త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Parliament Session | త్వ‌ర‌లో పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు : ప్ర‌భుత్వ వ‌ర్గాలు

Special Parliament Session | కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాలు (Special Parliament Session) నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తాజాగా వెల్ల‌డించాయి. శీతాకాల స‌మావేశాల‌కు ముందే గ‌త సెష‌న్‌లో వీగిపోయిన డీలిమిటేషన్ (Delimitation Bill), మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లులపై చ‌ర్చించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

D

National | Published On Nov 12, 2026, 5.02 pm IST

Special Parliament Session | త్వ‌ర‌లో పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు : ప్ర‌భుత్వ వ‌ర్గాలు
Advertisement

Special Parliament Session | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాలు (Special Parliament Session) నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తాజాగా వెల్ల‌డించాయి. శీతాకాల స‌మావేశాల‌కు ముందే గ‌త సెష‌న్‌లో వీగిపోయిన డీలిమిటేషన్ (Delimitation Bill), మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లులపై చ‌ర్చించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందు కోసం కేంద్రం అతి త్వ‌ర‌లోనే ప్ర‌త్యేక స‌మావేశాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స‌ద‌రు వ‌ర్గాలు తెలిపాయి. ఈ రెండు బిల్లుల‌కు ఉభ‌య‌స‌భ‌ల్లో మూడింట రెండు వంతుల‌ మెజారిటీ సాధించ‌గ‌ల‌మ‌నే ధీమాతో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఎన్డీయేకి పెరిగిన మెజారిటీ

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు మార్గం సుగమం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన స‌మావేశాల స‌మ‌యంలో వీగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఈ బిల్లుల‌ను ఎలాగైనా ఆమోదింప‌జేసేందుకు కేంద్రం పావులు క‌దుపుతోంది. ఇక గ‌తంతో పోలిస్తే స‌భ‌లో ప్ర‌తిప‌క్ష ఇండీ కూట‌మి బ‌లం త‌గ్గి.. ఎన్డీయేకి మెజారిటీ పెరిగింది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎంపీలు, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు అధికార పక్షం వైపు మ‌ళ్లిన విష‌యం తెలిసిందే.

అటు త‌మిళ‌నాడులో డీఎంకే ఇప్పుడు ఇండీ కూట‌మిలో కొన‌సాగ‌డం లేదు. ఆ పార్టీ కూడా కేంద్రానికి మ‌ద్ద‌తు ఇస్తుంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిన్న పార్టీల మ‌ద్ద‌తు కూడా కూడ‌గ‌ట్ట‌గ‌లిగితే ఈ స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్క‌గల‌మ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ బిల్లుల ఆమోదానికి అవ‌స‌ర‌మైన మెజారిటీ సాధించ‌గ‌ల‌మ‌నే ధీమాతో ఉంది. ఈసారి ఉభయసభల్లో అవసరమైన 361 ఓట్లకు అదనంగా 15 నుంచి 18 ఓట్ల మెజారిటీతో బిల్లును ఆమోదింపజేసుకోగలమని ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా స‌ర్ ప్ర‌క్రియ‌పై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ విసిరిస‌న స‌వాల్‌పై కూడా ఈ స‌భ‌లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

రాష్ట్రాలకు సీట్లను 50 శాతం పెంచే ఫార్ములా

2029 ఎన్నికల నాటికి చ‌ట్ట‌స‌భ‌ల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోన్న విష‌యం తెలిసిందే. 2027 జనగణన తర్వాత పునర్విభజన జరిగితే 2029 ఎన్నికల నాటికి ఈ రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని భావించిన కేంద్ర ప్రభుత్వం.. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుంచి సుమారు 850 వ‌ర‌కూ పెరిగే అవకాశం ఉంది. ఈ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమ ప్రాతినిధ్యం తగ్గుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిని తొలగించేందుకు 1971 జనాభా లెక్కల ప్రకారం ఉన్న రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని యథాతథంగా ఉంచుతూ అన్ని రాష్ట్రాలకు సీట్లను 50 శాతం పెంచే ఫార్ములాను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ఫార్ములా ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీట్లు 25 నుంచి 38కి, తెలంగాణ సీట్లు 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉంటుంది.

కాంగ్రెస్ డిమాండ్ ఇదే..

ఈ బిల్లుల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ త‌మ వైఖ‌రిని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. లోక్‌స‌భ‌లోని ప్ర‌స్తుత 543 స్థానాల‌ను మ‌రో 25 ఏళ్ల‌పాటూ కొన‌సాగించాల‌ని, రాష్ట్రాల వారీగా ప్ర‌స్తుత సీట్ల కేటాయింపును య‌థాత‌థంగా ఉంచాల‌ని, 2029 లోక్‌స‌భ ఎన్నిక‌ల నుంచే మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్లను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. ఈ మూడు అంశాల‌పై కాంగ్రెస్ పార్టీ వైఖ‌రి స్ప‌ష్టంగా ఉంద‌ని మ‌ల్లికార్జున‌ ఖ‌ర్గే ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. ఇండీ కూట‌మి ప‌క్షాలు కూడా ఇదే డిమాండ్‌తో ఉన్నాయి.

Also Read..

రూ.7 కోట్లు ఇవ్వ‌కుంటే చంపేస్తాం.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హ‌త్య బెదిరింపులు

ఇండోర్ 8 ఏళ్ల రికార్డుకు తెర: దేశంలోనే నం.1 క్లీన్ సిటీగా 'నవీ ముంబై'.. సత్తా చాటిన విజయవాడ, విశాఖ!

దేశపతి దంపతుల కుమార్తె నిశ్చితార్థం.. కాబోయే వ‌ధూవ‌రుల‌కు బీఆర్ఎస్‌ నేత‌ల ఆశీర్వాదం

Advertisement
Advertisement