త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta | దుమారం రేపుతున్న మెటా మ్యూస్ ఏఐ.. యూజ‌ర్ల ప్రైవ‌సీపై ఆందోళ‌న‌లు..

Meta | ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంస్థ మెటా ఇటీవ‌లే త‌న కొత్త ఇమేజ్ జ‌న‌రేష‌న్ ఏఐ మోడ‌ల్ మ్యూస్ ఇమేజ్‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. దీని వ‌ల్ల ఏఐతో యూజ‌ర్లు త‌మ ఫొటోల‌ను మ‌రింత మెరుగ్గా క‌నిపించేలా చేయ‌వ‌చ్చు. ఇది ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లో అందుబాటులో ఉంది.

S

Technology | Published On Jul 11, 2026, 1.35 pm IST

Meta | దుమారం రేపుతున్న మెటా మ్యూస్ ఏఐ.. యూజ‌ర్ల ప్రైవ‌సీపై ఆందోళ‌న‌లు..
Advertisement

Meta | ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంస్థ మెటా ఇటీవ‌లే త‌న కొత్త ఇమేజ్ జ‌న‌రేష‌న్ ఏఐ మోడ‌ల్ మ్యూస్ ఇమేజ్‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. దీని వ‌ల్ల ఏఐతో యూజ‌ర్లు త‌మ ఫొటోల‌ను మ‌రింత మెరుగ్గా క‌నిపించేలా చేయ‌వ‌చ్చు. ఇది ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లో అందుబాటులో ఉంది. అయితే మెటా మ్యూస్‌ ఇమేజ్ ఏఐ మోడ‌ల్‌పై స‌ర్వ‌త్రా ప్రైవ‌సీ ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ టూల్ లో ఉన్న ఓ ఫీచ‌ర్ వ‌ల్ల ఆయా ప్లాట్‌ఫామ్‌ల‌లోని యూజ‌ర్ల ప్రైవ‌సీ దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంద‌ని ది వెర్జ్ వెల్ల‌డించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌బ్లిక ప్రొఫైల్ క‌లిగిన ఎవ‌రైనా ఒక‌ వ్య‌క్తి ఫొటోను ఏఐ ద్వారా మార్చి కొత్త ఫొటోను క్రియేట్ చేసే సౌక‌ర్యాన్ని మ్యూస్ అందిస్తోంది. ఇందుకుగాను ఆ వ్య‌క్తిని ట్యాగ్ చేస్తే స‌రిపోతుంది. అనంతరం మ్యూస్ ఆ ఫొటోను ఉప‌యోగించి పూర్తిగా కొత్త ఏఐ ఫొటోను రూపొందించి అందిస్తుంది. అయితే ఈ ఫీచ‌ర్ ప్రైవ‌సీకి పెద్ద ముప్పుగా మారే అవ‌కాశం ఉంద‌ని ది వెర్జ్ తెలిపింది.

మ్యూస్ ఏఐ, మెటాపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు..

ది వెర్జ్ త‌న సోష‌ల్ మీడియా ఖాతా ఎక్స్‌లో ఓ పోస్టు ద్వారా ప‌లు కీల‌క విష‌యాల‌ను మ్యూస్ గురించి వెల్ల‌డించింది. మ్యూస్ ఇమేజ్ ఏఐ మోడ‌ల్ యూజ‌ర్ల అనుమ‌తి లేకుండా వారి ఫొటోల‌ను క్రియేషన్, ఎడిటింగ్ కోసం వాడుతుంద‌ని స‌ర్వ‌త్రా మెటాపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీని వ‌ల్ల ఈ ఫీచ‌ర్‌ను కొంద‌రు దుర్వినియోగం చేసే అవ‌కాశం ఉంద‌ని యూజ‌ర్లు వాదిస్తున్నారు. ఈ మేర‌కు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో మెటాను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. స్ప‌ష్ట‌మైన అనుమ‌తి లేకుండా నిజ‌మైన వ్య‌క్తుల ఫొటోల‌ను ఏఐ క్రియేట్ చేసిన ఫొటోల్లో ఉప‌యోగించ‌డం ప్రైవ‌సీకి పెద్ద ప్ర‌మాదం అని యూజ‌ర్లు కామెంట్లు పెడుతున్నారు.

వ‌ద్ద‌నుకుంటే ఆప‌వ‌చ్చు..

