త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

INS Mahendragiri | భార‌త నౌకాదళంలోకి చేరిన ‘మహేంద్రగిరి’.. ఇక శ‌త్రువుల‌కు ద‌డే

INS Mahendragiri | భారత నౌకాదళం (Indian Navy) అమ్ముల‌పొదిలోకి మరో అత్యాధునిక యుద్ధనౌక వ‌చ్చి చేరింది. స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి ( INS Mahendragiri) అధికారికంగా జ‌ల‌ప్ర‌వేశం చేసింది.

D

National | Published On Jul 11, 2026, 1.50 pm IST

INS Mahendragiri | భార‌త నౌకాదళంలోకి చేరిన ‘మహేంద్రగిరి’.. ఇక శ‌త్రువుల‌కు ద‌డే
Advertisement

INS Mahendragiri | భారత నౌకాదళం (Indian Navy) అమ్ముల‌పొదిలోకి మరో అత్యాధునిక యుద్ధనౌక వ‌చ్చి చేరింది. స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి ( INS Mahendragiri) అధికారికంగా జ‌ల‌ప్ర‌వేశం చేసింది. విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన 'ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి' (INS Mahendragiri) యుద్ధనౌక ప్రారంభోత్సవ (కమిషనింగ్) వేడుకకు ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఈ యుద్ధనౌకను భారత నావికాదళంలో జలప్రవేశం చేయించి జాతికి అంకితం చేశారు.

అనంత‌రం రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాద‌ని చెప్పారు. భారత నౌకాదళం శక్తి, సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుంద‌న్నారు. మ‌హేంద్ర‌గిరి జ‌ల‌ప్రవేశం ర‌క్ష‌ణ రంగంలో భార‌త‌దేశ స్వ‌యం స‌మృద్ధికి, స్వ‌దేశీ యుద్ధ‌నౌక‌ల నిర్మాణ ప్ర‌తిభ‌కు మైలురాయిగా నిలిచింద‌ని కొనియాడారు.

దేశానికి చెందిన 90 శాతానికి పైగా వాణిజ్యం సముద్రం ద్వారానే జరుగుతోందని ఈ సంద‌ర్భంగా రాజ్‌నాథ్ తెలిపారు. అందుకే దేశ ఆర్థిక వృద్ధికి, ఇంధన భద్రతకు సముద్ర రక్షణ అత్యంత కీలకమని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యుద్ధ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి నూతన సాంకేతికతలు యుద్ధ స్వరూపాన్నే మార్చేయొచ్చని చెప్పారు. కానీ అంతిమంగా విజయాన్ని నిర్ణయించేది మాత్రం సంప్రదాయ సైనిక సామర్థ్యాలు, శిక్షణ పొందిన సైనికులు, దేశ సంకల్పమేనని రాజ్‌నాథ్ తెలిపారు. అధునాతన సాంకేతికతలు సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను భర్తీ చేయలేవని స్ప‌ష్టం చేశారు.

భారత నౌకాదళం యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 17A కింద రూపొందించిన ఆరో యుద్ధనౌక ఇది అని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కింద మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) నిర్మించిన చివరి యుద్ధనౌక ఇదేనని చెప్పారు. ప్రాజెక్ట్ 17A కింద ఇప్ప‌టికే.. ఐఎన్‌ఎస్ నీలగిరి, ఐఎన్‌ఎస్ ఉదయగిరి, ఐఎన్‌ఎస్ హిమగిరి, ఐఎన్‌ఎస్ తారాగిరి, ఐఎన్‌ఎస్ దూనగిరి కమిషన్ చేసినట్లు రాజ్‌నాథ్ వివ‌రించారు. ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో వ్యూహాత్మక హిందూ పసిఫిక్ ప్రాంతంలో భారత సముద్ర ప్రయోజనాల రక్షణలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుంది.

మ‌హేంద్రగిరి ప్రత్యేకతలు..

    • బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనతలంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ధనౌక సొంతం
    • గగనతలం, సముద్ర ఉపరితలం, నీటి అడుగున ఏకకాలంలో వచ్చే ముప్పులను సమర్థవంతంగా తిప్పికొట్టగలదు
    • ఈ నౌకను ప్రత్యేకమైన డిజైన్‌తో నిర్మించారు. అందువల్ల ఇది శత్రువుల రాడార్లకు అంత ఈజీగా దొర‌క‌దు.
    • దీని నిర్మాణంలో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను వాడారు.
    • తూర్పు కనుమల్లోని ప్ర‌సిద్ధ మహేంద్రగిరి పర్వత శ్రేణుల పేరును ఈ నౌక‌కు పెట్టారు. భారత నావికాదళంలో ఈ పేరుతో చేరిన తొలి యుద్ధనౌకగా ఇది సరికొత్త చరిత్రను సృష్టించింది.
    • నౌక పొడవు 149 మీటర్లు, వెడల్పు 17.8 మీటర్లు, బరువు 6,670 టన్నులు
    • గరిష్టంగా 28 నాట్ల వేగంతో ప్రయాణించగలదు

Also Read..

జులై 30 నాటికి రామ మందిరం నిర్మాణ ప‌నులు పూర్తి : నృపేంద్ర మిశ్రా

న‌న్ను హ‌త‌మారిస్తే.. ఇరాన్ బూడిద‌వ‌క త‌ప్ప‌దు.. ట్రంప్ హెచ్చ‌రిక‌లు

దుమారం రేపుతున్న మెటా మ్యూస్ ఏఐ.. యూజ‌ర్ల ప్రైవ‌సీపై ఆందోళ‌న‌లు..

Advertisement
Advertisement