త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ప్ర‌జ‌ల్లో మార్పు తీసుకురావ‌డ‌మే నిజ‌మైన రాజ‌కీయం: హ‌రీశ్ రావు

Harish Rao | రాజ‌కీయం అంటే ఎన్నికల్లో గెలవడం, అధికారం చెలాయించడం కాదని.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. రాజకీయం అంటే ఎన్నికలు, సోషల్ మీడియా ట్రెండ్స్, విమర్శలు మాత్రమే అని యువత అపోహ పడుతున్న‌ద‌ని, రైతుకు నీరు, బిడ్డకు విద్య, యువతకు ఉపాధి, రోడ్లు, వైద్యం అందించడమ‌ని చెప్పారు.

G

Telangana | Published On Jul 26, 2026, 6.31 am IST

Harish Rao | ప్ర‌జ‌ల్లో మార్పు తీసుకురావ‌డ‌మే నిజ‌మైన రాజ‌కీయం: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రాజ‌కీయం అంటే ఎన్నికల్లో గెలవడం, అధికారం చెలాయించడం కాదని.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. రాజకీయం అంటే ఎన్నికలు, సోషల్ మీడియా ట్రెండ్స్, విమర్శలు మాత్రమే అని యువత అపోహ పడుతున్న‌ద‌ని, రైతుకు నీరు, బిడ్డకు విద్య, యువతకు ఉపాధి, రోడ్లు, వైద్యం అందించడమ‌ని చెప్పారు. అధికారం అనేది కేవలం ఒక సాధనం మాత్రమేన‌ని సేవ చేయడమే అంతిమ లక్ష్యం కావాల‌ని వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఒక గొప్ప లక్ష్యానికి బలమైన నాయకత్వం, యువత శక్తి తోడైతే చరిత్ర ఎలా సృష్టించవచ్చో చెప్పడానికి తెలంగాణ (Telangana) ఉద్యమమే సజీవ సాక్ష్యమ‌న్నారు. తెలంగాణ సాధన అసాధ్యం అని అందరూ భావించిన సమయంలో.. కేసీఆర్ (KCR) తన ముందుచూపుతో, అకుంఠిత దీక్షతో దశాబ్దాల కలను ఒక క్రమశిక్షణతో కూడిన ప్రజాస్వామిక ఉద్యమంగా మార్చార‌ని చెప్పారు. ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి అద్భుతమైన దిశానిర్దేశం చేసిందని వెళ్ల‌డించారు.

నాడు కేసీఆర్ చూపిన బాటలో యువత, విద్యార్థులు తమ కెరీర్‌ను సైతం పక్కనపెట్టి ప్రాణాలకు తెగించి పోరాడారు కాబట్టే స్వరాష్ట్ర కల సాకారమైందని తెలిపారు. ఒక నిజమైన నాయకుడు ప్రజల్లో, యువతలో ఎలాంటి స్ఫూర్తిని నింపుతాడో చెప్పడానికి కేసీఆర్ నాయకత్వమే నిదర్శన‌మ‌న్నారు. అధికారం ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతతో పనిచేసి ప్రజలకు మేలు చేయవచ్చని వెల్ల‌డించారు. ఇందుకు నిదర్శనమే దేవాదుల ప్రాజెక్టు (Devadula Project). ప్రతిపక్షంగా మేం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి, దేవాదుల పంపులు ఆన్ చేయించి రైతుల పొలాలకు నీళ్లు వచ్చేలా చేశామ‌న్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేన‌ని చెప్పారు. నేటి జెన్ జ‌డ్‌ (Gan Z) యువత తలుచుకుంటే వ్యవస్థలను ఎలా మార్చగలదో ఇటీవల జరిగిన పరిణామాలే నిదర్శనమ‌న్నారు. యువత చేసిన వీరోచిత పోరాటంతోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింద‌ని తెలిపారు. ప్రశ్నించే యువత ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు.

సంఖ్య‌ను చూసి భ్ర‌మ‌ప‌డొద్దు..

`ఈరోజు ప్రపంచ జ్ఞానం యువత అరచేతిలో ఉంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇవ్వగలదు. మానవత్వంతో కూడిన మనిషి ఆలోచన మాత్రమే సామాజిక సమస్యలను పరిష్కరించగలదు. ఫాలోవర్స్ సంఖ్యను చూసి నాయకత్వం అని భ్రమపడొద్దు.. నాయకుడికి ఉండాల్సిన అతిపెద్ద అర్హత వ్యక్తిత్వం. ప్రభుత్వ ఆఫీసులోని ప్రతి ఫైలు వెనుకా ఒక మనిషి జీవితం ఉంటుందనే స్పృహ ప్రజా ప్రతినిధులకు ఉండాలి. ప్రభుత్వాలు, పదవులు మారుతుంటాయి.. కానీ మనం చేసిన సేవ మాత్రమే మిగులుతుంది. దేశ నిర్మాణంలో యువత ప్రేక్షకులుగా మిగిలిపోవద్దు.. బాధ్యత గల పౌరులుగా భాగస్వాములు కావాలి. అధికారం కోసం కాకుండా సేవ చేయడం కోసం నాయకులుగా ఎదగాలి. పాలిటిక్స్ బియాండ్ పవర్ అంటేనే స్వార్థం లేని సేవ అని, యువత గొప్ప ఆశయాల వెంట నడవాలని` హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement