త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonam Wangchuk | వాంగ్‌చుక్ దీక్ష భ‌గ్నం.. బ‌లవంతంగా ఆసుప‌త్రికి త‌ర‌లింపు.. చికిత్స చేయొద్ద‌న్న భార్య‌

Sonam Wangchuk | నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంత‌ర్ మంతర్ (Jantar Mantar) వ‌ద్ద 21 రోజులుగా ప‌ర్యావ‌ర‌ణ ఉద్య‌మ‌కారుడు సోన‌మ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) చేప‌ట్టిన నిర‌వ‌ధిక నిరాహార దీక్షను (hunger strike) పోలీసులు శ‌నివారం భ‌గ్నం చేశారు.

D

National | Published On Jul 18, 2026, 11.22 am IST

Sonam Wangchuk | వాంగ్‌చుక్ దీక్ష భ‌గ్నం.. బ‌లవంతంగా ఆసుప‌త్రికి త‌ర‌లింపు.. చికిత్స చేయొద్ద‌న్న భార్య‌
Advertisement

Sonam Wangchuk | నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంత‌ర్ మంతర్ (Jantar Mantar) వ‌ద్ద 21 రోజులుగా ప‌ర్యావ‌ర‌ణ ఉద్య‌మ‌కారుడు సోన‌మ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) చేప‌ట్టిన నిర‌వ‌ధిక నిరాహార దీక్షను (hunger strike) పోలీసులు శ‌నివారం భ‌గ్నం చేశారు. ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో హైకోర్టు ఆదేశాలు, వైద్యుల సూచ‌న‌ల‌ మేర‌కు వాంగ్‌చుక్‌ను పోలీసులు బ‌ల‌వంతంగా స‌ఫ్ధ‌ర్‌జంగ్‌ ఆసుప‌త్రికి (Safdarjung Hospital) త‌ర‌లించారు. అక్క‌డ ఎమ‌ర్జెన్సీ వార్డులో ఆయ‌న‌కు వైద్యం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం వాంగ్‌చుక్ ఆరోగ్యం స్థిరంగా ఉంద‌ని.. అయితే, సుదీర్ఘ ఉప‌వాసం కార‌ణంగా ఆయ‌న చాలా బ‌ల‌హీనంగా ఉన్నార‌ని స‌ఫ్ధ‌ర్‌జంగ్ ఆసుప‌త్రి ఒక అధికారిక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద గంద‌ర‌గోళం..

వాంగ్‌చుక్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. నిర‌స‌న‌కారులు పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో అక్క‌డ కొద్దిసేపు స్వల్ప గందరగోళం నెలకొంది. అయితే పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తూ ఆయనను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు, జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌కారులు శాంతియుతంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల‌ని పోలీసులు సూచించారు. ఈ మేర‌కు అక్క‌డ బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబ‌స్తు నిర్వ‌హించారు. అటు స‌ఫ్ద‌ర్‌జంగ్ ఆసుప‌త్రి వ‌ద్ద కూడా భారీగా పోలీసులు మోహ‌రించారు.

నా అనుమ‌తి లేకుండా చికిత్స వ‌ద్దు..

మ‌రోవైపు త‌న అనుమ‌తి లేకుండా ఎలాంటి వైద్య చికిత్స అందించొద్దంటూ వాంగ్‌చుక్ భార్య గీతాంజ‌లి జె. ఆంగ్మో విజ్ఞ‌ప్తి చేశారు. గ‌త 20 రోజులుగా ఆయ‌న ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్న వైద్యుల ముంద‌స్తు అనుమ‌తి లేకుండా చికిత్స చేయొద్ద‌ని తెలిపారు. నోటి ద్వారా గానీ సెలైన్ ద్వారా గానీ త‌న భ‌ర్త‌కు మందులు, ఆహారం ఇవ్వ‌కూడ‌ద‌ని డిమాండ్ చేశారు. "నేను ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్ద‌ర్ జంగ్ ఆసుపత్రిలో ఉన్నాను. వాంగ్‌చుక్ కూడా ఇక్క‌డే చేరారు. గత 20 రోజులుగా ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్న వైద్యుల నుంచి అనుమతి తీసుకోకుండా ఆయనకు ఎలాంటి చికిత్సా ఇవ్వ‌కూడ‌దు" అని గీతాంజ‌లి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

ఈనెల 20న చ‌లో సంస‌ద్‌..

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల ప్రారంభం రోజున కాక్రోచ్‌పార్టీ పార్ల‌మెంట్ మార్చ్ పేరుతో భారీ నిర‌స‌న‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. కార్య‌క్ర‌మంలో పెద్ద సంఖ్య‌లో రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు పాల్గొనాల‌ని వాంగ్‌చుక్‌ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. 'చలో సంసద్'లో పాల్గొనాల‌నుకునే వారు ప్రచార వెబ్‌సైట్ లేదా మిస్డ్ కాల్ ద్వారా త‌మ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. "జులై 20న వేలాదిగా త‌ర‌లి రండి. ఈ సమస్యను ప్రజల తరఫున పార్లమెంట్ ముందుంచుదాం. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ తన బాధ్యతను నిర్వర్తించే అవకాశం ఉంటుంది" అని వాంగ్‌చుక్ పేర్కొన్నారు. ఈ నిర‌స‌న‌ల‌కు రెండు రోజుల ముందు వాంగ్‌చుక్ దీక్ష‌ను పోలీసులు భ‌గ్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read..

ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా కాంగ్రెస్ స‌ర్కార్ తీరు: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

ఒక్క రోజులోనే రూ.7,600 పెరిగిన బంగారం ధ‌ర‌.. పెట్టుబ‌డుల‌కు స‌మ‌యం వ‌చ్చిందా..?

రాష్ట్రంలో అరాచక పాలన.. హౌస్ అరెస్టుపై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆగ్ర‌హం..

Advertisement
Advertisement