త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | విద్యుత్ అంబులెన్స్‌లు తీసుకువ‌చ్చాం..

Bhatti Vikramarka | తెలంగాణ‌లో 108 అంబులెన్స్‌ల త‌ర‌హాలో విద్యుత్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అంబులెన్స్‌ల‌ను తీసుకువ‌చ్చామ‌ని ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క వెల్ల‌డించారు. విద్యుత్ రంగంపై శాస‌న మండ‌లిలో చ‌ర్చలో పాల్గొన్నారు.

A

Flash news | Published On Jan 5, 2026, 3.40 pm IST

Bhatti Vikramarka | విద్యుత్ అంబులెన్స్‌లు తీసుకువ‌చ్చాం..
Advertisement
  • 1912 నంబ‌ర్‌కి డ‌య‌ల్ చేస్తే స‌మ‌స్య‌ల పరిష్కారం
  • ​మూడేళ్లలో 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్ల మంజూరు
  • గ‌త పాల‌కులు పీఎం కుసుమ్ ప‌థ‌కాన్ని నిర్ల‌క్ష్యం చేశారు..
  • ​శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka | విద్యుత్ అంతరాయం కలిగితే గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. 108 త‌ర‌హాలో విద్యుత్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చామని డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క వెల్ల‌డించారు. 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, థర్మల్ విజన్ కెమెరాలు, సేఫ్టీ గేర్ బాక్సులతో కూడిన వాహనం క్షేత్రస్థాయికి చేరుకుంటుందని తెలిపారు. ఇంజినీర్‌, ఇద్దరు సిబ్బంది అంబులెన్స్‌లో వ‌చ్చి యుద్ధ ప్రాతిప‌దిక‌న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తార‌ని పేర్కొన్నారు. శాస‌న‌మండ‌లిలో విద్యుత్‌శాఖ‌పై సోమ‌వారం చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ రైతులకు, సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమన్నారు.

స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూనే..

గత ప్రభుత్వాల హయాంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తూనే, ఆధునిక సాంకేతికతతో విద్యుత్ శాఖను ప్రజల ముంగిటకే తీసుకెళ్తున్నామన్నారు. 2022 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి.. ఏకంగా 3,44,462 మంది రైతులకు కొత్త విద్యుత్ కనెక్షన్లు కల్పించామ‌ని, కనెక్టెడ్ లోడ్ కనెక్షన్ల  అనుగుణంగా 75,686 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామ‌న్నారు. మరో 9,700 మంది రైతులకు లైన్ పనులు పూర్తి కాగానే ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. రెండేళ్లలో (2024, 2025) దాదాపు 2 లక్షల అదనపు కనెక్షన్లు ఇచ్చామ‌ని.. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్ల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజాబాట కార్యక్రమంలో అధికారులు వారానికి మూడురోజులు పొలాల్లోనే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నార‌న్నారు.

గ్రీన్ ఎన‌ర్జీ రంగంలో బ‌హుముఖ వ్యూహంతో ముందుకు..

రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగం విష‌యంలో క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోందన్నారు. అటు వ్యవసాయ రంగంతో పాటు, ఇటు గృహ అవసరాలకు గ్రీన్ ఎనర్జీని అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసిన‌ట్లు చెప్పారు. ​కేంద్రం పదేళ్ల కింద‌ట పీఎం కుసుమ్ ప‌థ‌కాన్ని ప్రారంభించింద‌ని.. గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసి ప్ర‌తిపాద‌న‌లు పంప‌క‌పోవ‌డంతో రాష్ట్రంలో ఈ ప‌థ‌కం అమ‌లుకావ‌డం లేద‌న్నారు. ఈ ప‌థ‌కం కింద గ‌రిష్టంగా క‌నెక్ష‌న్లు సాధించేందుకు కేంద్రంతో నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లుగా పేర్కొన్నారు. సీఎం రేవంత్‌, తాను కేంద్ర‌మంత్రిని ప‌థ‌కాన్ని రాష్ట్రానికి కేటాయించాల‌ని స్వ‌యంగా క‌లిసి, లిఖిత‌పూర్వ‌కంగా కోరామ‌ని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు.

నిబంధ‌న‌లు మార్చాల‌ని కేంద్రాన్ని కోరాం..

రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమ‌లు చేస్తున్న నేప‌థ్యంలో రైతులు, గృహ వినియోగదారులను ప్రోత్సహించేందుకు నిబంధనలో మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామ‌ని భ‌ట్టి తెలిపారు. మరోవైపు, వ్యవసాయ రంగంలోనూ సోలార్ విప్లవం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా సభ్యులు గ్రూపులుగా ఏర్పడి సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునేందుకు, అలాగే రైతుల భూములను లీజుకు తీసుకుని ప్రాజెక్టులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింద‌న్నారు. వ్యవసాయం చేసుకునే రైతులకే పీఎం కుసుం వ‌ర్తింప‌జేస్తామ‌ని, లీజు రైతులకు వర్తింపజేయలేమని కేంద్రం చెప్పింద‌ని తెలిపారు. వీరికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించడం కొంత అడ్డంకిగా మారిందన్నారు. గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యమైన‌ప్పుడు.. రైతులకే ఆదాయం వెళ్తున్న‌ప్పుడు లీజు నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించాల‌ని కేంద్రాన్ని కోరామ‌న్నారు. ఇప్పటికే రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుంద‌ని, దాంతో సోలార్ విద్యుత్‌పై ఆస‌క్తి చూపించ‌డం లేద‌న్న డిప్యూటీ సీఎం.. వారిని చైతన్య పరిచే దిశ‌గా ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంద‌ని వివ‌రించారు.

Read Also :

ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మ గౌర‌వ పంచాయితీ: ఎమ్మెల్సీ క‌విత

నూత‌న రాజ‌కీయ పార్టీ ఏర్పాటును నిర్ధారించిన క‌విత‌

Advertisement

తాజావార్తలు

Advertisement