త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flydubai Flight | హైజాక్ కోడ్‌.. 2 నిమిషాల్లోనే 17,400 అడుగుల దిగువకు పడిపోయిన విమానం..!

Flydubai Flight | దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం (Flydubai Flight) నుంచి అంత‌ర్జాతీయంగా విమాన హైజాక్‌ను సూచించే 7500 ఎమర్జెన్సీ కోడ్ రావ‌డం ఇజ్రాయెల్‌లో క‌ల‌క‌లం రేపింది. అంతేకాదు, 34,000 అడుగుల ఎత్తులో ప్ర‌యాణిస్తున్న విమానం.. రెండు నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఏకంగా 17,400 అడుగుల దిగువ‌కు ప‌డిపోయింది.

D

International | Published On Sep 30, 2026, 2.51 pm IST

Flydubai Flight | హైజాక్ కోడ్‌.. 2 నిమిషాల్లోనే 17,400 అడుగుల దిగువకు పడిపోయిన విమానం..!
Advertisement

Flydubai Flight | త్రినేత్ర న్యూస్ : దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో (Flydubai Flight) అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. సౌదీ అరేబియా (Saudi Arabia) గ‌గ‌న‌త‌లంలో ఉండ‌గా విమానం అత్య‌వ‌స‌ర పరిస్థితిని ఎదుర్కొంది. విమానం నుంచి హైజాక్ సంకేతాలు (Hijack Alert) వెళ్ల‌డం ఇజ్రాయెల్‌లో క‌ల‌క‌లం రేపింది.

ఇజ్రాయెల్ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. ఫ్లైదుబాయ్ విమానం FZ1073.. 180 మంది ప్ర‌యాణికులు, సిబ్బందితో దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు నుంచి టెల్ అవీవ్ (Dubai-Tel Aviv) స‌మీపంలోని బెన్ గురియ‌న్ విమానాశ్ర‌యానికి బ‌య‌ల్దేరింది. విమానం టేకాఫ్ అయిన రెండున్న‌ర గంట‌ల త‌ర్వాత సౌదీ అరేబియా గ‌గ‌న‌త‌లంలో ఉండ‌గా విమానం నుంచి మొదట జనరల్ ఎమర్జెన్సీ కోడ్ 7700 వెళ్లింది. ఆ త‌ర్వాత కాసేప‌టికే అంత‌ర్జాతీయంగా విమాన హైజాక్‌ను సూచించే 7500 ఎమర్జెన్సీ కోడ్‌ను పంపింది.

ఈ హెచ్చరికలతో అప్ర‌మ‌త్త‌మైన‌ ఇజ్రాయెల్ ప్ర‌భుత్వం త‌మ ఫైట‌ర్ జెట్ల‌ను రంగంలోకి దింపింది. అంతేకాదు, సౌదీ అరేబియా గ‌గ‌న‌త‌లంలో ఈ విమానం భారీ కుదుపుల‌కు లోనైంది. 34,000 అడుగుల ఎత్తులో ప్ర‌యాణిస్తున్న విమానం.. రెండు నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఏకంగా 17,400 అడుగుల దిగువ‌కు ప‌డిపోయి, 16,600 అడుగుల ఎత్తుకు చేరుకుంది. వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య ఘర్షణ..?

అయితే, హైజాక్ జ‌ర‌గ‌లేద‌ని త‌ర్వాత తేలింది. విమానంలో అత్య‌వ‌స‌ర సంత‌కేతాలు వెలువ‌డ‌టానికి కాక్‌పిట్‌లో పైల‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తీవ్ర ఘ‌ర్ష‌ణే కార‌ణ‌మ‌ని భద్రతా వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో అనుకోకుండా ఎమ‌ర్జెన్సీ కోడ్ వ‌చ్చింద‌ని పేర్కొంటున్నాయి.  ఈ ఘర్షణలో ఒక పైలట్ కత్తిపోట్లకు గురైనట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. ముందు కూర్చున్న ప్ర‌యాణికుల‌పై ర‌క్తం మ‌ర‌కలు అంటిన‌ట్లు పేర్కొంది. అంతేకాదు, ఒక పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చేసి ఆత్మహత్యకు యత్నించాడని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ప్రయాణికులు, రెండో పైలట్ కలిసి అతడిని అడ్డుకుని విమానాన్ని నియంత్రణలోకి తెచ్చారంటూ ఇజ్రాయెల్ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. అయితే, ఈ వార్తలను ఇజ్రాయెల్ అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం విమానం సౌదీ అరేబియాలోని త‌బ‌క్ ఎయిర్‌పోర్టులో సుర‌క్షితంగా ల్యాండ్ అయ్యింది.

ఘర్షణకు దిగిన పైలట్లలో ఒకరు రష్యన్ సంతతికి చెందినవారని, మరొకరు ఉక్రేనియన్ సంతతికి చెందినవారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై అధికారులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహు అధికారుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించి ప‌రిస్థితిని స‌మీక్షించారు. ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని.. ప్ర‌యాణికుల‌ను క్షేమంగా స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ప్ర‌ధాని కార్యాల‌యం వెల్ల‌డించింది.

Also Read..

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఫారం-6 నుంచి అదనపు డిక్లరేషన్ ఉప‌సంహ‌ర‌ణ‌

బుద్గాంలో ఎన్‌కౌంట‌ర్‌.. ల‌ష్క‌రే టాప్ క‌మాండ‌ర్ హ‌తం

ఏం తేల్చ‌కుండానే ఎథిక్స్ క‌మిటీ స‌మావేశం ముగింపు

Advertisement
Advertisement