు విద్యుత్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో క్లీన్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజ‌న్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయ‌ని చెప్పారు. కొద్ది రోజుల క్రిత‌మే ప్ర‌పంచంలోనే అత్యంత పొడ‌వైన దేశ‌పు తొలి హైడ్రోజ‌న్ రైలు ప్రారంభ‌మైంద‌ని గుర్తు చేశారు. 2014కు ముందు దేశంలో ఏడాదికి కేవ‌లం 3,000 ఈవీలు (Electric Vehicles) మాత్ర‌మే అమ్ముడ‌వ్వ‌గా.. గ‌తేడాది సుమారు 25 ల‌క్ష‌ల ఈవీలు అమ్ముడ‌య్యాయ‌ని వివ‌రించారు.

ప‌ర్యావ‌ర‌ణానికి ప్లాస్టిక్ వ్య‌ర్థాలు పెద్ద స‌వాలు

మెట్రో నెట్‌వర్క్ 20 నగరాల్లో 1,000 కిలోమీటర్లకు పైగా విస్తరించిందని చెప్పారు. రైల్వేల వంద శాతం విద్యుదీకరణతో కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అయ్యింద‌న్నారు. 'అమృత్ సరోవర్' పథకం కింద 70,000కు పైగా నీటి వనరులను, 'క్యాచ్ ది రెయిన్' కింద సుమారు 1.5 కోట్ల వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను నిర్మించినట్లు చెప్పారు. ఒక‌వైపు వేగంగా అభివృద్ధి సాధిస్తూనే మ‌రోవైపు సుస్థిర‌త‌ను కాపాడుకుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ర్యావ‌ర‌ణానికి ప్లాస్టిక్ వ్య‌ర్థాలు పెద్ద స‌వాలుగా మారాయ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. భార‌త్ ఇప్ప‌టికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించింద‌ని గుర్తు చేశారు. 'గోబర్ధన్' పథకం ద్వారా రోజూ వేలాది ట‌న్నుల ప్లాస్టిక్‌, ఇత‌ర ర‌కాల వ్య‌ర్థాల‌ను ఆధునిక ప‌ద్ధ‌తుల్లో రీసైకిల్ చేస్తూ వాతావరణ పరిరక్షణకు భారత్ నిరంతరం కృషి చేస్తోందని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు.

Also Read..

టీఎంసీ పేరు, గుర్తు గ‌ల్లంతు.. ఈసీ నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టులో స‌వాల్ చేసిన మ‌మ‌తా బెన‌ర్జీ

మ‌మ‌త‌కు షాక్‌.. ఉప ఎన్నిక‌ పోటీ నుంచి త‌ప్పుకున్న మ‌రో అభ్య‌ర్థి

కొత్త ఛార్జీల మోత‌.. రూ.2 వేలు దాటితే యూపీఐ చెల్లింపులు తీసుకోబోమంటున్న పెట్రోల్ బంకులు..!

Advertisement
Advertisement