త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP Anand | స్పెష‌ల్ బెటాలియన్ల సేవ‌లు ద‌గ్గ‌రుండి చూశా.. రాష్ట్ర భ‌ద్ర‌త‌కు వారు ఎంతో అవ‌సరం: డీజీపీ సి.వి.ఆనంద్

DGP Anand | తాను నిజామాబాద్, వరంగల్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాల ఎస్పీగా ఉన్న‌ప్పుడు ప్రత్యేక బలగాల సేవలను ప్రత్యక్షంగా చూశానని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్ర భ‌ద్ర‌త‌లో వారి సేవ‌లు ఎంతో అవ‌స‌ర‌మ‌న్నారు. తెలంగాణ స్పెషల్ బెటాలియన్లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత ఆధునికంగా, సాంకేతికంగా బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.

S

Telangana | Published On Jun 30, 2026, 6.48 pm IST

DGP Anand | స్పెష‌ల్ బెటాలియన్ల సేవ‌లు ద‌గ్గ‌రుండి చూశా.. రాష్ట్ర భ‌ద్ర‌త‌కు వారు ఎంతో అవ‌సరం: డీజీపీ సి.వి.ఆనంద్
Advertisement
  • ఆధునికంగా, సాంకేతికంగా బలోపేతం చేయాలి
  • సిబ్బంది సంక్షేమం, శిక్షణ, పారదర్శక పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి
  • డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోకుండా చూడాలి
  • వివ‌క్ష‌కు తావుండొద్దు
  • స‌మీక్షా స‌మావేశంలో అధికారుల‌కు డీజీపీ సి.వి. ఆనంద్ ఆదేశాలు

DGP Anand | త్రినేత్ర‌.న్యూస్‌: తాను నిజామాబాద్, వరంగల్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాల ఎస్పీగా ఉన్న‌ప్పుడు ప్రత్యేక బలగాల సేవలను ప్రత్యక్షంగా చూశానని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్ర భ‌ద్ర‌త‌లో వారి సేవ‌లు ఎంతో అవ‌స‌ర‌మ‌న్నారు. తెలంగాణ స్పెషల్ బెటాలియన్లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత ఆధునికంగా, సాంకేతికంగా బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. పరిపాలనా, సాంకేతిక, సంక్షేమ అంశాలపై సమీక్షించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణ, విపత్తు నిర్వహణ, వీఐపీ బందోబస్తు, ప్రత్యేక ఆపరేషన్లలో స్పెషల్ బెటాలియన్లను ప్ర‌త్యేక పాత్ర పోషిస్తున్నాయి. బెటాలియన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. వాహనాల సంఖ్యను పెంచడం, సిబ్బందికి మెరుగైన నివాస క్వార్టర్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని అధికారులను ఆదేశించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (APSP) బెటాలియన్లు నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో సివిల్ పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచార‌న్నారు. ఎన్నో కీలక ఆపరేషన్లలో సేవలు అందించాయని గుర్తు చేశారు. నిజామాబాద్, వరంగల్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాల ఎస్పీగా పనిచేసిన సమయంలో వారి సేవలను ప్రత్యక్షంగా చూశానన్నారు. పోలీస్ స్టేషన్లపై తరచూ నక్సల్స్ దాడులు జరిగేవని.. నక్సల్స్ నిర్మూలనలో స్పెష‌ల్ బెటాలియ‌న్లు కీలక పాత్ర పోషించాయని డీజీపీ ప్రశంసించారు.

నిజామాబాద్‌, కామారెడ్డిలో సేవ‌లు భేష్‌..

తెలంగాణ ప్రభుత్వం 13 స్పెషల్ బెటాలియన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ బెటాలియన్లు ఎన్నికల సమయంలో భారీ బందోబస్తు, శాంతిభద్రతల నిర్వహణ, ముఖ్యమైన ఉత్సవాలు, మతపరమైన వేడుకలు, ప్రజా సమావేశాలు, వీఐపీ భద్రత, విపత్తు నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల రక్షణలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇటీవ‌ల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాల సమయంలో తెలంగాణ స్పెషల్ బెటాలియన్ అంకితభావంతో పనిచేశాయి. పరిపాలనలో క్రమశిక్షణతో పాటు మానవతా దృక్పథం కూడా ఉండాలి. సిబ్బంది కుటుంబ పరిస్థితులు, ఆరోగ్యం, పిల్లల విద్య, వ్యక్తిగత సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలవాలి అని డీజీపీ ఆనంద్ సూచించారు.

వివ‌క్ష‌కు తావివ్వొద్దు..

డ్యూటీల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించాలి. ఎలాంటి వివక్షకు తావివ్వకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఎన్నికలు, ప్రత్యేక బందోబస్తు, వీఐపీ విధులు, ఇతర ప్రత్యేక డ్యూటీలను కూడా నిష్పాక్షికంగా కేటాయించాలి. గతంలో 18 నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉండేవి. ఇప్పుడూ ఆ సమస్య తీరింది. ప్రతి బెటాలియన్ పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, స‌మగ్ర స‌మీక్ష‌లు చేయాలి. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ, ఆమనగల్ ప్రాంతాల్లో కొత్త స్పెషల్ బెటాలియన్ల ఏర్పాటు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం అని ఆయ‌న‌ వెల్లడించారు.

మిత్ర కౌన్సెలింగ్ కేంద్రాలను వినియోగించాలి..

పోలీసు సిబ్బందిలో మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. "మిత్ర" కౌన్సెలింగ్ కేంద్రాలను మరింత సమర్థంగా వినియోగించాలి. విధుల ఒత్తిడి, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులతో బాధపడుతున్న సిబ్బందిని గుర్తించి వారికి నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలి అని అధికారుల‌ను ఆదేశించారు.

శిక్షించడం కంటే ముందే గుర్తించాలి..

పోలీసు సిబ్బంది డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, ఇతర వ్యసనాల బారిన పడకుండా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. శిక్షించడం కంటే ముందుగా గుర్తించి, కౌన్సెలింగ్, వైద్య సహాయంతో తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కృషి చేయాలి. ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. ప్రతి కమాండెంట్ తన పరిధిలోని సిబ్బందితో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలి. స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించేలా చూడాలి అని డీజీపీ సూచించారు.

ఆధునిక పోలీసింగ్‌కు అనుగుణంగా ప్రత్యేక శిక్షణా కేంద్రాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. శిక్షణకు ఎల్లప్పుడూ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ వినియోగం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం, మానసిక దృఢత్వంపై నిరంతర శిక్షణ అందించాలి. తెలంగాణ స్పెషల్ బెటాలియన్లు రాష్ట్ర పోలీసు వ్యవస్థకు వెన్నెముక వంటివి. ఆధునికీకరణ, క్రమశిక్షణ, సాంకేతికత, సిబ్బంది సంక్షేమం అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగాలి అని డీజీపీ ఆనంద్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కాగా అంత‌కుముందు డీజీపీ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలు, పరిపాలనా సెక్షన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఆయుధాల నిర్వహణ, సాంకేతిక విభాగాలు, నిర్మాణ పనులు, కార్యాలయ నిర్వహణ, ఇతర మౌలిక వసతులను ఆయ‌న‌ పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల ప్రజెంటేషన్‌ను పరిశీలించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement