త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Forest Canopies | ఆకాశానికి పందిళ్లు ఈ అడవులు.. వీటిలో పర్యటిస్తే ఎన్ని బాధలు ఉన్నా మరిచిపోవాల్సిందే!

Forest Canopies | రోజువారీ ఉరుకులు పరుగుల జీవితానికి చిన్న విరామం ఇచ్చి బయటకొచ్చి ప్రకృతితో మమేకమైతే ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇట్టే మరిచిపోతాం. కేవలం మన ఇంటి దగ్గర ఉండే పార్కుల్లోనే గంటసేపు గడిపితే టెన్షన్లు అన్నీ ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది.

S

Tourism | Published On Dec 27, 2025, 9.30 am IST

Forest Canopies | ఆకాశానికి పందిళ్లు ఈ అడవులు.. వీటిలో పర్యటిస్తే ఎన్ని బాధలు ఉన్నా మరిచిపోవాల్సిందే!
Advertisement

Forest Canopies | రోజువారీ ఉరుకులు పరుగుల జీవితానికి చిన్న విరామం ఇచ్చి బయటకొచ్చి ప్రకృతితో మమేకమైతే ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇట్టే మరిచిపోతాం. కేవలం మన ఇంటి దగ్గర ఉండే పార్కుల్లోనే గంటసేపు గడిపితే టెన్షన్లు అన్నీ ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే కొమ్మలు, ఆకులు ఒకదానికొకటి అల్లుకుని ఆకాశం కనిపించకుండా పందిళ్లు వేసినట్లు ఉండే అడవుల్లో నడిస్తే ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోండి. అలాంటి అద్భుతమైన అనుభూతిని కల్పించేందుకు మన భారత్‌లో మూడు అద్భుతమైన అడవులు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ (కేరళ)

కేరళలోని నీలగిరి జీవావరణ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం కేరళలో మిగిలిన చివరి వర్షారణ్యాల్లో ఒకటి. ఇది దేశంలోనే అత్యంత సాంద్రమైన ఉష్ణమండల అడవిగా పేరుగాంచింది. ఇక్కడి చెట్లు ఆకాశాన్ని తాకినట్లుగా ఉండి, భూమికి ఒక కవచంలా కనిపిస్తుంది. ఈ దట్టమైన అడవి అరుదైన ఆర్కిడ్లు (అరుదైన పూల జాతి మొక్క), లయన్ టెయిల్డ్ మకాక్‌లు, అలాగే అనేక పక్షి జాతులకు ఆవాసంగా ఉంది. భారీ చెట్లతో ఆకాశానికి పందిరి వేసినట్లుగా ఉండే ఈ అటవీ ప్రాంతంలో వాతావరణం ఎప్పుడూ మబ్బులతో కమ్ముకున్నట్లుగా ఉంటుంది. కీటకాలు, పక్షుల శబ్దాలతో మార్మోగుతుంది. ఈ అడవిని 1984లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. 1985 నుంచి పర్యాటకులను సందర్శనకు అనుమతిస్తున్నారు. గైడ్‌తో చేసే నేచర్ వాక్ ఇక్కడ అద్భుతమైన అనుభూతిని కలగిస్తుంది.

బుక్సా టైగర్ రిజర్వ్ ( పశ్చిమ బెంగాల్)

భూటాన్ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ బెంగాల్‌లో ఉండే బుక్సా టైగర్ రిజర్వ్.. ఎత్తు, వర్షపాతం, జీవ వైవిద్యం కలగలిసిన అరణ్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ అటవీ దిగువ ప్రాంతంలో సాల్ చెట్లు విస్తారంగా ఉంటాయి. వాటి మధ్యలో నుంచి సూర్యకాంతి దాటుకుంటూ వెళ్తుంది. అదే అటవీ ఎగువ ప్రాంతంలో మాత్రం దట్టమైన చెట్లు ఉండటంతో మొత్తం చీకటిగా అనిపిస్తుంది. ఈ అడవిలో ఏనుగులు, చిరుతలు, హర్న్‌బిల్లులు, అనేక రకాల సీతాకోక చిలుకలు మనకు కనిపిస్తాయి. ఈ అడవిలో పర్యాటకులు ట్రెక్కింగ్‌కు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ అడవి పై భాగంలో వంపులు తిరిగే చెట్ల కొమ్మలతో సహజమైన పచ్చటి సొరంగాల్లో కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ట్రెక్కింగ్ చేసినప్పుడు సూపర్ థ్రిల్‌ని ఇస్తాయి.

దండేలీ - అన్షీ టైగర్ రిజర్వ్ (కర్ణాటక)

పశ్చిమ కనుమల్లో భాగమైన దండేలీ - అన్షీ టైగర్ రిజర్వ్ విస్తారమైన అరణ్య కవచంగా పేరొందింది. దీనిని కాళీ టైగర్ రిజర్వ్ అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ఎక్కువగా ఆకులు రాలే చెట్లు ఉంటాయి. కాబట్టి ఎండాకాలం నుంచి వర్షాకాలం మధ్యలో ఆకురాలి.. మళ్లీ కొత్తగా చిగురు రావడంతో ఆకుపచ్చ వర్ణంలో మెరిసిపోతుంటాయి. ఆ సమయంలో ఇక్కడకు వెళ్లినప్పుడు అద్భుతమైన ఫీల్ ఉంటుంది. హార్న్‌బిల్లులు, భారీ కుందేళ్లు, అరుదైన బ్లాక్ పాంథర్ వంటి జంతువులు ఈ అడవుల్లో ఉన్నాయి. ట్రెక్కింగ్, ప్రకృతి పర్యటనలను ఇష్టపడేవారికి దక్షిణ భారతదేశంలోనే ఉన్న ఆ అడవులు మంచి అనుభూతిని కలిగిస్తాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement