త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UP Judge | 4 నెల‌ల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జ‌డ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

UP Judge | యూపీ న్యాయ‌శాఖ‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఇటీవ‌లే నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలోనే 10 కేసుల్లో 22 మందికి మ‌ర‌ణ‌శిక్ష విధించిన సంచ‌ల‌నం సృష్టించిన‌ ముజఫర్‌నగర్ (Muzaffarnagar) అద‌న‌పు జిల్లా, సెష‌న్స్ జ‌డ్జి ర‌వి కుమార్ దివాక‌ర్ (Ravi Kumar Diwakar) వ‌ద్ద పెండింగ్‌లో ఉన్న సుమారు 100 హ‌త్య కేసుల‌ను జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బ‌దిలి చేశారు.

D

National | Published On Aug 20, 2026, 1.00 pm IST

UP Judge | 4 నెల‌ల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జ‌డ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
Advertisement

UP Judge | త్రినేత్ర‌.న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ (Muzaffarnagar) అద‌న‌పు జిల్లా, సెష‌న్స్ జ‌డ్జి ర‌వి కుమార్ దివాక‌ర్ (Ravi Kumar Diwakar) కేవ‌లం 4 నెల‌ల వ్య‌వ‌ధిలోనే 10 కేసుల్లో తీర్పులు వెలువ‌రించి.. 22 మందికి మ‌ర‌ణ‌శిక్ష విధించిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. వరుస ఉరిశిక్షల తీర్పులతో న్యాయవాదులు, పిటిషనర్లలో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వ‌ద్ద పెండింగ్‌లో ఉన్న సుమారు 100 హ‌త్య కేసుల‌ను జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బ‌దిలి చేశారు. ఈ విష‌యాన్ని ప్రభుత్వ న్యాయవాది కుల్దీప్ కుమార్ పిటిఐ (PTI)కి తెలిపారు. అవ‌న్నీ మ‌ర‌ణ‌శిక్ష‌, జీవిత ఖైదు ప‌డే కేసులేన‌ని స‌ద‌రు న్యాయ‌వాది తెలిపారు. న్యాయ‌వాదులు, వ్యాజ్య‌దారుల్లో నెల‌కొన్న ఆందోళ‌న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి తెలిపారు.

నాలుగు నెల‌ల్లోనే 22 మందికి మ‌ర‌ణ‌శిక్ష‌

ర‌వి కుమార్ దివాక‌ర్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగ‌స్టు మ‌ధ్య‌ ఆయ‌న 10 కేసుల్లో తీర్పులు వెలువ‌రించి.. 22 మందికి మ‌ర‌ణ‌శిక్ష విధించారు. 12 ఏళ్ల నాటి హ‌త్య కేసులో దోషులుగా తేలిన న‌లుగురికి ఆగ‌స్టు 13న మ‌ర‌ణ‌శిక్ష విధించారు. అంత‌కు ముందు రోజే అంటే ఆగ‌స్టు 12న‌ డ‌బ్బు కోసం ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి హ‌త్య చేసిన కేసులో ఓ వ్య‌క్తికి మ‌ర‌ణ‌దండ‌న విధించారు. షామ్లీ జిల్లాలో 2011లో దోపిడీ ప్ర‌య‌త్నంలో ఓ రైతును హ‌త్య చేసినందుకు గానూ జులై 17న న‌లుగురు వ్య‌క్తుల‌కు, జూలై 6న, 2010 నాటి ఒక హత్య కేసులో మాజీ గ్రామ సర్పంచ్, అత‌ని స‌హ‌చ‌రుడికి మ‌ర‌ణ శిక్ష విధించారు. ఇలా ఏప్రిల్‌లో ఏడుగురికి, మే నెలలో ఒకరికి, జూన్‌లో ఇద్దరికి, జూలైలో ఏడుగురికి, ఆగస్టు 13 నాటికి ఐదుగురికి మొత్తంగా కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలోనే 22 మందికి మరణశిక్ష విధించారు. హత్య, హైవే దోపిడీ, ఆర్థిక లాభం కోసం కిడ్నాప్ చేసి హత్య చేయడం వంటి అత్యంత క్రూరమైన నేరాల్లో దోషులుగా తేలిన వారికి ఈ శిక్ష విధించారు. ఈ కేసుల‌ను న్యాయ‌మూర్తి అత్యంత అరుదైన కేసుల కోవ‌లోకి వ‌స్తాయ‌ని పేర్కొన్నారు.

ఎవ‌రీ ర‌వి కుమార్ దివాక‌ర్..

ర‌వి కుమార్ దివాక‌ర్ (Ravi Kumar Diwakar).. 2022లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో (Gyanvapi complex) వీడియో సర్వేకు ఆదేశించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. లక్నోకు చెందిన 46 ఏళ్ల ర‌వి కుమార్ 2009లో అజమ్‌గఢ్‌లో అదనపు సివిల్ జడ్జిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మే 2015లో సుల్తాన్‌పూర్‌లో సివిల్ జడ్జిగా, సుమారు ఐదు నెలల అనంతరం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా పదోన్నతి పొందారు. నవంబర్ 2025 నుంచి ముజఫర్‌నగర్‌లో అదనపు జిల్లా, సెషన్స్ కోర్డు జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలోనే 22 మందికి మ‌ర‌ణ‌శిక్ష విధించి వార్త‌ల్లో కెక్కారు. ఆయ‌న గతంలో బరేలీలో పనిచేస్తున్న సమయంలోనూ 13 మందికి మరణశిక్ష విధించిన చరిత్ర ఉంది. దీంతో ఆయన ఇప్పటివరకు తన పదవీ కాలంలో మొత్తం 35 మందికి మరణశిక్ష విధించినట్లైంది.

Also Read..

చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్య‌క్తిగ‌త mRNA" వ్యాక్సిన్

దెబ్బ‌కు దెబ్బ‌.. ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూల్చివేతలు

రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్

Advertisement
Advertisement