Venezuela President Nicolas Maduro Arrest | సౌత్ అమెరికా దేశం అయిన వెనిజులాలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. వెనిజులాపై అమెరికా స్పెషల్ ఫోర్స్ మెరుపు దాడి చేయడం, వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను బందీగా చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ఇద్దరినీ అమెరికా బందీలుగా చేసి అమెరికా తరలించింది. దీనిపై భారత్ స్పందించి.. వెనిజులా పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెనిజులాలో జరుగుతున్న పరిణామాలను మేము నిశితంగా గమనిస్తున్నాం. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. వెనిజులా ప్రజల భద్రత, సంక్షేమానికి భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుంది. శాంతియుతంగా సమస్యలను పరిష్కంచుకోవాలి. ఆ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడాలని మేము కోరుతున్నామని.. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వెనిజులా క్యాపిటల్ కారకాస్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న భారతీయ సమాజంతో టచ్‌లో ఉందని, వారికి అవసరమైన సాయాన్ని అందించడానికి కార్యాలయం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. శనివారం అర్ధరాత్రి అమెరికా దళాలు కారకస్‌పై బాంబుల వర్షం కురిపించాయి. అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్‌ని పూర్తి చేశాయి. మదురోను బందీగా చేసిన తర్వాత ఆయన్ను న్యూయార్క్‌కి తరలించిన విషయం తెలిసిందే. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్ మొత్తాన్ని లైవ్‌లో వీక్షించారు. ఆ తర్వాత మదురో కళ్లకు గంతలు కట్టి, చేతులకు సంకెళ్లు వేసి ఉన్న ఫోటోను ట్రంప్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. గతంలోనే మదురోపై రివార్డు గత 12 ఏళ్లుగా మదురో వెనిజులాను పాలిస్తున్నారు. ఆయనపై గతంలోనే యూఎస్ 50 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. యూఎస్‌లోకి డ్రగ్స్ రవాణా, ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలతోనే మదురోను అదుపులోకి తీసుకొని న్యూయార్క్‌కి తీసుకొచ్చామని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. వెనిజులాకు స్వేచ్ఛ లభించింది మరోవైపు మదురో పాలన అంతం అయిందని.. వెనిజులాకు స్వేచ్ఛ లభించిందని వెనిజులా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కోరినా మచాడో సంతోషం వ్యక్తం చేశారు. వెనిజులాపై యూఎస్ నిర్వహించిన మెరుపు దాడిని రష్యా, చైనా లాంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్ మాత్రం శాంతియుత చర్చల ద్వారా పరిష్కారం లభించాలని కోరుతూ.. వెనిజులా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.