త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Matheran | ఆసియాలోనే ఏకైక వాహ‌న ర‌హిత హిల్ స్టేషన్ ఏదో తెలుసా..? ఆ 21 కి.మీ టాయ్ ట్రైన్ ప్ర‌యాణం అద్భుతం

Matheran | మ‌హారాష్ట్ర‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ప‌శ్చిమ క‌నుమ‌ల మ‌ధ్య ఉన్న ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం మాథేరాన్ (Matheran). సముద్ర మ‌ట్టానికి సుమారు 800 మీట‌ర్ల (2,625 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం.. ఆసియాలోనే ఏకైక వాహ‌న ర‌హిత హిల్ స్టేషన్. నేరల్-మాథేరాన్ టాయ్ ట్రైన్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. అడ‌వులు, పొగ‌మంచుతో కూడిన కొండ‌ల మ‌ధ్య చిన్న చిన్న జలపాతాల గుండా దాదాపు 21 కిలోమీట‌ర్ల మేర‌ సాగే ఈ ప్ర‌యాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

D

Tourism | Published On Oct 20, 2026, 11.00 am IST

Matheran | ఆసియాలోనే ఏకైక వాహ‌న ర‌హిత హిల్ స్టేషన్ ఏదో తెలుసా..? ఆ 21 కి.మీ టాయ్ ట్రైన్ ప్ర‌యాణం అద్భుతం
Advertisement

Matheran | త్రినేత్ర న్యూస్ : భారతదేశం అద్భుతమైన ప్రకృతి ప్రదేశాలకు, జీవవైవిధ్యానికి నిలయం. ఇక్క‌డి ప్ర‌జ‌లు స‌మ‌యం దొరిక‌న‌ప్పుడ‌ల్లా అలా ప్ర‌కృతి ఒడిలో వాలిపోతుంటారు. అంద‌మైన ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు పోటెత్తుతుంటారు. చెట్లు, స్వ‌చ్ఛ‌మైన గాలి, ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించేందుకు ముఖ్యంగా హిల్ స్టేష‌న్ల‌కు వెళ్లేందుకే ఆసక్తి చూపుతుంటారు. అలాంటి ప్రాంతాల్లో మ‌హారాష్ట్ర (Maharashtra)లోని ప‌చ్చ‌ని కొండ‌ల న‌డుమ‌ ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ఉన్న మాథేరాన్ (Matheran) ఒక‌టి.

ప‌శ్చిమ క‌నుమ‌ల మ‌ధ్య అద్భుత ప్ర‌యాణం

మాథేరాన్ (Matheran) రాయ్‌గఢ్ (Raigad) జిల్లాలో ప‌శ్చిమ క‌నుమ‌ల (Western Ghats) మ‌ధ్య ఉన్న ఒక అద్భుత‌మైన, ప్ర‌శాంత‌మైన హిల్ స్టేష‌న్‌. ముంబైకి దాదాపు రెండు గంటల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. సముద్ర మ‌ట్టానికి సుమారు 800 మీట‌ర్ల (2,625 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం.. ఆసియాలోనే ఏకైక వాహ‌న ర‌హిత హిల్ స్టేషన్. ఇక్క‌డ ఎలాంటి కాలుష్యం ఉండ‌దు. వాతావ‌ర‌ణం ఎంతో ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. ముంబై, పుణే వంటి ర‌ద్దీ నగరాల నుంచి దూరంగా వీకెండ్‌ను ప్ర‌శాంతంగా గ‌డ‌పాల‌ని కోరుకునే ప‌ర్యాట‌కుల‌కు ఈ ప్రాంతం స్వ‌ర్గ‌ధామం అనే చెప్పొచ్చు. ఇక్కడి దట్టమైన అడవులు, చిన్న చిన్న జ‌ల‌పాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

జీవితంలో ఒక్క‌సారైనా చూడాల్సిన ప్ర‌దేశం

జీవితంలో ఒక్క‌సారైనా చూడాల్సిన ప్ర‌దేశం ఇది. ఇక్కడ కారు హారన్ల గోల ఉండదు.. సైలెన్సర్ల పొగ అంతకన్నా ఉండదు. చుట్టూ ఎటు చూసినా పచ్చని అడవి, ఎర్రటి మట్టి దారులే ద‌ర్శ‌న‌మిస్తాయి. ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకునే అందమైన ప్రదేశం. ఇది పూర్తిగా వెహిక‌ల్ ఫ్రీ ప్ర‌దేశం. పర్యాటకులు తమ సొంత కార్లు లేదా ట్యాక్సీల్లో 'దస్తూరి నాకా' వరకు మాత్రమే వెళ్లగలరు. దస్తూరి నాకా వద్ద వాహనాలు పార్క్ చేశాక.. ఊళ్లోకి వెళ్లడానికి కాళ్లకు పని చెప్పాల్సిందే. ఒక‌వేళ న‌డ‌వ‌లేని వారికి గుర్రాలు, చేత్తో లాగే రిక్షాలు అందుబాటులో ఉంటాయి.

