త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaddiraju Ravichandra | ట్రిబ్యున‌ల్స్ రిఫార్మ్స్ బిల్లు సంస్క‌ర‌ణ‌లు ఓకే.. కానీ స‌రిగా అమ‌లు చేస్తేనే ఫ‌లితం ఉంటుంది

Vaddiraju Ravichandra | ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లులో తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌లు స్వాగ‌తించ‌ద‌గిన‌వేన‌ని.. కానీ వాటిని స‌రిగా అమ‌లు చేస్తేనే ఫ‌లితం ఉంటుంద‌ని బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కులు వ‌ద్దిరాజు రవిచంద్ర అన్నారు.

S

Telangana | Published On Aug 11, 2026, 4.36 pm IST

Vaddiraju Ravichandra | ట్రిబ్యున‌ల్స్ రిఫార్మ్స్ బిల్లు సంస్క‌ర‌ణ‌లు ఓకే.. కానీ స‌రిగా అమ‌లు చేస్తేనే ఫ‌లితం ఉంటుంది
Advertisement
  • అందుకు ఉన్న‌ ఖాళీల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాలి
  • కేసుల సమాచారం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలి
  • రాజ్య‌స‌భ‌లో ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర

Vaddiraju Ravichandra | త్రినేత్ర‌.న్యూస్: ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లులో తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌లు స్వాగ‌తించ‌ద‌గిన‌వేన‌ని.. కానీ వాటిని స‌రిగా అమ‌లు చేస్తేనే ఫ‌లితం ఉంటుంద‌ని బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కులు వ‌ద్దిరాజు రవిచంద్ర అన్నారు. జాతీయ ట్రిబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేసి, ట్రిబ్యునల్స్ పరిపాలనను బలోపేతం చేయడం, నియామకాలలో పారదర్శకత, సేవా నిబంధనల్లో ఏకరూపత కల్పించడం వంటి చర్యలు బాగున్నాయ‌న్నారు. ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ -2026 బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ వ‌ద్దిరాజు మాట్లాడారు.

ట్రిబ్యునల్స్ ప్రజలకు త్వరితగతిన, నైపుణ్యంతో కూడిన న్యాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణ న్యాయస్థానాలపై ఉండే భారాన్ని ట్రిబ్యునల్స్ తగ్గిస్తూ, పౌరులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పన్ను చెల్లింపుదారులు, వినియోగదారులు త్వరగా న్యాయం పొందేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆలస్యమైనా న్యాయం అంటే న్యాయం లభించనట్టే. ప్రస్తుతం అనేక ట్రిబ్యునల్స్‌లో అవసరమైన సిబ్బంది లేరు. దీంతో కేసుల సంఖ్య రోజురోజుకు బాగా పేరుకుపోతోంది. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా జరపాలి అని ఆయన ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

జాతీయ ట్రిబ్యునల్స్ కమిషన్ స్వతంత్రంగా, వృత్తిపరంగా పనిచేయాలని, ట్రిబ్యునల్స్ పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ సామర్థ్యం, జవాబుదారీతనాన్ని పెంచాలన్నారు. ప్రతిపాదించిన జాతీయ ట్రిబ్యునల్స్ డేటా గ్రిడ్ ద్వారా కేసుల సమాచారం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా సాంకేతికతను పూర్తిగా వినియోగించాలని సూచించారు.

ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సేవలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశామ‌న్నారు. దాంతో పాటు న్యాయ, పరిపాలనా మౌలిక వసతుల అభివృద్ధికి కూడా కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని వివరించారు. న్యాయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండాలంటే చట్ట సంస్కరణలతో పాటుగా పరిపాలనా సంస్కరణలు కూడా అవసరమనే విషయాన్ని ఆయన సూచించారు.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో ట్రిబ్యునల్ బెంచ్‌లు తగిన సంఖ్యలో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీ రవిచంద్ర ప్రభుత్వాన్ని కోరారు. న్యాయం కోసం ప్రజలు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండొద‌న్నారు. న్యాయ సంస్కరణల ప్రధాన లక్ష్యం త్వరితగతిన, పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉండే న్యాయ వ్యవస్థ నిర్మాణం జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ సూచనలతో ఈ బిల్లు లక్ష్యాలను తమ పార్టీ బీఆర్ఎస్ సమర్థిస్తున్నదని, ప్రభుత్వం ఈ సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ వద్దిరాజు చెప్పారు.

Advertisement
Advertisement