త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

INDIA bloc | జ్ఞానేశ్‌ రాజీనామా చేయాల్సిందే.. ‘సేవ్ డెమొక్రసీ’ నిరసనలకు పిలుపునిచ్చిన ఇండీ కూట‌మి

INDIA bloc | కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకలపై విపక్ష ఇండీ కూటమి (India alliance) తమ ఐక్య కార్యాచరణను ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే ప్రకటించారు.

D

National | Published On Sep 30, 2026, 3.46 pm IST

INDIA bloc | జ్ఞానేశ్‌ రాజీనామా చేయాల్సిందే.. ‘సేవ్ డెమొక్రసీ’ నిరసనలకు పిలుపునిచ్చిన ఇండీ కూట‌మి
Advertisement

INDIA bloc | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకలపై విపక్ష ఇండీ కూటమి (India alliance) పోరాటానికి సిద్ధ‌మైంది. ఈ మేర‌కు నేడు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన కీలక భేటీలో తమ ఐక్య కార్యాచరణను ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల సంఘం, బీజేపీ వైఖరిపై విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామాకు డిమాండ్ చేశాయి.

INDIA కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీకి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో ఇండీ కూటమి ఐక్యంగా ఉందని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే స్ప‌ష్టం చేశారు. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ప్రతిపక్ష నేతలందరూ సమిష్టిగా పోరాడ‌తార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఖ‌ర్గే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ప్ర‌తి జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట ధ‌ర్నాలు

దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఈ మార్చ్ జరుగుతుందని ఖ‌ర్గే చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట విపక్ష శ్రేణులు భారీ ఎత్తున ధర్నాలు చేపడతాయని స్పష్టం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ అక్టోబర్ 6వ తేదీన కూటమికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా కలిసి దేశ రాజధానిలోని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తారని ఖర్గే హెచ్చరించారు. అంతేకాదు, అక్టోబ‌ర్ రెండో వారంలో త‌మ ఆందోళ‌న‌ల‌ను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు. దేశంలో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌ల‌హీన‌ప‌రుస్తున్న తీరుపై రాష్ట్ర‌ప‌తికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్తంగా ఓట్ల చోరీ అంశంపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అక్టోబర్, నవంబర్ నెలల్లో 5 భారీ ర్యాలీలు చేపట్టనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నవంబర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఇతర ఎన్నికల అవకతవకలపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తామని ఖ‌ర్గే తెలిపారు.

అధికారుల‌ను తోలుబొమ్మ‌ల్లా ఆడిస్తున్నారు

ఈ సంద‌ర్భంగా అధికార ఎన్డీయే ప్ర‌భుత్వంపై ఇండీ కూట‌మి నేత‌లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నికల సంఘంలోని ఇద్దరు, ముగ్గురు అధికారులను అధికార పార్టీ పావులుగా వాడుకుంటోందని ఖ‌ర్గే ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారిని తోలుబొమ్మల్లా ఆడిస్తున్నారని మండిపడ్డారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ (Rahul Gandhi) మాట్లాడుతూ.."భారత‌ ప్రజాస్వామ్యాన్ని నాశ‌నం చేసిన వారికి శిక్ష ప‌డేలా చూస్తాం. ఈ పోరాటం ఏ ఒక్క వ్యక్తికో పరిమితమైనది కాదు. దేశ భవిష్యత్తుకు సంబంధించినది. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయనే నిజాన్ని ప్రజలకు చేరవేయడంలో ప్రతిపక్షాలు సఫలమయ్యాయ‌ని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా యువతలో ఒక కొత్త రకమైన ప్రతిఘటన, చైత‌న్యం మొదలైంది" అని అన్నారు.

ఇక ఎన్నిక‌ల సంఘం తీరును టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ త‌క్ష‌ణ‌మే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆయ‌న త‌ప్పుకోక‌పోతే ఆందోళ‌న‌ల‌ను మ‌రింత ఉద్ధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఓట్ల చోరీపై ఇండీ కూట‌మి ఏక‌తాటిపై ఉంద‌ని.. దీనిపై పోరాడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read..

మంగళూరు రిఫైనరీలో భారీ పేలుడు

హైజాక్ కోడ్‌.. 2 నిమిషాల్లోనే 17,400 అడుగుల దిగువకు పడిపోయిన విమానం..!

ఏం తేల్చ‌కుండానే ఎథిక్స్ క‌మిటీ స‌మావేశం ముగింపు

Advertisement
Advertisement