త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | ఆ ఘ‌ట‌న చాలా అవ‌మానంగా అనిపించింది.. హ‌ల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖ‌ర్గే భావోద్వేగం

Mallikarjun Kharge | తాను ప్రసంగించిన స‌భా వేదిక‌ను శుద్ధి పేరిట హ‌వ‌న చేశార‌ని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న త‌న‌కు తీవ్ర అవ‌మాన‌క‌రంగా ఉంద‌న్నారు. ఈ దేశంలో ద‌ళితుల‌కు ఎలాంటి స్థానం లేద‌ని ఆరోపించారు. వేదిక‌ను ప‌విత్రం పేరుతో శుద్ధి చేసిన వారిపై కేసు న‌మోదు చేసి త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

D

National | Published On Aug 13, 2026, 1.10 pm IST

Mallikarjun Kharge | ఆ ఘ‌ట‌న చాలా అవ‌మానంగా అనిపించింది.. హ‌ల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖ‌ర్గే భావోద్వేగం
Advertisement
  • దేశంలో దళితులకు స్థానం లేదు..
  • వేదిక ‘శుద్ధి’పై రాజ్య‌స‌భ‌లో దుమారం
  • ఈ సంఘ‌ట‌న చాలా దుర‌దృష్ట‌క‌రం : న‌డ్డా
  • అంటరానితనాన్ని ఖండిస్తున్నాం: రాజ్యసభ చైర్మన్

Mallikarjun Kharge | త్రినేత్ర‌.న్యూస్ : ఉత్త‌రాఖండ్ (Uttarakhand )లోని హ‌ల్ద్వానీ (Haldwani)లో తాను ప్రసంగించిన రామ్‌లీలా మైదానం వేదిక‌ను శుద్ధి చేయ‌డంపై కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) తీవ్రంగా స్పందించారు. ఈ దేశంలో ద‌ళితుల‌కు ఎలాంటి స్థానం లేద‌ని ఆరోపించారు. బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రినీ మ‌తాల పేరుతో విడ‌గొడుతోంద‌ని విమ‌ర్శించారు.

శనివారం హల్ద్వానీలోని రామ్‌లీలా మైద‌నాం (Ram Lila Ground)లో నిర్వ‌హించిన విజ‌య్ శంఖ‌నాద్ ర్యాలీకి ఖ‌ర్గే హాజ‌రై ప్ర‌సంగించారు. ఆ తర్వాత‌ రెండు రోజులకు ఆగస్టు 10న శ్రీరామ సేన అనే సంస్థ అక్కడ శుద్ధీకరణ హోమం నిర్వహించింది. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేపింది. ఈ ఘటనపై దళిత సంఘాలు, విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఇవాళ రాజ్య‌స‌భ‌లో (Rajya Sabha) ఖ‌ర్గే ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. "ఈ దేశంలో దళితులకు స్థానం లేదని మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాము. వారు (బీజేపీని ఉద్దేశిస్తూ ప‌రోక్షంగా) దేశాన్ని విభజించడానికి ప్రతి ఒక్కరినీ మతాల పేరుతో విడగొడుతున్నారు. అక్కడ శుద్ధి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఏముంది?" అని రాజ్యసభలో ఖ‌ర్గే ప్ర‌శ్నించారు.

రామ్‌లీలా మైదానం అన్ని పార్టీలు బ‌హిరంగ స‌భ‌ల కోసం ఉప‌యోగించుకునే వేదిక అని ఖ‌ర్గే తెలిపారు. ఆ మీటింగ్‌లో తాను ఏ ఒక్క వ‌ర్గం లేదా మ‌తం పేరును ప్ర‌స్తావించ‌లేద‌ని చెప్పారు. కేవ‌లం ప్ర‌భుత్వ స‌మ‌స్య‌ల గురించే మాట్లాడాన‌ని వివ‌రించారు. కానీ త‌న ప్ర‌సంగం త‌ర్వాత బీజేపీకి చెందిన కొంద‌రు ఆ వేదిక‌ను ప‌విత్రం చేసేందుకు అక్క‌డ హ‌వ‌నం నిర్వ‌హించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హిందూ ధర్మ స్ఫూర్తికి కూడా ఇది విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలేనని ఆరోపించారు. దేశాన్ని విభజించేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

