త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Warangal Mamnoor Airport | వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు “దొడ్డి కొమరయ్య” పేరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కీలక విజ్ఞప్తి

వరంగల్ శివార్లలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి.

J

Warangal | Published On Aug 29, 2026, 10.00 pm IST

Warangal Mamnoor Airport | వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు “దొడ్డి కొమరయ్య” పేరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కీలక విజ్ఞప్తి
Advertisement
  • పునరుద్ధరణ దశలో ఉన్న వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్టుకు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని డిమాండ్
  • ఈ మేరకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి లేఖ రాసిన డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్
  • బహుజన వీరుడి పోరాట స్ఫూర్తిని, త్యాగాన్ని రాబోయే తరాలకు చాటిచెప్పేలా పౌర విమానయాన శాఖ దృష్టికి ఈ ప్రతిపాదనను తీసుకెళ్లాలని వినతి

Warangal Mamnoor Airport | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ నిరంకుశ రాచరిక పాలనపై ఎదిరించి పోరాడిన సాయుధ పోరాట తొలి అమరుడు, బహుజన వీరుడు దొడ్డి కొమరయ్య. ఆయన చేసిన ప్రాణత్యాగానికి చిరస్థాయిగా గుర్తింపు తెచ్చేందుకు వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టుకు (Mamnoor Airport) ఆయన పేరు పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి శనివారం ఓ కీలక విజ్ఞప్తి అందింది.

కేంద్ర పౌర విమానయాన శాఖ (Civil Aviation Ministry) ఆధ్వర్యంలో వరంగల్ శివార్లలో ఉన్న మామునూరు విమానాశ్రయం త్వరలో పునరుద్ధరణకు నోచుకోనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఎయిర్‌పోర్టుకు "అమరవీరుడు దొడ్డి కొమరయ్య విమానాశ్రయం" గా నామకరణం చేయాలని కోరుతూ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ కేంద్ర మంత్రికి ఒక వినతిపత్రం సమర్పించారు.

నిజాం మూకలు, భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో దొడ్డి కొమరయ్య చేసిన ఆత్మబలిదానం తెలంగాణ సాయుధ పోరాటానికే ఊపిరిపోసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడవెండి (ప్రస్తుత జనగామ జిల్లా) ఆయన జన్మభూమి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం ద్వారా బహుజన పోరాట చరిత్రను ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పినట్లు అవుతుందని చరణ్ కౌశిక్ యాదవ్ తన లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ నేల అందించిన గొప్ప విప్లవ వీరుడికి అసలైన నివాళి అర్పించేలా కేంద్ర ప్రభుత్వం తరఫున పౌర విమానయాన శాఖ దృష్టికి ఈ ప్రతిపాదనను తీసుకెళ్లాలని ఆయన కోరారు. కిషన్ రెడ్డి (G. Kishan Reddy) ప్రత్యేక చొరవ తీసుకుని ఈ నామకరణం ఆమోదం పొందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement