త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | యుద్ధం ముగుస్తుంద‌ని ఆశ‌లు.. భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ‌ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా లాభాల‌ను న‌మోదు చేశాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 రెండూ 1 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. సెన్సెక్స్ 918.60 పాయింట్లు (1.20 శాతం) పెరిగి 77,550.25 వద్ద ముగిసింది. నిఫ్టీ50 సూచీ 275.50 పాయింట్లు (1.16 శాతం) పెరిగి 24,050.60 వద్ద స్థిరపడింది.

S

Business | Published On Apr 10, 2026, 4.01 pm IST

Stock Markets | యుద్ధం ముగుస్తుంద‌ని ఆశ‌లు.. భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ‌ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా లాభాల‌ను న‌మోదు చేశాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 రెండూ 1 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. సెన్సెక్స్ 918.60 పాయింట్లు (1.20 శాతం) పెరిగి 77,550.25 వద్ద ముగిసింది. నిఫ్టీ50 సూచీ 275.50 పాయింట్లు (1.16 శాతం) పెరిగి 24,050.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ 100 సూచీలు వరుసగా 1.52 శాతం, 1.65 శాతం మేర లాభపడ్డాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లో రూ.445 లక్షల కోట్లు ఉండ‌గా శుక్ర‌వారం ర్యాలీతో అది దాదాపు రూ.451 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.6 లక్షల కోట్ల మేర పెరిగింది.

పెట్టుబ‌డిదారుల ఆశావ‌హ దృక్ప‌థం..

అమెరికా-ఇరాన్ చర్చలపై ఆశావహ భావన మార్కెట్‌కు ఊతమిచ్చింది. ఈ వారాంతంలో జరగనున్న చర్చలు పశ్చిమ ఆసియా యుద్ధానికి ముగింపు పలుకుతాయన్న ఆశలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచాయి. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, గ్లోబల్ ఆర్థిక ప్రమాదాలు పెరగడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్ అధికారులతో చర్చలు జరిపేందుకు పాకిస్థాన్‌కు వెళ్ల‌నున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ బలగాలు కువైట్‌లో డ్రోన్ దాడులు జరిపినట్లు, ఇజ్రాయెల్ లెబనాన్‌లో హిజ్బొల్లాపై దాడులు చేసినట్లు సమాచారం.

చ‌ర్చ‌ల ఫ‌లితం ప్ర‌కార‌మే మార్కెట్ల దిశ‌..

జియోజిట్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కే. విజయకుమార్ మాట్లాడుతూ శనివారం జరగనున్న అమెరికా-ఇరాన్ శాంతి చర్చల ఫలితాల కోసం మార్కెట్ ఎదురుచూస్తుంద‌ని తెలిపారు. ఈ చర్చల ఫలితమే ముడి చమురు ధరల దిశను నిర్ణయిస్తుంద‌ని, అదే మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేస్తుంద‌ని తెలిపారు. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా ర్యాలీకి కార‌ణం అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తన ధోరణిని మార్చడం, అలాగే ఇజ్రాయెల్ లెబనాన్‌తో చర్చలు జరపడానికి అంగీకరించడం వల్ల ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు పెరిగాయి. ఈ నేపథ్యంలో జపాన్, దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు దాదాపు 2 శాతం లాభపడ్డాయి. అలాగే ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్ సూచీలు కూడా క్రితం సెష‌న్‌లో లాభాలతో ముగిశాయి.

టాప్ గెయిన‌ర్లు, లూజ‌ర్లు..

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో జరిగిన భారీ కొనుగోళ్లు మార్కెట్‌కు బలం చేకూర్చాయి. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు సుమారు 2 శాతం పెరిగాయి. నాలుగో త్రైమాసిక ఫలితాల ముందు విలువ ఆధారిత కొనుగోళ్లు పెరగడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఇక నిఫ్టీ50 లో హిందాల్కో ఇండ‌స్ట్రీస్ షేర్లు భారీగా లాభ‌ప‌డ్డాయి. ఆ సంస్థ షేర్లు 2.05 శాతం మేర పెరిగాయి. దీంతో ఈ సంస్థ టాప్ గెయిన‌ర్ల జాబితాలో నిలిచింది. త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా కోల్ ఇండియా, ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేష‌న్‌, ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలు నిలిచాయి. అలాగే టాప్ లూజర్ల జాబితాలో 5 శాతం మేర ప‌త‌నంతో బ‌జాజ్ ఫైనాన్స్ మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంట‌ర్ గ్లోబ్ ఏవియేష‌న్ లిమిటెడ్‌, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్‌లు నిలిచాయి. అయితే మార్కెట్ సెష‌న్ చివ‌రి వ‌ర‌కు కొన్ని బ్యాంకింగ్‌, ఫైనాన్స్ సంస్థ‌ల స్టాక్స్ లాభాల్లో ఉన్న‌ప్ప‌టికీ పెట్టుబ‌డిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు య‌త్నించారు. దీంతో సెష‌న్ చివ‌ర్లో స్టాక్స్ ప‌త‌నం అయ్యాయి. త‌రువాత కాస్త రిక‌వ‌ర్ అయ్యాయి.

స్వ‌ల్పంగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు, బ‌ల‌ప‌డ్డ డాల‌ర్‌..

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు మిశ్ర‌మ స్పంద‌న‌తో కొన‌సాగాయి. డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 0.150 డాల‌ర్లు పెరిగి 91.845 వ‌ద్ద ఉండ‌గా, బ్రెంట్ క్రూడ్ ధ‌ర మాత్రం బ్యారెల్‌కు 0.11 డాల‌ర్లు త‌గ్గి 93.82 వ‌ద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో శుక్ర‌వారం సెష‌న్‌లో భార‌త రూపాయ విలువ మ‌రోమారు ప‌త‌నం అయింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి 34 పైస‌లు త‌గ్గి 92.78 వ‌ద్ద నిలిచింది.

Advertisement
Advertisement