త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonia Gandhi | మోదీతో పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు.. ప్రధాని పదవి తిర‌స్క‌ర‌ణ వెనుక కార‌ణం ఇదే.. ఆత్మ‌క‌థ‌లో సోనియా గాంధీ ఆసక్తికర విష‌యాలు

Sonia Gandhi | సోనియా గాంధీ (Sonia Gandhi) ఆత్మ‌క‌థ‌ ‘బిలాంగిగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ నేడు పాఠ‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను సోనియా పొందుప‌రిచారు. ప్ర‌ధాని మోదీ (PM Modi)తో త‌న‌కున్న సంబంధాలు, 2004లో ప్ర‌ధాని ప‌ద‌వి తిర‌స్క‌ర‌ణ‌కు కార‌ణం వంటి విష‌యాలు ఇందులో వివ‌రించారు.

D

National | Published On Nov 10, 2026, 11.37 am IST

Sonia Gandhi | మోదీతో పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు.. ప్రధాని పదవి తిర‌స్క‌ర‌ణ వెనుక కార‌ణం ఇదే.. ఆత్మ‌క‌థ‌లో సోనియా గాంధీ ఆసక్తికర విష‌యాలు
Advertisement

Sonia Gandhi | త్రినేత్ర న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో తనకు వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ (Sonia Gandhi) తెలిపారు. అధికారిక సమావేశాల్లో ఎదురుపడినప్పటికీ కేవ‌లం న‌మ‌స్కారంతో ప‌ల‌క‌రింపులు త‌ప్ప ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి సంభాష‌ణా ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. గతంలో ఇతర పార్టీల నేతల మధ్య ఉండే ఆప్యాయత, గౌరవప్రదమైన వాతావరణం మోదీ విషయంలో కనిపించదని వ్యాఖ్యానించారు. ఆయ‌న త‌న‌తో కంటిచూపు క‌ల‌ప‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ర‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

సోనియా గాంధీ (Sonia Gandhi) ఆత్మ‌క‌థ‌ ‘బిలాంగిగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ నేడు పాఠ‌కుల ముందుకు వ‌చ్చింది. ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ పుస్త‌కం మార్కెట్‌లోకి అందుబాటులోకి వ‌చ్చింది. యుద్ధానంతర ఇటలీలో బాల్యం, భారతదేశంలో త‌న‌ జీవితం, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ప్రేమ-వివాహం, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యల తాలూకు విషాదాలు, రాజ‌కీయ ప్ర‌వేశం వంటి ఎన్నో వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ ప్ర‌యాణాల‌ను సోనియా ఈ ఆత్మ‌క‌థ‌లో పొందుప‌రిచారు. అంతేకాదు, 2004లో తాను ప్రధానమంత్రి పదవిని ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందనే విషయాలను కూడా సోనియా ఈ బుక్‌లో వివ‌రించారు.

ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గురించి కూడా త‌న ఆత్మ‌క‌థ‌లో సోనియా ప్ర‌స్తావించారు. మోదీతో తన సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పార్లమెంటరీ సమావేశాల ముగింపు సమయంలో స్పీకర్ ఛాంబర్‌లో ప్రధాన పార్టీల నేతలు కలుసుకున్నప్పుడు మాత్రమే మేము కలుసుకుంటాం. అది చాలా చిన్న గది. చాలా మంది ఉంటారు. ప్ర‌ధాని మోదీ ఎదురుపడినప్పుడు ఒకరికొకరం అధికారికంగా నమస్కారం చేసుకుంటాం. అంతే త‌ప్ప‌ మా మ‌ధ్య ఎలాంటి సంభాష‌ణ‌లూ ఉండ‌వు. గతంలో రాజకీయ విభేదాలకు అతీతంగా నేతల మధ్య ఉండే ఆత్మీయత ప్ర‌ధాని విష‌యంలో కనిపించదు. న‌మ‌స్కారం చేసే స‌మ‌యంలో కూడా కంటి చూపు క‌ల‌ప‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు" అని సోనియా రాసుకొచ్చారు.

మోదీతో నా పోరాటం వ్యక్తిగతం కాదు.. అది కేవలం భావజాలాల ఘర్షణే..

తామిద్దరం పూర్తిగా భిన్నమైన సైద్ధాంతిక నేపథ్యాల (Ideological worlds)నుంచి వచ్చామని సోనియా తెలిపారు. భారతదేశం గురించి మోదీకి ఉన్న‌ భావన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల ఆలోచనల నుంచి రూపుదిద్దుకుందని, అది ఆయన విశ్వాసంలో మౌలవాద భావాలను ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక త‌న విష‌యానికొస్తే దేశం గురించి తాను తెలుసుకున్న‌దంతా త‌న కుటుంబ స‌భ్యుల నుంచేన‌ని సోనియా చెప్పుకొచ్చారు. స్వేచ్ఛా సమానత్వ సూత్రాలపై ఆధారపడి, అన్ని రకాల జాతులు, సంస్కృతులు, భాషలు, మతాలను కలుపుకొనిపోయే భారతదేశంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆమె వివరించారు. ప్ర‌ధాని మోదీతో తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని, ఇద్దరి మధ్య జరుగుతున్నది కేవలం భావజాలాల పోరాటమేనని సోనియా స్పష్టం చేశారు.

ప్రధాని పదవి తిర‌స్క‌ర‌ణ వెనుక కార‌ణం ఇదే..

2004లో ప్ర‌ధాని ప‌ద‌విని తిర‌స్క‌రించ‌డానికి గ‌ల కార‌ణాన్ని సోనియా తొలిసారి త‌న ఆత్మ‌క‌థ ద్వారా వెల్ల‌డించారు. ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందే ప్ర‌ధాని ప‌ద‌వి గురించి రాహుల్‌, ప్రియాంక‌తో చ‌ర్చించిన‌ట్లు పేర్కొన్నారు. అప్పుడు ఎన్నిక‌ల్లో పార్టీ గెలిస్తే ప్ర‌ధాని ప‌ద‌విని స్వీక‌రిస్తారా..? అని వారు అడిగార‌ట‌. అయితే, తాను వెంట‌నే లేదు అని క‌చ్చితంగా చెప్పిన‌ట్లు సోనియా చెప్పుకొచ్చారు. వారు కూడా తాను ప్ర‌ధాని కాకూడ‌ద‌నే కోరుకున్న‌ట్లు వివ‌రించారు. మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హ‌త్య‌ల త‌ద‌నంత‌రం త‌న పిల్ల‌లు ఎదుర్కొన్న భ‌యాన‌క ప‌రిస్థితులే తాను ప్ర‌ధాని కాకూడ‌ద‌ని వారు భావించిన‌ట్లు తెలిపారు. ఆ ప‌ద‌విలో ఉండ‌టం ప్రాణాపాయంతో కూడుకున్న‌దిగా వారు భావించిన‌ట్లు చెప్పారు. ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్టే విష‌యంలో త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్ప‌డంతో రాహుల్‌, ప్రియాంక‌ ఊపిరి పీల్చుకున్న‌ట్లు చెప్పారు. అప్పుడే తానూ మాన‌సికంగా తేలిక‌ప‌డ్డాన‌ని త‌న ఆత్మ‌క‌థ‌లో రాసుకొచ్చారు.

పదవులు నా లక్ష్యం కాదు

కాంగ్రెస్ పార్టీ అప్పట్లో మనుగడ కోసం పోరాడుతున్న తరుణంలో నాయకత్వ పోరు రాకూడదనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచార సమయంలో ఈ విషయాన్ని బయటపెట్టలేదని సోనియా స్పష్టం చేశారు. పార్టీని ఐక్యంగా ఉంచి ప్రత్యర్థులను గట్టిగా ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీ గెలిచిన త‌ర్వాత జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) సమావేశంలో తాను ప్ర‌ధాని ప‌ద‌విని విన‌మ్రంగా తిర‌స్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాన‌ని గుర్తు చేశారు. "అధికారం నన్ను ఎప్పుడూ ఆకర్షించలేదు, పదవులు నా లక్ష్యం కాదు" అని సోనియా గాంధీ త‌న ఆత్మ‌క‌థ‌లో స్పష్టం చేశారు. దేశ లౌకిక పునాదిని, పేదలను రక్షించడమే ఇందిరా, రాజీవ్ గాంధీల ఆశయమని.. ఆ ఆశయ సాధన కోసమే తాను పనిచేశానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తికి మంచి పాలనానుభవం, మచ్చలేని నిజాయితీ ఉండాలని తాను గట్టిగా నమ్మినట్లు సోనియా గాంధీ తన పుస్తకంలో పేర్కొన్నారు. అందుకే ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మ‌న్మోహ‌న్ సింగ్ పేరును ప్ర‌తిపాదించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఆ ఆరోప‌ణ‌ల్లో నిజం లేదు..

యూపీఏ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో త‌న ప్ర‌మేయంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను కూడా సోనియా కొట్టిపారేశారు. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వంలో త‌న జోక్యం ఏమాత్రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. సింగ్ ప్రభుత్వాన్ని నడిపించగా, తాను కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించానని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకున్నానని, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రభుత్వ ఫైళ్లను తెప్పించుకున్నానని వ‌చ్చిన ఆరోప‌ణ‌ను ఖండించారు. ప్ర‌భుత్వ ఏర్పాటు స‌మ‌యంలో తాను కొన్ని సూచ‌న‌లు చేసిన‌ట్లు అంగీక‌రించారు.

<strong/>Sonia Gandhi Joins Instagram: సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఫాలో అవ్వాలనే క్రేజ్ అందరికి ఉంటుంది. సినిమా, స్పోర్ట్స్, బిజినెస్ రంగాలకు చెందిన వాళ్లే కాదు పాలిటిక్స్‌కి చెందిన వాళ్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పటికే రాజకీయాలకు చెందిన చాలా మంది లీడర్స్ సోషల్ మీడియాలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్‌ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో చేరాలని కాంగ్రెస్ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యారు.(Photo:Instagram)

 

Also Read..

బంగారం ర్యాలీకి బ్రేక్‌.. ఒక మోస్త‌రుగా తగ్గిన ప‌సిడి ధ‌ర‌లు.. పెట్టుబ‌డుల‌కు స‌రైన స‌మ‌య‌మా..?

దేశంలో ఏకైక తేలియాడే పోస్టాఫీస్.. ఇక‌పై ఉద‌యం 9 నుంచి రాత్రి 9 వ‌ర‌కు సేవ‌లు

జీఎల్‌పీ-1 మందుల‌తో కంటి చూపు కోల్పోయే ప్ర‌మాదం.. అమెరికా ఎఫ్డీఏ హెచ్చ‌రిక‌..

Advertisement
Advertisement