త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chennai Metro Phase II | చెన్నైలో మోదీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం.. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మధురై రింగ్ రోడ్డు

చెన్నై మెట్రో ఫేజ్-2ను ప్రారంభించిన ప్రధాని మోదీ, సీఎం విజయ్‌తో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. రూ. వేల కోట్ల విలువైన రోడ్డు, రైల్వే, అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

J

National | Published On Oct 11, 2026, 3.54 pm IST

Chennai Metro Phase II | చెన్నైలో మోదీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం.. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మధురై రింగ్ రోడ్డు
Advertisement
  • రూ. 4,900 కోట్లతో నిర్మించిన చెన్నై మెట్రో ఫేజ్-2 (పూందమల్లి-వడపళని స్ట్రెచ్) ప్రారంభం
  • సీఎం విజయ్‌తో కలిసి ప్రధాని మోదీ మెట్రో రైలు ప్రయాణం
  • రూ.3,700 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులతో పాటు కోయంబత్తూరు, కారైకాల్‌లో రైల్వే ప్రాజెక్టులు జాతికి అంకితం
  • చెన్నై, వీవో చిదంబరనార్ పోర్టులలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మణలి రిఫైనరీలో లూబ్ ఆయిల్ బేస్ స్టాక్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • ఐఐటీ మద్రాస్‌లో సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్‌ను ప్రారంభించి, గ్లోబల్ సైంటిఫిక్ మిషన్‌ను లాంచ్ చేసిన ప్రధాని

Chennai Metro Phase II | త్రినేత్ర న్యూస్ : చెన్నై నగరంలో ఆదివారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగా చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుంచి పూందమల్లి బైపాస్ స్టేషన్ వరకు ప్రధాని మోదీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయనతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (Tamilnadu CM Vijay) కూడా ఉన్నారు. ఇద్దరు నేతలు మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదించడం విశేషం.

రూ.4,900 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన పూందమల్లి-వడపళని స్ట్రెచ్‌ను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. దీనివల్ల నగరంలో రద్దీ తగ్గి ప్రయాణం మరింత సులభం కానుంది.

రోడ్డు, రైల్వే కనెక్టివిటీకి పెద్దపీట

తమిళనాడులో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి సుమారు రూ.3,700 కోట్ల విలువైన జాతీయ రహదారి (NH) ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభించారు.

ఎన్‌హెచ్-744: 36 కి.మీ పొడవున్న వడుగుపట్టి-తేర్కువెంగనల్లూర్ నాలుగు వరుసల సెక్షన్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇది పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలకు కనెక్టివిటీని పెంచుతుంది. అలాగే మధురై రింగ్ రోడ్డు ప్రాజెక్టు ద్వారా నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

రైల్వే ప్రాజెక్టులు: రూ.750 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో కారైకాల్-పెరాలం రైలు మార్గంతో పాటు కోయంబత్తూరులో మూడు రైల్ ఫ్లైఓవర్లు ఉన్నాయి. వీటివల్ల ప్రయాణికుల సమయం ఆదా కావడంతో పాటు రోడ్డు భద్రత పెరుగుతుంది.

అమృత్ స్టేషన్లు: పళని, వెల్లూరు కంటోన్మెంట్, అంబసముద్రం, నామకల్ స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించి జాతికి అంకితం చేశారు.

పోర్టులు, మౌలిక సదుపాయాలు

సముద్ర రవాణా రంగాన్ని బలోపేతం చేయడానికి చెన్నై పోర్టు, వీవో చిదంబరనార్ పోర్టులలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. చెన్నై పోర్టులో పేవ్‌డ్ స్టోరేజ్ యార్డ్, ఎగ్జిమ్ గోడౌన్లు, అప్‌గ్రేడ్ చేసిన క్రూయిజ్ టెర్మినల్, సీఫేరర్స్ క్లబ్‌లను ప్రారంభించారు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్) ఆధ్వర్యంలో మణలి రిఫైనరీలో రూ. 1,620 కోట్ల వ్యయంతో చేపట్టనున్న లూబ్ ఆయిల్ బేస్ స్టాక్స్ (LOBS) ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

ఐఐటీ మద్రాస్‌లో బ్రెయిన్ సెంట్రల్ ప్రారంభం

చెన్నై ఐఐటీలో సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ (SGBC)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. మానవ మెదడుకు సంబంధించిన 1,000 పైగా మైక్రోస్కోపిక్ సెక్షన్లతో కూడిన 'సీ-స్ట్రోక్' (C-STROKE) అట్లాస్‌ను విడుదల చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు కొత్త వైద్య చికిత్సల అన్వేషణకు ఎంతో సహాయపడుతుంది.

అనంతరం చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. విద్యారంగానికి ఆ పాఠశాల అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

Also Read | ఢిల్లీలో ఇంట‌ర్నెట్‌, మెట్రో సేవ‌ల‌ను పున‌రుద్ధ‌రించండి : సుప్రీంకోర్టు

Advertisement
Advertisement