త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | రిజర్వేషన్లు పొందడం వారి హ‌క్కు.. ఇంకా వేచి చూడటం సబబు కాదు.. మ‌హిళ‌ల‌కు ప్ర‌ధాని లేఖ‌

PM Modi | మహిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లును (Women's Reservation Bill) అమల్లోకి తెస్తే భారత రాజ్యాంగం మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.

D

National | Published On Apr 14, 2026, 3.34 pm IST

PM Modi | రిజర్వేషన్లు పొందడం వారి హ‌క్కు.. ఇంకా వేచి చూడటం సబబు కాదు.. మ‌హిళ‌ల‌కు ప్ర‌ధాని లేఖ‌
Advertisement

PM Modi | మహిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లును (Women's Reservation Bill) అమల్లోకి తెస్తే భారత రాజ్యాంగం మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. నేడు భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్ (Babasaheb Ambedkar) జ‌యంతి సంద‌ర్భంగా దేశ మ‌హిళ‌ల‌కు ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా లేఖ రాశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ప్రస్తుత తరుణంలో, చట్టసభల్లోనూ వారి భాగస్వామ్యాన్ని పెంచడం సముచితమని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

"రాబోయే రెండు రోజుల్లో.. అంటే ఏప్రిల్‌ 16వ తేదీన నారీ శక్తి వందన్ అధినియంకు సంబంధించిన ముఖ్యమైన రాజ్యాంగ సవరణపై చర్చించి ఆమోదించ‌డానికి పార్లమెంటు సమావేశమవుతుంది. దీనిపై ఏమాత్రం ఆలస్యం జరిగినా అది భారతదేశ మహిళలకు అన్యాయం చేసినట్టే. 2029 లోక్‌సభ ఎన్నికల సమయానికి మహిళల రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. 'వికసిత్ భారత్' నిర్మాణంలో భాగస్వాములు కావడానికి బలమైన అవకాశం లభిస్తున్నందుకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు" అని ప్ర‌ధాని మోదీ అన్నారు.

మ‌హిళ‌లు అన్ని రంగాల్లోనూ త‌మ‌దైన ముద్ర వేస్తున్నార‌ని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు. "స్టార్టప్ ప్రపంచాన్ని చూడండి.. వాటిలో చాలా వరకు మహిళలే నాయకత్వ బాధ్యతల్లో ఉన్నారు. 21వ శతాబ్దంలో మానవాళి పురోగతికి మార్గదర్శకంగా నిలుస్తున్న సైన్స్ అండ్ టెక్నాల‌జీల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. అకడమిక్స్, సాహిత్యం, కళలు, సంగీతం, సినిమా వంటి త‌దిత‌ర‌ రంగాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది" అని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు.

చట్టసభల్లో రిజర్వేషన్లు పొందడం మ‌హిళ‌ల హ‌క్కు అని ప్ర‌ధాని తెలిపారు. వారి హక్కుల కోసం జీవితాంతం వేచి చూడటం సబబు కాద‌ని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు త‌మ‌ బలమైన వాణిని వినిపించే అవకాశాలు ఏర్పడితే, దేశ ప్రజాస్వామిక వాణి సైతం మరింత బల‌ప‌డుతుంద‌న్నారు. ఏప్రిల్ 16 నుంచి జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సెషన్ సందర్భంగా రాజ్యాంగ సవరణలను ఆమోదం కోసం, దేశం నలుమూలలా ఉన్న కోట్లాది మంది మహిళల ఆశీస్సులు కోరుకుంటున్న‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. ఈ ప్ర‌త్యేక పార్లమెంట్ స‌మావేశాల్లో పాల్గొనాలని మ‌హిళ‌లు త‌మ స్థానిక ఎంపీల‌కు లేఖ రాయాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని సూచించారు.

"మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పురుషులతో సమానంగా మహిళలకూ హక్కులు లభించాయి. సమాన హక్కుల కోసం ఇతర ప్రపంచ దేశాల్లోని మహిళలు వందల సంవత్సరాలు ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి వచ్చింది. మన దేశ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు నాలుగు దశాబ్దాల్లో చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ అవేవీ ఫ‌లించ‌లేదు. వాటిపై అన్ని రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. ఈనేపథ్యంలో మేము 2023లో నారీశక్తి వందన్ అధినియం చట్టాన్ని ఆమోదించాం. దీన్ని 2029 నుంచే అమల్లోకి తెచ్చే రాజ్యాంగ సవరణలను ఈ పార్లమెంటు సెషన్‌లో ఆమోదించి తీరుతాం. ఇందుకోసం ఇదే సరైన సమయం. ఈ చట్టం అమలు కోసం యావత్ దేశ మహిళలు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు" అని ప్రధాని మోదీ తెలిపారు.

Also Read..

'అడ్డంగా న‌రుకుతాం'.. మ‌క్కాన్ సింగ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మంత్రి శ్రీధ‌ర్ బాబు

ఇదే నా చివ‌రి హెచ్చ‌రిక‌.. బిల్లుపాసైతే త‌మిళ‌నాడు స్తంభించిపోతుంది.. కేంద్రానికి సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్‌

ద‌క్షిణాది ప్ర‌జ‌ల్లో సీఎం రేవంత్ విద్వేషం ర‌గిలిస్తున్నాడు : బండి సంజ‌య్

Advertisement
Advertisement