త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Census 2027 | కులం, కొవిడ్‌ వ్యాక్సిన్ వివ‌రాలు.. జ‌న‌గ‌ణ‌న‌లో అడ‌గాల్సిన 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం

Census 2027 | సెప్టెంబ‌ర్ 1 నుంచి ప్రారంభం కానున్న జనగణన (Census 2027) మొదటి దశలో ప్రజలను అడగాల్సిన 40 ప్రశ్నలను కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారి ఈసారి జనగణనలో కుల (Caste) వివరాలను కూడా సేకరించనున్నారు. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) వివరాలతో పాటు కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు (Covid Vaccine) సంబంధించిన సమాచారాన్ని కూడా నమోదు చేయనున్నారు.

D

National | Published On Aug 14, 2026, 2.57 pm IST

Census 2027 | కులం, కొవిడ్‌ వ్యాక్సిన్ వివ‌రాలు.. జ‌న‌గ‌ణ‌న‌లో అడ‌గాల్సిన 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
Advertisement
  • దేశంలో తొలిసారిగా కుల వివరాలు
  • మంచు ప్రాంతాల్లో సెప్టెంబ‌ర్ 1 నుంచి జనగణన మొదటి దశ
  • తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానంలో

Census 2027 | త్రినేత్ర‌.న్యూస్ : దేశంలో 2027 జనాభా లెక్కల (Census 2027) నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మ‌రం చేసింది. ఇందులో భాగంగానే మంచు కురిసే ప్రాంతాల్లో సెప్టెంబ‌ర్ 1 నుంచి ప్రారంభం కానున్న జనగణన మొదటి దశలో ప్రజలను అడగాల్సిన 40 ప్రశ్నలను కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారి ఈసారి జనగణనలో కుల వివరాలను కూడా సేకరించనున్నారు. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) వివరాలతో పాటు కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా నమోదు చేయనున్నారు. ఈ మేర‌కు భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ కీల‌క‌ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

40 ప్ర‌శ్న‌లు ఇవే..

వైవాహిక స్థితి, వివాహ సమయంలో వయస్సు, జీవిత భాగస్వామి పేరు, జాతీయత, మతం, షెడ్యూల్డ్ కులం (SC)/షెడ్యూల్డ్ తెగ (ST), కులం, తల్లిదండ్రుల వివరాలు, వైకల్యం, మాతృభాష, తెలిసిన ఇతర భాషలు, అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత స్థితి వంటి వ్యక్తిగత వివరాల గురించి అడుగుతారు. అంతేకాదు విద్యాసంస్థలో హాజరు, అత్యున్నత విద్యా స్థాయి, చదువుకున్న విభాగం లేదా సబ్జెక్టు, గత ఏడాది కాలంలో జాబ్ చేశారా, ఆర్థిక స్థితి, వృత్తి వంటి వివరాలను కూడా అడిగి తెలుసుకుంటారు. వాటితో పాటు ఇంట్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, వినియోగిస్తున్న డిజిటల్ సాధనాలు అంటే స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్, సొంత వాహనాలు వంటి సాధారణ గృహ వివరాలు కూడా ఇందులో భాగం చేశారు. వలసదారులను సైతం ప‌లు ప్ర‌శ్న‌లు అడ‌గ‌నున్నారు. పుట్టిన ప్రదేశం, అంతకుముందు నివసించిన ప్రదేశం, వలసకు గల కారణం, చివరి వలస తర్వాత ఈ గ్రామం/పట్టణంలో ఎప్పటి నుంచి నివసిస్తున్నారు, శాశ్వత నివాస చిరునామా వంటి వివరాలను సిబ్బంది సేక‌రిస్తారు. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వివ‌రాలు అడిగి తెలుసుకుంటారు.

మంచు ప్రాంతాల్లో సెప్టెంబ‌ర్ 1 నుంచి

సాధార‌ణ ప్రాంతాల్లో జ‌నాభా లెక్క‌ల నిర్వ‌హ‌ణ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హిస్తారు. అయితే, ల‌డ‌ఖ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, జ‌మ్ము క‌శ్మీర్‌లోని మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రం ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లోనే పూర్తి చేస్తారు. ఆయా ప్రాంతాల్లో జ‌నాభా సేక‌ర‌ణ ప్ర‌క్రియ సెప్టెంబ‌ర్ 1 నుంచి 30 వ‌ర‌కూ జ‌ర‌గ‌నుంది. అంతకుముందే, ఆగస్టు 17 నుంచి 31 వరకు ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే (self-enumeration) సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానంలో..

కొవిడ్-19 మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. దీంతో 2027లో నిర్వహించనున్న జనగణనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఇది దేశంలో నిర్వహించనున్న 16వ జనగణన కాగా.. స్వాతంత్య్రం తర్వాత చేపడుతున్న ఎనిమిదో జనగణన కానుంది. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనుండటం మరో ప్రత్యేకత. మొబైల్ పరికరాల ద్వారా సమాచారాన్ని సేకరించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో డేటాను మాన్యువల్‌గా నమోదు చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంచారు.

రూ. 11,718 కోట్ల నిధులు

దేశంలో మొట్టమొదటిసారి కులగణనతో సహా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ-2027కు కేంద్ర ప్ర‌భుత్వం రూ.11,728 కోట్ల నిధులు కేటాయించింది. అందులో సిబ్బందికి శిక్షణ, గౌరవ వేతనం, సాంకేతిక మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటి కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు మొత్తం రూ. 4,102 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ ఆగస్టు 12న పార్లమెంట్‌కు తెలిపింది. ఇక 1948 జనాభా లెక్కల చట్టం, 1990 జనాభా లెక్కల నియమాల ఆధారంగా సెన్సెస్​-2027 జరగనుంది.

Also Read..

స్కామర్లకు ఇక చెక్.. వాట్సాప్‌లో ఏఐతో కొత్త సెక్యూరిటీ ఫీచర్..

స్వాతంత్య్ర దినోత్స‌వం వేళ ఢిల్లీలో వ‌రుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్‌, హైకోర్టు, రైళ్లు

కేంద్ర మంత్రి జేపీ న‌డ్డాకు అస్వ‌స్థ‌త‌.. ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లింపు

Advertisement
Advertisement