త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran War | ఆగ‌ని దాడులు.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చ‌రిక‌లు

Iran War | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు చ‌ల్లార‌డం లేదు. గ‌త 35 రోజులుగా దాడులు, ప్ర‌తిదాడుల‌తో మ‌ధ్య‌ప్రాచ్యం దద్ధ‌రిల్లుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడుల‌ను కొన‌సాగిస్తున్నాయి.

D

International | Published On Apr 3, 2026, 4.33 pm IST

Iran War | ఆగ‌ని దాడులు.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చ‌రిక‌లు
Advertisement

Iran War | త్రినేత్ర‌.న్యూస్ : ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు చ‌ల్లార‌డం లేదు. గ‌త 35 రోజులుగా దాడులు, ప్ర‌తిదాడుల‌తో మ‌ధ్య‌ప్రాచ్యం దద్ధ‌రిల్లుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడుల‌ను కొన‌సాగిస్తున్నాయి. టెహ్రాన్ సైతం శ‌త్రు దాడుల‌ను ధీటుగా ఎదుర్కొంటోంది. గల్ఫ్, జోర్డాన్‌లలోని 8 ప్రముఖ బ్రిడ్జ్‌లను ఐఆర్‌జీసీ టార్గెట్ చేసింది. అదే స‌మ‌యంలో ఇరాన్‌లో త‌మ సైన్యం ఇంకా విధ్వంసాన్ని మొద‌లు పెట్ట‌లేద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చ‌రించారు.

విధ్వంసం మొద‌లు కాలేదు..

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మ‌రోసారి గట్టి హెచ్చరికలు చేశారు. ఇరాన్‌లో విధ్వంసం ఇంకా మొదలవలేదని వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యం ప్రపంచంలోనే అత్యంత గొప్ప‌ద‌ని, శక్తివంతమైనదిగా అభివ‌ర్ణించారు. త‌మ సైన్యం ఇరాన్‌లో మిగిలి ఉన్నవాటిని నాశనం చేయడం ఇంకా మొద‌లు పెట్ట‌లేద‌ని వ్యాఖ్యానించారు. ఆ దేశంలోని వంతెనలు, విద్యుత్‌ ప్లాంట్‌లను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ కొత్త నాయ‌క‌త్వానికి ఏం చేయాలో తెలుస‌ని.. దానిని త్వ‌ర‌గా ఆచ‌రించాల‌ని హెచ్చ‌రించారు. వారు ఓ ఒప్పందానికి వ‌స్తే మంచిద‌ని సూచించారు.

దెబ్బ‌కు దెబ్బ‌..

ఇరాన్‌లోని కరజ్ ప్రాంతంలో ఉన్న అత్యంత ఎత్తైన 'బీ1' బ్రిడ్జ్‌పై శ‌త్రు దేశాలు జ‌రిపిన దాడుల‌కు టెహ్రాన్ ప్ర‌తీకార దాడుల‌కు పూనుకుంది. కువైట్‌లోని షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా సీ బ్రిడ్జ్, యూఏఈలోని షేక్ జాయెద్, అల్ మఖ్తా, షేక్ ఖలీఫా బ్రిడ్జ్, సౌదీ అరేబియా-బ‌హ్రెయిన్‌ను క‌లిపే కింగ్ ఫ‌హ‌ద్ కాజ్వే, జోర్దాన్‌లోని కింగ్ హుస్సేన్, దామియా , అబ్దున్ వంతెల‌ను ఐఆర్‌జీసీ టార్గెట్ చేసింది. వీటిని ధ్వంసం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

గ‌మ్య‌స్థానాన్ని మార్చుకున్న ‘పింగ్‌ షున్‌’

భారత్‌కు రావాల్సిన ఇరాన్‌ ముడి చమురు ట్యాంకర్‌ ‘పింగ్‌ షున్‌’ తన గమ్యస్థానాన్ని మార్చుకుంది. చైనా వైపు వెళ్తున్న‌ట్లు షిప్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ కెప్లర్‌ పేర్కొంది. మార్చి 4న ఖర్గ్‌ ద్వీపం వద్ద చ‌మురు నింపుకున్న ఈ షిప్‌.. ఈనెల 4న గుజరాత్‌లోని వడినార్‌ నౌకాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అది ఇప్పుడు త‌న గ‌మ్య‌స్థానాన్ని మార్చుకుని చైనాలోని డోగియింగ్‌కు వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు 6 ల‌క్ష‌ల బ్యారెళ్ల చ‌మురు ఉన్న‌ట్లు కెప్ల‌ర్ తెలిపింది.

ఆరోగ్య సదుపాయాలకు నష్టం.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళ‌న‌

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మౌలిక స‌దుపాయాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య స‌దుపాయాల‌కు న‌ష్టం క‌ల‌గ‌డం ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్యం సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. టెహ్రాన్‌లోని వైద్య మౌలిక స‌దుపాయాల‌పై దాడులు జ‌రిగిన‌ట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్-జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. ఈ దాడుల్లో ఇరాన్‌లోని పాశ్చ‌ర్ ఇన్‌స్టిట్యూట్ తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ట్లు చెప్పారు. అది ఇక‌పై సేవ‌లు అందించే స్థితిలో లేద‌ని పేర్కొన్నారు.

రెండో ఎఫ్-35ను కూల్చివేశాం.. ఇరాన్

అమెరికాకు చెందిన రెండో ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. కూలిన వెంట‌నే విమానం పేలిపోయిన‌ట్లు తెలిపింది. ఈ ఘ‌ట‌న‌లో పైల‌ట్ బ‌తికే అవ‌కాశం లేద‌ని పేర్కొంది. ఎఫ్‌-35 కూలిన ఫొటోను ఇరాన్ మీడియా విడుద‌ల చేసింది. అయితే, ఆ ఫొటోల‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అవి ఎఫ్‌-35 శ‌క‌లాలు కాద‌ని, ఎఫ్‌-15 ఫైట‌ర్ జెట్‌కు చెందిన‌వ‌ని ఏరోస్పేస్ నిపుణులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఈ దాడిపై అమెరికా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

కువైట్ చ‌మురుశుద్ధి క‌ర్మాగారంపై ఇరాన్ దాడి

కువైట్‌లోని ప్రధాన చమురుశుద్ధి కర్మాగారం మీనా అల్-అహ్మదిపై ఇరాన్‌ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో మీనా అల్-అహ్మది ఒకటి. కువైట్ చమురు ఉత్పత్తికి ఇది చాలా కీలకం.

Also Read..

50 ఏళ్లు పూర్తి చేసుకున్న యాపిల్‌.. ప్రొడ‌క్ట్స్ పై భారీ డిస్కౌంట్లు..

జ‌ల‌ప్ర‌వేశం చేసిన ఐఎన్ఎస్ తారాగిరి.. హాజ‌రైన ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌..

250 ఎకరాల మెట్రో భూములు కాజేసేందుకు సీఎం య‌త్నం: ఎమ్మెల్యే కె .పి. వివేకానంద

Advertisement
Advertisement