త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Rupee | డాలర్‌తో పోరులో రూపాయి రికవరీ.. రూ.92.50కి చేరుతుందా..?

Indian Rupee | అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ఠ స్థాయి రూ.96.90కి పడిపోయిన భారత రూపాయి తాజాగా 3 శాతానికి పైగా కోలుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం రూపాయి బలపడేందుకు దోహదం చేస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే డిసెంబర్ చివరి నాటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.92.50 స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

S

Business | Published On Nov 9, 2026, 1.27 pm IST

Indian Rupee | డాలర్‌తో పోరులో రూపాయి రికవరీ.. రూ.92.50కి చేరుతుందా..?
Advertisement

Indian Rupee | అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ఠ స్థాయి రూ.96.90కి పడిపోయిన భారత రూపాయి తాజాగా 3 శాతానికి పైగా కోలుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం రూపాయి బలపడేందుకు దోహదం చేస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే డిసెంబర్ చివరి నాటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.92.50 స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భార‌త రూపాయి విలువ ఎందుకు పెరుగుతోంది..?

భారత రూపాయి విలువలో గణనీయమైన రికవరీ కనిపిస్తోంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 10 పైసలు బలపడి డాలర్‌తో పోలిస్తే రూ.93.81 వద్ద ప్రారంభమైంది. గత ముగింపు విలువ రూ.93.91గా ఉంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురైన రాజకీయ ఎదురుదెబ్బ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోవడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీ మార్కెట్లలో తిరిగి పెట్టుబడులు పెట్టడం రూపాయి రికవరీకి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కోటక్ నియో కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరగకపోతే రూపాయి మరింత బలపడే అవకాశం ఉందన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 94 స్థాయిని అధిగమిస్తే ఎగుమతిదారులు తమ విదేశీ మారకపు ఆదాయాన్ని విక్రయించేందుకు ముందుకు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని, దీంతో రూపాయి విలువ రూ.92.50 వరకు చేరే అవకాశముందని తెలిపారు. అంతర్జాతీయ వడ్డీ రేట్ల పరిస్థితులు అనుకూలంగా మారి, చమురు ధరలు తక్కువ స్థాయిలో కొనసాగితే 2027లో రూపాయి రూ.90 దిగువకు కూడా వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

రూపాయి మ‌రింత బ‌ల‌ప‌డ‌నుందా..?

మరోవైపు.. సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ పబారి కూడా రూపాయి మరింత బలపడే చాన్స్ ఉంద‌ని అంచనా వేశారు. డాలర్-రూపాయి మారకపు విలువ 94 స్థాయి దిగువకు రావడంతో రూపాయి రూ.93.50, రూ.93 స్థాయిలకు చేరే అవకాశాలు పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం డాలర్-రూపాయి జోడీకి రూ.94.40-94.50 స్థాయిలో తక్షణ నిరోధం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగి ఒప్పందం కుదిరితే కొత్తగా సైనిక దాడులు జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సంకేతాలివ్వడం, ఖతార్ కూడా వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించడం అంతర్జాతీయ చమురు సరఫరాపై ఆందోళనలను తగ్గించాయి. ఒకప్పుడు బ్యారెల్‌కు 117.64 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం 100 డాలర్ల దిగువకు పడిపోయి సుమారు 97 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీనికి తోడు ఎన్ఎస్‌డీఎల్ గణాంకాల ప్రకారం నవంబర్‌లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల్లో సుమారు 4.1 బిలియన్ డాలర్ల నికర పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్‌లో భారీగా జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఇది గణనీయమైన మార్పు.

భ‌విష్య‌త్తు ఏమిటి..?

అయితే అమెరికా డాలర్ బలం రూపాయికి సవాలుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్‌లో అమెరికా వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాల సంఖ్య మార్కెట్ అంచనా 65 వేల కంటే ఎక్కువగా 1.65 ల‌క్ష‌లు పెరిగింది. దీంతో అమెరికా పదేళ్ల బాండ్ల రాబడి 4.88 శాతానికి చేరగా, డాలర్ ఇండెక్స్ 102 స్థాయిని దాటింది. మంగళవారం వెలువడనున్న అమెరికా అక్టోబర్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలపై ఇప్పుడు మార్కెట్ల దృష్టి ఉంది. ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదైతే ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచుతుంద‌నే అంచనాలు బలపడి, డాలర్ మరింత బలపడే అవకాశం ఉంటుంది. అందువ‌ల్ల భార‌త రూపాయి మ‌రింత బ‌ల‌ప‌డాలంటే రాబోయే రోజుల్లో చోటుచేసుకోనున్న మార్పులు, వెలువ‌డ‌నున్న గ‌ణాంకాలు కీల‌కం కానున్నాయి.

Advertisement
Advertisement