త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కేసీఆర్ ఏం చేశారని అంటున్నారు.. వాళ్ల‌కు ఈ నలుపు-తెలుపు అక్షరాలే బ‌ల‌మైన స‌మాధానం

Harish Rao | "కేసీఆర్ అసలు ఏం చేశారు?" అని అడిగే వారికి ఈరోజు న‌లుపు-తెలుపు అక్ష‌రాల్లో స్ప‌ష్ట‌మైన స‌మాధానం ల‌భించింద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధిపై ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఇచ్చిన నివేదికపై శ‌నివారం ఆయ‌న‌ ఎక్స్ వేదికగా స్పందించారు.

S

Telangana | Published On Jul 11, 2026, 1.01 pm IST

Harish Rao | కేసీఆర్ ఏం చేశారని అంటున్నారు.. వాళ్ల‌కు ఈ నలుపు-తెలుపు అక్షరాలే బ‌ల‌మైన స‌మాధానం
Advertisement
  • అటువంటి వారికి ఆర్బీఐ లెక్కలే చెంపపెట్టు
  • సంఖ్య‌లు అబ‌ద్ధం చెప్ప‌వు
  • ఎక్స్ వేదిక‌గా స్పందించిన మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: "కేసీఆర్ అసలు ఏం చేశారు?" అని అడిగే వారికి ఈరోజు న‌లుపు-తెలుపు అక్ష‌రాల్లో స్ప‌ష్ట‌మైన స‌మాధానం ల‌భించింద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధిపై ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఇచ్చిన నివేదికపై శ‌నివారం ఆయ‌న‌ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్‌ను ఏం చేసిండు? అని విమర్శించే వాళ్లకు ఆర్బీఐ లెక్కలే చెంపపెట్టు అన్నారు. దేశ వ్యవసాయ వృద్ధిలో తెలంగాణదే ఫస్ట్ ప్లేస్ అని కొనియాడారు. 2016-17, 2024-25 మధ్య కాలంలో6.9 శాతం సగటు వృద్ధితో టాప్‌లో ఉంద‌న్నారు. తమిళనాడు, అస్సాం లాంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ‌ అగ్రస్థానంలో నిలిచింద‌ని వివ‌రించారు.

ప‌దేండ్లు నిర్మించిన వ్య‌వ‌స్థ అది..

కాళేశ్వరం, 24 గంటల ఉచిత కరెంట్, పక్కా ప్రణాళికతోనే కేసీఆర్ వ్యవసాయ విప్లవం సాధ్యమైంది. కానీ.. కాంగ్రెస్ వచ్చిన ఈ రెండున్నరేళ్లలోనే తెలంగాణ వ్యవసాయ వ్యవస్థ కుప్పకూలింది. కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు, వడ్లు కొనే దిక్కులేక మళ్లీ రైతాంగం ఆగమాగమవుతున్నది. కేసీఆర్ పదేండ్లు కష్టపడి నిర్మించిన వ్యవసాయ వ్యవస్థ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుప్పకూలింది అని హ‌రీశ్ రావు ఆవేద‌న చెందారు.

సంఖ్యలు అబద్ధం చెప్పవు. "కేసీఆర్ ఏం చేశారు?" అనే ప్రశ్నకు ఇదే సమాధానం.. కొన్నేళ్లుగా, విమర్శకులు రాజకీయ ప్రత్యర్థులు నిరంతరం ఒకే ఒక అవహేళనతో కూడిన ప్రశ్నను అడుగుతూ వచ్చారు. ఇప్పుడు కాగితం మీద నలుపు-తెలుపు అక్షరాల్లో స్పష్టమైన సమాధానం లభించింది.

కేసీఆర్ విజ‌న్‌, కార్యాచ‌ర‌ణ వల్లే సాధ్య‌మైంది..

తమిళనాడు (5.99%), మణిపూర్ (5.59%), అస్సాం (5.45%)తో పాటు మిగతా అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ‌ ఎంతో ముందంజలో ఉంది. ఇది రాజకీయ ప్రకటన కాదు. తెలంగాణ వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పును ధృవీకరిస్తూ వెలువడిన స్వతంత్ర సంస్థ అధికారిక అంచనా. ఈ విజయం రాత్రికి రాత్రే సాధ్యం కాలేదు.
కేసీఆర్‌ విజన్, పటిష్టమైన కార్యాచరణ వల్లనే ఇది సాధ్యమైంది అని మాజీ మంత్రి గుర్తు చేశారు.

కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి భారీ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి భరోసా. రైతులకు ఉచిత, నాణ్యమైన 24 గంటల విద్యుత్, సకాలంలో విత్తనాలు, ఎరువుల లభ్యత, ప్రతి రైతు కుటుంబానికి కొండంత అండగా నిలిచిన సమర్థవంతమైన ధాన్యం కొనుగోలు వ్యవస్థ.. ఈ సంస్కరణలే తెలంగాణను దేశంలోనే అగ్రగామి వ్యవసాయ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపాయి. రాజకీయ ప్రచారాలు, విమర్శలు లేదా ఎంపిక చేసిన అబద్ధాల కంటే ఈ అధికారిక గణాంకాలే చాలా గట్టిగా మాట్లాడుతున్నాయి అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఎంతో కష్టపడి సాధించిన ఈ అద్భుతమైన ప్రగతి ఇప్పుడు తీవ్ర సవాలును ఎదుర్కొంటోంది. కేవలం రెండున్నరేళ్ల కాలంలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్ర అనిశ్చితిలోకి నెట్టేసింది. నీటి కొరత, విద్యుత్ అంతరాయాలు, యూరియా కొరత, అస్తవ్యస్తమైన కొనుగోలు వ్యవస్థల వల్ల తెలంగాణ వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల విజన్, ప్రణాళిక, కృషితో వ్య‌వ‌సాయాన్ని గాడిలో పెడితే కేవలం రెండున్నరేళ్లలోనే నాశ‌నం చేశారు. తెలంగాణ సాధించుకున్న ఈ విజయాలను, ప్రగతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేజార్చుకుంటోంది? అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

 

Advertisement
Advertisement