త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Punjab Assembly | స‌భ‌కు సీఎం తాగి వ‌చ్చారు.. కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు..!

అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం సంద‌ర్భంగా పంజాబ్ ప్ర‌భుత్వం శుక్ర‌వారం ప్ర‌త్యేకంగా అసెంబ్లీ స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా అధికార‌, విప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వ‌హిస్తున్నా వాటితో ఎలాంటి ఫలితాలు ఉండ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

P

National | Published On May 1, 2026, 2.39 pm IST

Punjab Assembly | స‌భ‌కు సీఎం తాగి వ‌చ్చారు.. కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు..!
Advertisement

Punjab Assembly | అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం సంద‌ర్భంగా పంజాబ్ ప్ర‌భుత్వం శుక్ర‌వారం ప్ర‌త్యేకంగా అసెంబ్లీ స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా అధికార‌, విప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వ‌హిస్తున్నా వాటితో ఎలాంటి ఫలితాలు ఉండ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఇప్పటివరకు ఎనిమిది ప్రత్యేక సమావేశాలు నిర్వహించారని, కానీ ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌కు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని మండిప‌డ్డారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ప్రత్యేక సమావేశంపై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదన్నారు.

ఎమ్మెల్యేపై సీఎం ఆగ్ర‌హం..

గత సమావేశంలో అవమానకర ఘటనలపై తీర్మానం ఆమోదించామని, గవర్నర్ ఆమోదం తర్వాత అది అమల్లోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుందని చెప్పారని గుర్తు చేశారు. రాబోయే శీతాకాల స‌మావేశాల్లో కావాల్సినంత స‌మ‌యం ఇస్తామ‌న్నారు. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరా సెల్‌ఫోన్ వినియోగించ‌డంపై సీఎం మాన్ అభ్యంత‌రం తెలిపారు. కార్మిక దినోత్సవ తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలో ఖైరా మొబైల్‌లో బిజీగా ఉన్నార‌న‌గా.. స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఖైరా కోరగా.. మంత్రి హర్పాల్ చీమా మాట్లాడుతూ ఆయన ప్రవర్తన ఎప్పుడూ స‌భ రూల్స్‌కు విరుద్ధంగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ నిర‌స‌న‌

మ‌రో వైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అమరిందర్ సింగ్ రాజా అసెంబ్లీ వెలుపల నిరసన చేపట్టారు. సీఎం మాన్ మద్యం సేవించి సభకు వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్ష నేత బజ్వా మాట్లాడుతూ సీఎం స్థాయి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు తీవ్రంగా ప‌రిగ‌ణించాల్నారు. అందరికీ ఆల్కహాల్ టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య నినాదాలు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ సభ్యులు పోడియం వ‌ద్ద‌కు వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. నిరాధార ఆరోప‌ణ‌లు స‌రికాద‌ని స్పీక‌ర్ హెచ్చ‌రించారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ స‌భ్యులు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ స‌భ నుంచి వాకౌట్ చేశారు. పంజాబ్ బీజేపీ కూడా “జనతా ది విధానసభ” పేరుతో చండీగఢ్‌లోని సెక్టార్-37లో ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో పంజాబ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు అశ్వనీ శర్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement