త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran-US | శాంతి చ‌ర్చ‌ల‌పై నీలి నీడ‌లు..

Iran-US | పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన శాంతి చ‌ర్చ‌ల‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. లెబ‌నాన్ అంశం తేల్చే వ‌ర‌కూ అమెరికాతో చ‌ర్చ‌ల‌కు వ‌చ్చేది లేద‌ని ఇరాన్ తెగేసి చెప్పింది.

D

International | Published On Apr 10, 2026, 4.44 pm IST

Iran-US | శాంతి చ‌ర్చ‌ల‌పై నీలి నీడ‌లు..
Advertisement
  • లెబ‌నాన్ అంశం తేలిస్తేనే అమెరికాతో చ‌ర్చ‌లు
  • మ‌ధ్య‌ప్రాచ్యానికి పాక్ ఫైట‌ర్ జెట్లు
  • హై అల‌ర్ట్‌లో పాక్‌.. ఇస్లామాబాద్‌లో రెడ్‌ జోన్‌కు మూత
  • చమురు ఉత్పత్తికి భారీ నష్టం వాటిల్లిందన్న సౌదీ అరేబియా
  • కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించినా.. ఆగ‌ని దాడులు

అమెరికా-ఇరాన్ రెండు వారాల కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించినా.. ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు మాత్రం ఆగ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం మ‌రో కీల‌క మ‌లుపు తిరిగేలా క‌నిపిస్తోంది. పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన శాంతి చ‌ర్చ‌ల‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. లెబ‌నాన్ అంశం తేల్చే వ‌ర‌కూ అమెరికాతో చ‌ర్చ‌ల‌కు వ‌చ్చేది లేద‌ని ఇరాన్ తెగేసి చెప్పింది. లెబ‌జాన్‌పై ఇజ్రాయెల్ దాడుల‌ను ఆపేస్తేనే శాంతి చ‌ర్చ‌ల‌కు వ‌స్తామంటూ ఇరాన్ మెలిక‌పెట్టింది.

ఇస్లామాబాద్‌లో వారాంతంలో జరిగే ఈ భేటీలో పాల్గొనే అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నేతృత్వం వహించనున్నారు. ఇందుకోసం వాన్స్‌ ఇస్లామాబాద్ బయల్దేరి వెళ్లారు. ఇక ఈ చర్చల కోసం 10 మంది సభ్యులతో కూడిన ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు వస్తుందని పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబారి రెజా అమీర్ ఎక్స్‌ వేదికగా తొలుత ధృవీకరించారు. అయితే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దాడులను ఖండిస్తూ ఇరాన్‌ రాయబారి తన ప్రకటనను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించడం భేటీ జరగడంపై అనుమానాలను మరింత పెంచింది. ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తే చర్చల ప్రక్రియ ముందుకు సాగడం కష్టమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ సైతం సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో భేటీ జరగడంపై అస్పష్టత నెలకొంది.

ఇస్లామాబాద్‌లో రెడ్‌ జోన్‌కు మూత

ఏప్రిల్ 11న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలు జరగనున్నాయి. అత్యంత కీల‌క‌మైన దౌత్య స‌మావేశానికి ఆతిథ్యం ఇస్తున్న ఇస్లామాబాద్‌పైనే అంద‌రి దృష్టి ప‌డింది. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ హై అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ఇస్లామాబాద్ వ్యాప్తంగా భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. పాక్ రాజ‌ధాని మొత్తం రెడ్‌జోన్‌లోకి వెళ్లిపోయింది. చ‌ర్చ‌ల నేప‌థ్యంలో పాక్ ప్ర‌భుత్వం రెండు రోజుల పాటూ సెల‌వు ప్ర‌క‌టించింది. పాఠ‌శాల‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, దుకాణాలు మూత‌ప‌డ్డాయి. ప్రభుత్వ భవనాలు, కీలక రహదారి మార్గాల వద్ద భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. రాజధానిలోని రెడ్‌జోన్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. అక్కడ పరిమిత సంఖ్యలోనే జనసంచారం కనిపిస్తోంది.

మ‌ధ్య‌ప్రాచ్యానికి పాక్ ఫైట‌ర్‌ జెట్లు..

చ‌ర్చ‌ల‌కు ముందు పాకిస్థాన్ త‌న‌ ఫైట‌ర్ జెట్ల‌ను మ‌ధ్య‌ప్రాచ్యానికి పంపింది. ఈ చ‌ర్చ‌ల కోసం వ‌చ్చే ప్ర‌తినిధుల బృందం ప్ర‌యాణించే విమానానికి ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి ముప్పు వాటిల్ల‌కుండా ముందు జాగ్ర‌త్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే త‌న‌ ఫైటర్ జెట్‌లు, C-130 రవాణా విమానాలు, రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, అవాక్స్ విమానాలను మధ్యప్రాచ్యానికి పంపింది.

షాహిద్ డ్రోన్ల‌ను కూల్చాం..

గ‌ల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావ‌రాలే ల‌క్ష్యంగా ఇరాన్ ఉప‌యోగించిన షాహిద్ డ్రోన్ల‌ను త‌మ ద‌ళాలు కూల్చేశాయ‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అటువంటి డ్రోన్లనే రష్యా తమపై వాడుతోందని చెప్పారు. వాటిని ఎదుర్కోవడానికి తమ సైన్యం ఉపయోగిస్తున్న దేశీయ ఇంటర్‌ సెప్టర్‌ డ్రోన్లను పశ్చిమాసియా దేశాలు కోరడంతో తమ దళాలను అక్కడికి పంపినట్లు తెలిపారు.

సౌదీ చమురు ఉత్పత్తికి భారీ నష్టం

ఈ యుద్ధం నేప‌థ్య‌లో త‌మ దేశ చ‌మురు ఉత్ప‌త్తికి భారీగా న‌ష్టం వాటిల్లింద‌ని సౌదీ అరేబియా వెల్ల‌డించింది. ఇరాన్ జ‌రిపిన దాడుల్లో చమురు ఉత్పత్తి, రవాణా, రిఫైనరీ కేంద్రాలు, పెట్రోకెమికల్, పవర్ ప్లాంట్‌లు దెబ్బతిన్నాయని పేర్కొంది.

Also Read..

యుద్ధం ముగుస్తుంద‌ని ఆశ‌లు.. భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.3వేలు.. ఐదేళ్ల‌లో కోటి ఉద్యోగాలు.. బెంగాల్ ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసిన బీజేపీ

మ‌రోసారి ఎగువ స‌భ‌కు హ‌రివంశ్ నారాయ‌ణ్‌ సింగ్‌.. నామినేట్ చేసిన రాష్ట్ర‌ప‌తి

Advertisement
Advertisement