త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harsil Valley | ఉత్తరాఖండ్‌లో దాగి ఉన్న ఈ లోయ నిజమైన స్వర్గం.. ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఆహ్వానం..

Harsil Valley | ఉత్తరాఖండ్‌లో విహారయాత్ర గురించి ఆలోచిస్తే చాలా మందికి ముందుగా ముస్సోరీ, నైనిటాల్ లేదా రిషికేష్ గుర్తుకు వస్తాయి. అయితే గఢ్వాల్ హిమాలయాల ఎత్తైన ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీకి దూరంగా ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది.

S

Tourism | Published On Jun 20, 2026, 12.28 pm IST

Harsil Valley | ఉత్తరాఖండ్‌లో దాగి ఉన్న ఈ లోయ నిజమైన స్వర్గం.. ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఆహ్వానం..
Advertisement

Harsil Valley | ఉత్తరాఖండ్‌లో విహారయాత్ర గురించి ఆలోచిస్తే చాలా మందికి ముందుగా ముస్సోరీ, నైనిటాల్ లేదా రిషికేష్ గుర్తుకు వస్తాయి. అయితే గఢ్వాల్ హిమాలయాల ఎత్తైన ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీకి దూరంగా ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే హ‌ర్సిల్ వ్యాలీ. భారీ దేవదారు అడవులు, స్వచ్ఛమైన నదులు, విస్తారమైన యాపిల్ తోటలు, మంచుతో కప్పుకున్న పర్వతాలతో ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలా కనిపిస్తుంది. సముద్ర మట్టానికి సుమారు 2,620 మీటర్ల ఎత్తులో, భ‌గీర‌థి న‌ది ఒడ్డున ఉన్న ఈ లోయను చాలామంది ఇండియాకు మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ప్రశాంతత, సహజ సౌందర్యం, జనసంచారం తక్కువగా ఉండే హిమాలయ ప్రాంతాన్ని కోరుకునేవారికి ఇది అద్భుతమైన గమ్యస్థానంగా నిలుస్తోంది.

ట్రాఫిక్‌, ర‌ద్దీ ఉండ‌వు..

హర్సిల్‌కు వెళ్లిన వెంటనే ఆకట్టుకునేది అక్కడి నిశ్శబ్ద వాతావరణం. ఇతర ప్రముఖ హిల్ స్టేషన్లలో కనిపించే ట్రాఫిక్, రద్దీ మార్కెట్లు ఇక్కడ కనిపించవు. జీవనం చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా సాగుతుంది. లోయ అంతటా సంప్రదాయ హిమాలయ గ్రామాలు, చెక్కతో నిర్మించిన పాత ఇళ్లు, సుందరమైన నడక మార్గాలు, యాపిల్ తోటలు కనిపిస్తాయి. శరదృతువులో ఈ తోటలు ఎర్రని పండ్లతో కళకళలాడితే, వసంతం, వేసవిలో పచ్చదనం మొత్తం లోయను కప్పేస్తుంది. బాలీవుడ్ అభిమానులకు ఈ ప్రాంతం ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు రాజ్ క‌పూర్ తెరకెక్కించిన రామ్ తేరీ గంగా మైలీ చిత్రంలోని అనేక సన్నివేశాల‌ను ఇక్కడే చిత్రీకరించారు. ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని లొకేషన్లు ఇప్పటికీ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతానికి ఏ కాలంలో వెళ్లాలనేది వ్య‌క్తిగ‌తంగా కోరుకునే అనుభవంపై ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. గ్రామాల సందర్శన, ప్రకృతి వీక్షణ, అవుట్‌డోర్ కార్యకలాపాలకు ఈ సమయం సరైంది. మైదాన ప్రాంతాల్లో ఎండలు మండుతున్న సమయంలో హర్సిల్ చల్లని ఆశ్రయంగా మారుతుంది.

అనువైన స‌మ‌యం ఏది, ఎలా చేరుకోవాలి..?

సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు కూడా అద్భుతమైన సమయం. వర్షాకాలం ముగిసిన తర్వాత ఆకాశం నిర్మలంగా మారుతుంది. యాపిల్ తోటలు మరింత అందంగా కనిపిస్తాయి. శీతాకాలంలో హర్సిల్ మొత్తం మంచుతో కప్పబడిన అద్భుతమైన దృశ్యంగా మారుతుంది. అయితే ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే దిగువకు పడిపోతాయి. భారీ మంచు కారణంగా ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కొండచరియలు విరిగిపడటం, రహదారులు మూసుకుపోవడం వంటి ప్రమాదాలు ఉండటంతో ఈ కాలంలో ప్రయాణం చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. విమాన మార్గంలో వెళ్లాలనుకునే వారు జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. అక్కడి నుంచి హర్సిల్ సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు ప్రయాణికులకు సమీప ప్రధాన రైల్వే స్టేషన్ రిషికేష్‌. దేశంలోని అనేక ప్రధాన నగరాలతో దీనికి రైలు అనుసంధానం ఉంది. రోడ్డు మార్గంలో హర్సిల్, జాతీయ రహదారి 108పై వ‌స్తుంది. ఉత్త‌ర‌కాశీ నుంచి సుమారు 75 కిలోమీటర్లు, గంగోత్రికి 25 కిలోమీటర్ల ముందు ఈ ప్రాంతం వస్తుంది. డెహ్రాడూన్, రిషికేష్, ఉత్తర్‌కాశీ నుంచి బస్సులు, షేర్డ్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. లోతైన నదీ లోయలు, ఎత్తైన పర్వతాలు, చిన్న హిమాలయ గ్రామాల మధ్య‌గా సాగే ఈ ప్రయాణం కూడా ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.

యాపిల్ తోట‌ల‌కు ప్ర‌సిద్ధి..

హ‌ర్సిల్ గ్రామం లోయకు కేంద్రంగా ఉంటుంది. ప్రశాంతమైన వీధుల్లో నడవడం, సంప్రదాయ చెక్క నిర్మాణాలను వీక్షించడం, భగీరథి నది ఒడ్డున కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ముఖ్బా గ్రామం స్థానిక సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. శీతాకాలంలో గంగోత్రి మంచుతో కప్పబడినప్పుడు గంగాదేవి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. ధారాలి యాపిల్ తోటలకు ప్రసిద్ధి చెందింది. ప్రశాంత వాతావరణంలో నడకలకు ఇది అనువైన ప్రదేశంగా ఉంటుంది. హర్సిల్ సమీపంలోని స‌త్తాల్ ఏడు అనుసంధానమైన ఆల్పైన్ సరస్సుల సమాహారం. అడవుల మధ్యుగా ట్రెక్కింగ్ చేసి చేరుకోవాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫర్లు, ట్రెక్కింగ్ ప్రేమికులకు ఇది ఎంతో ఇష్టమైన ప్రదేశం. కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగోత్రి దేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాల్లో ఒకటి. ఆధ్యాత్మికతతోపాటు అద్భుతమైన పర్వత దృశ్యాలు కూడా ఇక్కడ ఆకర్షిస్తాయి.

అస‌లైన ఆనందం ఇవే..

హర్సిల్ సందర్శన అంటే కేవలం పర్యాటక ప్రదేశాల జాబితాను పూర్తి చేయడం కాదు. యాపిల్ తోటల్లో నడవడం, నది ఒడ్డున భోజనం చేయడం, మంచు శిఖరాల ఫొటోలు తీయడం, స్థానికులతో మాట్లాడడం, భగీరథి నది ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ వేడి టీ తాగడం వంటి అనుభవాలే ఇక్కడి అసలు ఆనందం. ఆహార ప్రియులు సంప్రదాయ గఢ్వాలి వంటకాలను తప్పక రుచి చూడాలి. మండువా కీ రోటీ, కాఫులీ, చైన్సూ, ఝంగోరా కీ ఖీర్, స్థానిక రాజ్మా వంటి వంటకాలు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందాయి. అనేక హోమ్‌స్టేలు ఈ ప్రాంతీయ వంటకాలను అతిథులకు అందిస్తాయి. హిమాలయ ప్రాంతంలోని అనేక పర్యాటక కేంద్రాలు ప్రస్తుతం అధిక పర్యాటకుల రద్దీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే హర్సిల్ మాత్రం ఇప్పటికీ తన సహజ అందాన్ని, ప్రశాంతతను కాపాడుకుంటూ ఉత్తరాఖండ్‌లోని అత్యంత అందమైన రహస్య గమ్యస్థానంగా నిలిచింది.

Advertisement
Advertisement