త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPSC Civils | సివిల్స్ తుది ఇంట‌ర్వ్యూకు 31 మంది ఎంపిక‌.. ఒక్కొక్క‌రికి రూ. ల‌క్ష ఆర్థిక ప్రోత్సాహం

UPSC Civils | తెలంగాణ ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ సహకారంతో ప్రారంభించిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం మరోసారి మంచి ఫలితాలను సాధించింది. ఇటీవల విడుదలైన సివిల్స్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులై 31 మంది అభ్యర్థులు తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.

S

Telangana | Published On Nov 12, 2026, 7.11 pm IST

UPSC Civils | సివిల్స్ తుది ఇంట‌ర్వ్యూకు 31 మంది ఎంపిక‌.. ఒక్కొక్క‌రికి రూ. ల‌క్ష ఆర్థిక ప్రోత్సాహం
Advertisement

అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు

UPSC Civils | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ సహకారంతో ప్రారంభించిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం మరోసారి మంచి ఫలితాలను సాధించింది. ఇటీవల విడుదలైన సివిల్స్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులై 31 మంది అభ్యర్థులు తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.

మెయిన్స్‌కు ఎంపికైన 158 మందికి రూ. లక్ష చొప్పున ప్రోత్సాహకం

సింగరేణి సంస్థ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహకం అందించేందుకు రెండు నెలల క్రితం దరఖాస్తులను ఆహ్వానించింది. వచ్చిన దరఖాస్తుల్లో 158 మంది అర్హులైన అభ్యర్థులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.58 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించింది. ఈసారి ప్రోత్సాహక మొత్తాలను నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేశారు. ఈ ఆర్థిక సహకారంతో అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు మరింత ఉత్సాహంతో సిద్ధమయ్యారు. వారిలో 31 మంది తుది ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం.

ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి మరో రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకం

తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మంది అభ్యర్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ త్వరలో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అదనపు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించనుంది.

అభ్యర్థులకు భ‌ట్టి అభినందనలు

సివిల్స్ మెయిన్స్‌లో ఉత్తీర్ణులై తుది ఇంటర్వ్యూకు ఎంపికైన తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ఇంటర్వ్యూ దశకు చేరుకున్న అభ్యర్థులందరూ తుది పరీక్షలోనూ విజయం సాధించి తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

వరంగల్ నుంచి అత్యధికంగా ఆరుగురు

ఈ ఏడాది తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మందిలో అత్యధికంగా వరంగల్ జిల్లా నుంచి ఆరుగురు ఉన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, హైదరాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ముగ్గురేసి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున ఎంపికయ్యారు. ఆదిలాబాద్, నారాయణపేట, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున తుది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో 18 మంది ఓబీసీ వర్గాలకు చెందిన వారున్నారు. ఎస్టీ అభ్యర్థులు ఇద్దరు, ఎస్సీ అభ్యర్థులు ముగ్గురు, 8 మంది జనరల్ అభ్యర్థులు ఉన్నారు.

Advertisement
Advertisement