మెటా తెలిపిన ప్ర‌కారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న యూజ‌ర్ల కంటెంట్‌ను మెటా ఏఐ ఫీచ‌ర్ల ద్వారా ఇత‌రులు ఉప‌యోగించి కొత్త కంటెంట్‌ను క్రియేట్ చేసే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా యూజ‌ర్ల ఫొటోల‌ను ఎవ‌రైనా ఈ విధంగా ఉప‌యోగించినా అస‌లు యూజ‌ర్ల‌కు ఎలాంటి నోటిఫికేష‌న్‌ను పంప‌బోమ‌ని మెటా స్ప‌ష్టం చేసింది. దీని వ‌ల్ల యూజ‌ర్ల ప్రైవ‌సీకి తీవ్ర ముప్పు ఉంటుంద‌ని యూజ‌ర్లు ఆరోపిస్తున్నారు. వినియోగ‌దారుల‌కు ఈ ఫీచ‌ర్‌ను నిలిపివేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ అది ఆప్ట్ అవుట్ విధానంలో ప‌నిచేస్తుంది. అంటే ఇది డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. దీన్ని వ‌ద్ద‌నుకుంటే యూజ‌ర్లు యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అయితే దీని గురించి చాలా మందికి తెలియ‌నందున ఈ ఫీచ‌ర్ దుర్వినియోగానికి గురయ్యే అవ‌కాశం ఉంద‌ని యూజ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

గ‌తంలోనూ మెటాకు ఇబ్బందులు..

ఈ అంశంపై ప్రజ‌ల్లో ఆందోళ‌న పెర‌గ‌డానికి గ‌తంలో జ‌రిగిన ప‌లు సంఘ‌ట‌న‌లే ప్ర‌ధాన కార‌ణాలుగా నిలుస్తున్నాయి. గ‌తంలోనూ మెటా ప్రైవ‌సీ విష‌యంలో ఇలాంటి విమ‌ర్శ‌ల‌నే అనేక సార్లు ఎదుర్కొంది. 2019లో కేంబ్రిడ్జి అన‌లిటికా వ్య‌వ‌హారంలో కోట్లాది ఫేస్‌బుక్ వినియోగ‌దారుల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని అనుమ‌తి లేకుండా రాజ‌కీయ ల‌క్ష్యాల కోసం ఉప‌యోగించిన కేసులో అమెరికా ఎఫ్టీసీ మెటాపై అప్ప‌టి వ‌ర‌కు ఎన్న‌డూ లేని విధంగా 5 బిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధించింది. ఈ దుర్వినియోగం గురించి సంస్థ‌కు ముందుగానే తెలిసినా త‌గిన చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. అలాగే 2021 లో స‌రైన అనుమ‌తి లేకుండా బ‌యో మెట్రిక్ డేటాను సేక‌రిస్తుంద‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. దీంతో మెటాకు అప్ప‌ట్లో న్యాయ‌ప‌ర‌మైన ఒత్తిళ్లు ఎదుర‌య్యాయి. ఈ క్ర‌మంలో మెటా అప్ప‌ట్లో ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ వ్య‌వ‌స్థ‌ను నిలిపివేసింది.

గ‌తంలోని విధానాల‌కు ఇది కొన‌సాగింపా..

ఈ నేపథ్యంలో మ్యూస్‌లోని ఆప్ట్-అవుట్ ఫొటో ట్యాగింగ్ విధానం కూడా మెటా గతంలో అనుసరించిన విధానానికే కొనసాగింపుగా ఉందని విమర్శకులు భావిస్తున్నారు. అంటే వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని డిఫాల్ట్‌గా ఉపయోగించడం, దాన్ని నిలిపివేయాలంటే వినియోగదారులే ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి మళ్లీ కనిపిస్తోందని అంటున్నారు. మ్యూస్ ఇమేజ్‌తోపాటు మెటా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ కోసం కొత్త ఏఐ ఎఫెక్ట్స్‌ను కూడా విడుదల చేస్తోంది. ఇవి కూడా ఇదే మ్యూస్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. స్టోరీస్‌లోనే ఫొటోలను ప్రత్యేక ఫిల్టర్లతో మార్చుకునే అవకాశం కల్పిస్తాయి. సాధారణ వినియోగదారులు మ్యూస్‌ను ఉచితంగా ఉపయోగించవచ్చని మెటా తెలిపింది. అయితే నిర్దిష్ట పరిమితిని దాటిన తర్వాత చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ అవసరం అవుతుందని స్పష్టం చేసింది. అలాగే మ్యూస్ వీడియో అనే ఏఐ వీడియో జనరేటర్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాల‌ను ఇంకా వెల్లడించలేదు.

మెటా ఏఐ వ్యూహం స్ప‌ష్టంగా లేదా..?

గతేడాది నుంచి మెటా వరుసగా అనేక ఏఐ ఉత్పత్తులను విడుదల చేస్తోంది. క్రియేటర్ అనే ఏఐ అసిస్టెంట్, తక్కువ కోడింగ్‌తో వీడియో గేమ్‌లు రూపొందించేందుకు ఉపయోగించే పాకెట్ యాప్ వంటి సేవలను కూడా ఇప్పటికే తీసుకొచ్చింది. అయినప్పటికీ సంస్థ ఏఐ వ్యూహం స్పష్టంగా లేదన్న విమర్శలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్ ప్రొఫైల్ ఉపయోగిస్తున్న వారు తమ ఫొటోలను మ్యూస్ ద్వారా ఇతరులు ఉపయోగించకుండా ఉండాలనుకుంటే, మ్యూస్ సెట్టింగ్స్‌ను ఒకసారి పరిశీలించి అవసరమైతే సంబంధిత సెట్టింగ్‌ను ఆఫ్ చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement