త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Ravindran | ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ.. రష్మికను పుణే సియా గోయల్‌తో పోల్చిన నెటిజన్లు.. ఎక్స్ యాప్ డిలీట్ చేసిన డైరెక్టర్

'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా వివాదంలో తన పిల్లలకి చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఎక్స్ అకౌంట్‌ను డిలీట్ చేశారు.

J

Viral news | Published On Jun 30, 2026, 7.18 pm IST

Rahul Ravindran | ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ.. రష్మికను పుణే సియా గోయల్‌తో పోల్చిన నెటిజన్లు.. ఎక్స్ యాప్ డిలీట్ చేసిన డైరెక్టర్
Advertisement
  • పిల్లలకు డెత్ త్రెట్స్
  • కోపంతో రగిలిపోయిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్
  • 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాపై వివాదం పెరగడంతో సంచలన నిర్ణయం.
  • తన పిల్లలను లక్ష్యంగా చేసుకుని యాంటీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన బెదిరింపులతో ఎక్స్ యాప్‌ డిలీట్
  • పూణే కేతన్ అగర్వాల్ హత్య కేసుకు, తన సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం
  • సోషల్ మీడియాలో వచ్చిన ఒక కామెంట్ తనలో విపరీతమైన కోపాన్ని రేకెత్తించడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Rahul Ravindran | త్రినేత్ర.న్యూస్ : టాలీవుడ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తెరకెక్కించిన మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్' చుట్టూ చెలరేగిన వివాదం, తన పిల్లలకు వచ్చిన డెత్ త్రెట్స్ (Death threats) కారణంగానే ఆయన జూన్ 30న తన ఫోన్ నుంచి ఈ యాప్‌ను శాశ్వతంగా డిలీట్ చేశారు. కేవలం స్పోర్ట్స్ అప్‌డేట్స్ కోసం మాత్రమే ఇన్నాళ్లూ ట్విట్టర్‌లో ఉన్నానని, కానీ నెగిటివిటీ హద్దులు దాటడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ పోస్ట్ చూసి రగిలిపోయా!

జూన్ 30న బ్రెజిల్ వర్సెస్ జపాన్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ స్పోర్ట్స్ అప్‌డేట్స్ కోసం ఎక్స్ యాప్ ఓపెన్ చేశానని రాహుల్ తెలిపారు. దురదృష్టవశాత్తూ నోటిఫికేషన్స్ చెక్ చేసినప్పుడు, తన పిల్లలను టార్గెట్ చేస్తూ ఒక నెటిజన్ చేసిన దారుణమైన కామెంట్ చూశానని వివరించారు.

"ఆ ట్వీట్ చూసి నాలో కోపం కట్టలు తెంచుకుంది. వాడిని పట్టుకుని చెప్పలేని పనులు చేయాలనిపించింది. నాలో ఎప్పుడూ లేని రేంజ్‌లో వైల్డ్ థాట్స్ వచ్చాయి. మామూలుగా నాకు కోపం వస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను, కానీ ఈసారి ఆ కామెంట్ చదివాక నా మైండ్ బ్లాంక్ అయింది. టీవీలో మ్యాచ్ వస్తున్నా చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాను. నాలో ఇంత కోపాన్ని, నెగిటివిటీని నింపే ఈ యాప్ ఇక నాకు వద్దనిపించింది. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే దేనికీ నాపై పెత్తనం చెలాయించే హక్కు లేదు" అని రాహుల్ ఎమోషనల్ అయ్యారు.

అసలు 'ది గర్ల్‌ఫ్రెండ్' వివాదం ఏంటి?

పుణేలో ఇటీవల జరిగిన కేతన్ అగర్వాల్ మర్డర్ కేసును నెటిజన్లు రాహుల్ 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతో ముడిపెట్టడం ఈ ఆన్‌లైన్ వివాదానికి కారణం. కేతన్ అగర్వాల్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె బాయ్‌ఫ్రెండ్ కలిసి కొండ పైనుంచి తోసేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక నెటిజన్ ది గర్ల్‌ఫ్రెండ్ స్టిల్‌ను షేర్ చేస్తూ.. ఇలాంటి సినిమాలు కేవలం ఆడవారికి ఫేవర్‌గా ఉంటాయని, మగాళ్లపై మహిళలు చేసే దారుణాలపై కూడా ఓ సినిమా తీయాలని రాహుల్‌ను ట్యాగ్ చేశాడు.

నెటిజన్లకు రాహుల్ క్లారిటీ

ఈ విమర్శలపై రాహుల్ చాలా హుందాగా స్పందించారు. ఇలాంటి నేరాలను ఆడ, మగ మధ్య యుద్ధంగా చూడలేమన్నారు. ఎన్నో ఏళ్లుగా మన సిస్టమ్‌లో మహిళలు పడుతున్న మూగబాధను, వారు ఎదుర్కొంటున్న మైక్రో అగ్రెషన్స్ (Microaggressions) గురించి ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నాను. నా సినిమాలో హీరో విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ఒక మర్డరర్ కాదు. అతను ఫిజికల్ అబ్యూజ్ (Physical abuse) చేసే వ్యక్తి అసలే కాదు, చాలా లాయల్ (Faithful) పర్సన్. కేతన్ అగర్వాల్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు నేను ఇంకా చదవలేదు. ఒకవేళ ఆ కథలో సినిమాగా తీయాల్సినంత పాయింట్ ఉంటే కచ్చితంగా తీస్తాను. కానీ అది కేవలం ఒక క్రిమినల్ చేసిన నేరంగానే చూస్తాను తప్పితే, దాన్ని మగాళ్లపై మహిళలు చేసే దౌర్జన్యంగా జనరలైజ్ చేయను. విమర్శలను స్వీకరించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని, అయితే ఆరోగ్యకరమైన చర్చలు (Healthy discussions) మాత్రమే అందరికీ మంచిదని రాహుల్ స్పష్టం చేశారు.

అయినా నెటిజన్లు రాహుల్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, తన పిల్లల జోలికి వెళ్లడంతో ఎక్స్ యాప్‌ను డిలీట్ చేసి అకౌంట్‌ను ఇక వాడకూడదని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement