US Military Strikes on Venezuela | యూఎస్ ప్రభుత్వం వెనిజులాపై చేసిన మెరుపు దాడులతో కారకాస్ నగరం మొత్తం మూగబోయింది. వెనిజులా రాజధాని కారకాస్‌తో పాటు పక్కన ఉండే ఇతర నగరాలు కూడా స్తంభించిపోయాయి. యూఎస్ మిలిటరీ.. కారకాస్‌పై ఎయిర్ స్ట్రైక్స్‌తో దాడి చేయడంతో పవర్ గ్రిడ్స్, క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నాశనం అయింది. దీంతో క్యాపిటల్ సిటీ చీకట్లలో మగ్గుతోంది. కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్ కూడా స్తంభించిపోయాయి. దీంతో క్యాపిటల్ అంతటా ఎక్కడ చూసినా ఎడారిలా వీధులు కనిపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని.. యూఎస్ ప్రభుత్వం బందీని చేసి న్యూయార్క్‌కి తరలించడంతో వెనిజులా పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ స్థిరపడ్డ ఇండియన్స్ పరిస్థితిపై కారకాస్‌లో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ మెంబర్ సునీల్ మల్హోత్రా ఏమంటున్నారంటే.. తినడానికి ఆహారం కూడా లేదు. ఎక్కడో ఒకచోట దొరుకుతున్నా పెద్ద క్యూలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా భయాందోళనలే అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కారకాస్ నగరమంతా ధ్వంసమైంది. ఎయిర్‌పోర్ట్‌ని నాశనం చేశారు. సిటీకి అవతల ఉన్న 100 కిమీల మేర ఉన్న ఎయిర్‌బేస్‌పై కూడా దాడి చేశారు.. అని తెలిపాడు. పవర్ గ్రిడ్ కూలిపోవడంతో నగరమంతా పవర్ పోయింది. ఫోన్లు చార్జింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో ప్రజలంతా చార్జింగ్ కోసం వీధి లైట్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. పబ్లిక్ లైట్లు ఉన్నచోట చార్జింగ్ కోసం పోటీ పడుతున్నారు. సూపర్ మార్కెట్లు, ఇతర షాపులు అన్నీ మూత పడ్డాయి. బ్రెడ్ కోసం కూడా జనాలు కొట్టుకుంటున్నారు. మెడిసిన్ కోసం పెద్ద క్యూ ఉంది. గంటల కొద్దీ వేచి ఉంటే కానీ చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉండటం లేదు. నగరమంతా పోలీసుల స్వాధీనంలో ఉండటంతో వీధుల్లో ఎక్కడ చూసినా పోలీసులు గన్‌తో తిరుగుతున్నారు. ప్రజలను బయటికి రావొద్దని.. ఇళ్లలోని వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. మేజర్‌గా నగరానికి పవర్ సప్లయి చేస్తున్న ఫుయెర్టె టియునా దాడుల్లో నాశనం కావడంతో ఇప్పట్లో నగరానికి కరెంట్ సప్లయి చేయడం కష్టమేనని అధికారులు చేతులెత్తేశారు. 2014 నుంచి 2017 సమయంలో కూడా దేశంలో అప్పుడు తలెత్తిన పరిస్థితుల వల్ల జనాలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అప్పట్లో చిన్నపిల్లలను కూడా తీసుకెళ్లి జైలులో వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్లను విడుదల చేయలేదు. అందుకే ఈసారి ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రజలు మాత్రం బయటికి రాకుండా ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. వెనిజులాలో నివాసం ఉంటున్న ఇండియన్స్ కోసం భారత ఎంబసీ అధికారులు ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ల క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.