అవ‌మాన‌క‌రంగా అనిపించింది.. ఖ‌ర్గే భావోద్వేగం

ఈ వివాదాన్ని తాను రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలనుకోవడం లేదని ఈ సంద‌ర్భంగా ఖ‌ర్గే భావోద్వేగానికి గుర‌య్యారు. "నేను దీన్ని రాజకీయ ల‌బ్ధికోసం వాడుకోవాల‌నుకోండం లేదు. నేను దళితుడిని అని ఎవరికీ చెప్పలేదు.. నన్ను కాపాడమని ఎవరినీ బతిమలాడుకోలేదు. నాకు పోరాడే శక్తి ఉంది. నేను పోరాడుతాను కూడా. కానీ హ‌ల్ద్వానీలో వేదిక‌ను శుద్ధి చేయ‌డం న‌న్ను తీవ్రంగా క‌ల‌చివేసింది. ఆ ప‌రిణామం అంట‌రానిత‌నం తాలూకు బాధ‌ను గుర్తు చేసింది. అది తీవ్ర అవ‌మాన‌క‌రంగా అనిపించింది" అని ఖ‌ర్గే ఆవేద‌న‌కు గుర‌య్యారు. వేదిక‌ను ప‌విత్రం పేరుతో శుద్ధి చేసిన వారిపై కేసు న‌మోదు చేసి త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. వారిని జైలుకు పంపాల‌న్నారు.

ఇలాంటి చర్యలను బీజేపీ స‌మ‌ర్థించ‌దు.. న‌డ్డా

ఖ‌ర్గే వ్యాఖ్య‌లు ఎగువ‌స‌భ‌లో తీవ్ర‌మైన చ‌ర్చ‌కు దారి తీశాయి. ఖర్గే ఆరోపణలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘ‌ట‌న చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని.. ఇలాంటి చర్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని స్పష్టం చేశారు. ఈ ఘటనతో బీజేపీ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారు ఎవరైనా స‌రే క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు.

అంటరానితనాన్ని ఖండిస్తున్నాం: రాజ్యసభ చైర్మన్

ఇక ఈ ఘ‌ట‌న‌పై రాజ్య‌స‌భ చైర్మ‌న్ సీపీ రాధాకృష్ణ‌న్ సైతం స్పందించారు. సభలోని సభ్యులందరూ అంటరానితనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని ఉద్ఘాటించారు. "పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా మేమంతా ఈ చర్యను ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. అదేవిధంగా అంటరానితనాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. మనల్ని ఎవ్వరూ శుద్ధి చేయాల్సిన అవసరం లేదు.. మనమంతా ఇప్పటికే శుద్ధి అయి ఉన్నాం" అని ఆయన స్పష్టం చేశారు. అదే స‌మ‌యంలో ఖ‌ర్గే ఆరోప‌ణ‌ల‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలితే నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని స్ప‌ష్టం చేశారు.

దళితులంటే బీజేపీకి అంత చిన్నచూపా..

ఖర్గే ప్రసంగించిన వేదికపై హవన్ నిర్వహించడంపై కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా తీవ్రస్థాపనలో మండిపడ్డారు. రాజకీయాల్లో ఈ స్థాయికి దిగజారడం అత్యంత హేయమైన చ‌ర్య‌గా ఆయన అభివర్ణించారు. దళితుడు మీటింగ్ పెడితే...అక్కడ బీజేపీ శుద్ధి చేయడ మేమిటి..? అని ప్ర‌శ్నించారు. ఇంత‌కంటే అవ‌మాన‌క‌ర‌మైన విష‌యం మ‌రొక‌టి ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. దళితులంటే బీజేపీకి అంత చిన్నచూపా అని నిల‌దీశారు. ఈ ఘ‌ట‌న‌పై ఆ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి ధామి ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. సీఎం స్పందించిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Also Read..

లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చ‌రిత్ర‌లో తొలిసారి

ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హ‌స్తం.. UNSC సంచలన నివేదిక

ఐసీఐసీఐలో 250 రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు.. రేపు సంగారెడ్డిలో జాబ్‌మేళా..

Advertisement
Advertisement