త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengaluru to Goa Vande Bharat Express | బెంగళూరు నుంచి గోవాకు సరికొత్త ‘వందే భారత్’.. రూట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

పశ్చిమ కనుమలు, కర్ణాటక తీర ప్రాంతాల అందాలను చూస్తూ గోవా వెళ్లేందుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిద్ధమైంది. రేపే ప్రధాని మోదీ జెండా ఊపనున్నారు.

J

Tourism | Published On Nov 12, 2026, 7.28 pm IST

Bengaluru to Goa Vande Bharat Express | బెంగళూరు నుంచి గోవాకు సరికొత్త ‘వందే భారత్’.. రూట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

సంక్షిప్త సారాంశం

బెంగళూరు (యశ్వంత్‌పూర్) - మంగళూరు - మడ్గావ్ (గోవా) మధ్య నడిచే కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ నవంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నారు. నవంబర్ 15 నుంచి ఈ రైలు సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఈ రైలు మార్గంలో సకలేశ్‌పూర్, మంగళూరు, ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ, కార్వార్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు నేరుగా చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి మడ్గావ్ చేరుకోవడానికి సుమారు 13 గంటల 20 నిమిషాలు, తిరుగు ప్రయాణంలో 12 గంటల 55 నిమిషాల సమయం పడుతుంది.

Advertisement
  • పర్యాటకులకు శుభవార్త
  • బెంగళూరు - గోవా మధ్య 'వందే భారత్'
  • రేపే ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Bengaluru to Goa Vande Bharat Express | త్రినేత్ర న్యూస్ : గోవా బీచ్‌లలో ఎంజాయ్ చేయాలన్నా, కర్ణాటక తీర ప్రాంతాల్లోని ఆలయాలు, ప్రకృతి అందాలను చుట్టిరావాలన్నా ఇకపై ప్రయాణం మరింత సులభం, ఆహ్లాదకరంగా మారనుంది. బెంగళూరులోని యశ్వంత్‌పూర్ నుంచి కోస్టల్ కర్ణాటక మీదుగా గోవాలోని మడ్గావ్ వరకు నడిచే సరికొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.

నవంబర్ 13న (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. అదే సమయంలో మంగళూరు జంక్షన్ వద్ద కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, స్థానిక ఎంపీలతో కలిసి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా, నవంబర్ 15 నుంచి ఈ రైలు రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

ఒకే రైలులో గోవాతో పాటు కర్ణాటక టూరిస్ట్ స్పాట్స్

ఈ వందే భారత్ కేవలం గోవా వెళ్లే వారికే కాకుండా, కర్ణాటక తీర ప్రాంత పర్యాటకులకు కూడా పెద్ద వరంగా మారనుంది. యశ్వంత్‌పూర్ - మడ్గావ్ మధ్య ఈ రైలుకు 12 ప్రధాన స్టేషన్లలో స్టాప్‌లు ఇచ్చారు.

స్టాప్‌ల జాబితా ఇదే: శ్రావణబెళగొళ, హాసన్, సకలేశ్‌పూర్, సుబ్రహ్మణ్య రోడ్, కబక పుత్తూరు, మంగళూరు జంక్షన్, ఉడిపి, కుందాపుర, మూకాంబికా రోడ్ బైందూర్, మురుడేశ్వర్, గోకర్ణ రోడ్, కార్వార్ మీదుగా మడ్గావ్ చేరుకుంటుంది. దీనివల్ల గోకర్ణ బీచ్‌లు, ఉడిపి ఆలయాలు, మురుడేశ్వర్, పశ్చిమ కనుమల అందాలను చూసేందుకు ప్లాన్ చేసుకునే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

ప్రయాణ సమయం, షెడ్యూల్ వివరాలు

ఈ రైలు వారానికి ఆరు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

బెంగళూరు టు గోవా: ఉదయం 7:35 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి, రాత్రి 8:55 గంటలకు మడ్గావ్ చేరుకుంటుంది (సుమారు 13 గంటల 20 నిమిషాల ప్రయాణం). ఈ సర్వీస్ బుధవారాల్లో ఉండదు.

గోవా టు బెంగళూరు: ఉదయం 8:20 గంటలకు మడ్గావ్‌లో బయలుదేరి, రాత్రి 9:15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది (సుమారు 12 గంటల 55 నిమిషాల ప్రయాణం). ఈ సర్వీస్ గురువారాల్లో ఉండదు.

కిటికీ పక్కన కూర్చుంటే కనువిందే

ఈ రైలు ప్రయాణంలో అతిపెద్ద ఆకర్షణ దీని రూట్. పశ్చిమ కనుమల (Western Ghats) గుండా, ముఖ్యంగా సకలేశ్‌పూర్ - సుబ్రహ్మణ్య ఘాట్ సెక్షన్ మీదుగా రైలు వెళ్తున్నప్పుడు కనిపించే పచ్చని లోయలు, జలపాతాలు, కర్ణాటక తీర ప్రాంత అందాలు ప్రయాణికులకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి.

Advertisement
Advertisement