త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ED raids | మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈడీ సోదాలు.. తొమ్మిదో అంతస్తు నుంచి నోట్ల క‌ట్ట‌లు నిండిన బ్యాగును విసిరేశారు..

ED raids | మొహాలీలో ఈడీ చేప‌ట్టిన సోదాల్లో నాట‌కీయ ప‌రిణామం చోటు చేసుకుంది. దాడుల నుంచి త‌ప్పించుకునేందుకు ఓ వ్య‌క్తి బిల్డింగ్ తొమ్మిదో అంత‌స్తు నుంచి నోట్ల క‌ట్ట‌ల‌తో నిండిన బ్యాగును కింద‌కు విసిరేశారు. అందులో సుమారు రూ.21 ల‌క్ష‌ల న‌గ‌దు ఉన్న‌ట్లు తెలిసింది. మొత్తం రూ.500 నోట్ల క‌ట్ట‌లే అని స‌మాచారం.

D

National | Published On May 7, 2026, 12.40 pm IST

ED raids | మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈడీ సోదాలు.. తొమ్మిదో అంతస్తు నుంచి నోట్ల క‌ట్ట‌లు నిండిన బ్యాగును విసిరేశారు..
Advertisement

ED raids | ఈడీ చేప‌ట్టిన దాడుల్లో (ED raids) నాట‌కీయ ప‌రిణామం చోటు చేసుకుంది. మ‌నీలాండ‌రింగ్ కేసులో పంజాబ్, ఛండీగ‌ఢ్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఈడీ అధికారులు గురువారం ఉద‌యం త‌నిఖీలు చేప‌ట్టారు. స‌న్‌టెక్ సిటీ, ఏబీఎస్ టౌన్‌షిప్‌, ఆల్ట‌స్ బిల్డ‌ర్స్ త‌దిత‌ర సంస్థ‌ల‌కు చెందిన కార్యాల‌యాల్లో సోదాలు చేప‌ట్టారు. మొహాలీ (Mohali)లోని ఖ‌రార్ (Kharar)లోగ‌ల వెస్ట్రన్ టవర్స్ సొసైటీలో వ్యాపార‌వేత్త నితిన్ కుమార్ గోహిల్‌ నివాసంలో సోదాలు జ‌రుగుతుండ‌గా.. ఊహించ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి ఈడీ సోదాల నుంచి త‌ప్పించుకునేందుకు తొమ్మిదో అంత‌స్తు నుంచి నోట్ల క‌ట్ట‌ల‌తో నిండిన బ్యాగును కింద‌కు (Cash Filled bag thrown from 9th floor) విసిరేశారు.

అంతపైనుంచి బ్యాగు ఒక్క‌సారిగా కింద‌ప‌డ‌టంతో అది ప‌గిలిపోయి నోట్ల క‌ట్ట‌ల‌న్నీ నేల‌పై ప‌డ్డాయి. అప్పుడు అక్క‌డికి వ‌చ్చిన ఓ కారు డ్రైవ‌ర్ నోట్ల క‌ట్ట‌ల బ్యాగుతో అక్క‌డి నుంచి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే, అక్కడే ఉన్న ఈడీ అధికారులు అతడిని వెంబడించి ప‌ట్టుకున్నారు. అందులో సుమారు రూ.21 ల‌క్ష‌ల న‌గ‌దు ఉన్న‌ట్లు తెలిసింది. మొత్తం రూ.500 నోట్ల క‌ట్ట‌లే అని స‌మాచారం.

పెద్ద సంఖ్య‌లో కొరియ‌ర్లు..

నితిన్ గోహిల్‌కు ఈ దాడుల గురించి ముందే స‌మాచారం అందిన‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ దాడుల నుంచి త‌ప్పించుకునేందుకు నోట్ల క‌ట్ట‌ల బ్యాగును ఇంటి నుంచి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశార‌ని భావిస్తున్నారు. కాగా, గోహిల్ నాలుగు నెల‌ల క్రిత‌మే ఈ సొసైటీలోని ఫ్లాట్ నంబ‌ర్ 906లోకి మారిన‌ట్లు అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు. ఆయ‌న‌కు త‌ర‌చుగా పెద్ద సంఖ్య‌లో కొరియ‌ర్లు వ‌స్తుండేవ‌ని.. వాటిని అత‌డి డ్రైవ‌రే తీసుకునేవాడ‌ని పేర్కొన్నారు.

కాగా, 'సన్‌టెక్ సిటీ' (Suntech City) ప్రాజెక్టుకు సంబంధించి జరిగినట్లుగా చెబుతున్న ఆర్థిక అక్రమాలు, మోసాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉద‌యం మొహాలీ-ఛండీగఢ్‌లోని 12 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏక‌కాలంలో సోదాలు చేప‌ట్టారు. గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (GMADA) నుంచి పొందిన చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ (CLU) లైసెన్స్‌లను దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసగించినట్లు ఏబీఎస్ టౌన్‌షిప్, ఆల్టస్ బిల్డర్స్, ధీర్ కన్స్ట్రక్షన్స్ వంటి పలు సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయా సంస్థ‌ల‌పై ఈడీ నిఘా పెట్టింది. ఇక గోహిల్ వెనుక పెద్ద పెద్ద రాజ‌కీయ నేత‌లు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, దీనిపై అధికారులు ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

Also Read..

త‌మిళ‌నాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు పెట్టాలి: శ్రీధర్ వెంబు

దేశ భ‌ద్ర‌త విష‌యంలో రాజీప‌డేది లేదు.. ఆప‌రేష‌న్ సిందూర్‌కు ఏడాది పూర్తైన వేళ ప్ర‌ధాని పోస్ట్‌

ఫ్లాట్‌గా ట్రేడ‌వుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల్లో పెరిగిన అప్ర‌మ‌త్త‌త‌..

Advertisement
Advertisement