మిట్ట మ‌ధ్యాహ్న‌మే చీక‌ట్లు..

ఈ హిల్ స్టేషన్‌కు మ‌రో ప్ర‌త్యేక‌త ఉంది. ఇక్కడ మిట్ట మధ్యాహ్నమే చీకటి ప‌డుతుంది. దాని వెనుక ప్ర‌కృతి ర‌హ‌స్యం దాగి ఉంది. మాథేరాన్ ద‌ట్ట‌మైన చెట్ల‌తో అడ‌వుల మ‌ధ్య ఉంటుంది. ఎక్క‌డ చూసినా పెద్ద భారీ వృక్షాలే క‌నిపిస్తాయి. చెట్ల కొమ్మ‌లు, ఆకులు ఒక పైక‌ప్పులాగా అల్లుకుపోతాయి. దీని వ‌ల్ల ఎండ త‌గ‌ల‌దు. ప‌ట్ట‌ప‌గ‌లే మొత్తం దారుల‌న్నీ చీక‌టిగా ఉంటాయి.

వ్యూపాయింట్స్‌..

ఇక్కడ దాదాపు 38కి పైగా వ్యూపాయింట్లు ఉంటాయి. పాసొనా పాయింట్, లూయిసా పాయింట్, ఎకో పాయింట్ వంటి ప్రదేశాల నుండి కనిపించే లోయల అందాలు వర్ణనాతీతం. దట్టమైన పొగమంచు, కొండల నడుమ సాగే నేచర్ వాక్స్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

 

21 కి.మీ ట్రైన్ జ‌ర్నీ ఓ అద్భుతం

1907 లో నిర్మించిన నేరల్-మాథేరాన్ (Neral to Matheran) టాయ్ ట్రైన్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. దాదాపు రెండుగంట‌ల‌కుపైగా స‌మ‌యం ప‌ట్టే 21 కిలోమీర‌ట్ల టాయ్ ట్రైన్ ప్ర‌యాణం మీ టూర్‌ను మ‌రింత ప్ర‌త్య‌కంగా మారుస్తుంది. అడ‌వులు, పొగ‌మంచుతో కూడిన కొండ‌ల మ‌ధ్య చిన్న చిన్న జలపాతాల గుండా సాగే ఈ ప్ర‌యాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇది మహారాష్ట్రలోనే అత్యంత ప్రత్యేకమైన రైలు ప్రయాణం. ఇక్కడికి వచ్చేవారు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికే ఈ రైలు ఎక్కుతారు. కొద్ది దూరానికే స‌మ‌యం ఎక్కువ ప‌ట్టినా.. రోడ్డు మార్గం కంటే రైలు మార్గం ద్వారా మాథేరాన్‌ చేరుకునేందుకే ప‌ర్యాట‌కులు అధిక‌ ప్రాధాన్య‌త ఇస్తుంటారు. ఈ హెరిటేజ్ టాయ్‌ జ‌ర్నీ పర్యాటకుల మ‌ధుర జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది. అందుకే ఏటా లక్షలాది మంది పర్యాటకులు మాథేరాన్‌ను సందర్శిస్తుంటారు.

 

వ‌ర్షాకాలంలో ట్రైన్ జ‌ర్నీ నిలిపివేత‌

ఏటా వ‌ర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం (Landslides) ఉన్నందున భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా ఇండియ‌న్ రైల్వేస్ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ మార్గంలో రైలు సేవ‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. ఆ స‌మ‌యంలో రైల్వే ఇంజ‌నీర్ల బృందం ట్రాక్‌ల‌ను త‌నిఖీ చేసి అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తులు చేప‌డుతుంది. ఆ త‌ర్వాత న‌వంబ‌ర్ నుంచి రైళ్ల రాక‌పోక‌ల‌కు అనుమ‌తిస్తారు.

టికెట్ ధ‌ర‌లు..

ఇక మాథేరాన్ టాయ్ ట్రైన్ టికెట్ ధ‌ర‌ల విష‌యానికొస్తే.. ఫ‌స్ట్ క్లాస్ కోచ్ జ‌ర్నీకి పెద్ద‌ల‌కు రూ.300, పిల్ల‌ల‌కు రూ.180 ఛార్జ్ చేస్తారు. అదే సెకండ్ క్లాస్ అయితే పెద్ద‌ల‌కు రూ.75, పిల్ల‌ల‌కు రూ.45 వ‌ర‌కూ టికెట్ ఉంటుంది. ఇంకెందుకు ఆల‌స్యం ఈ న‌వంబ‌ర్‌లో మీ ఫ్రెండ్స్‌తో క‌లిసి మాథేరాన్ ట్రిప్‌కు ప్లాన్ చేసుకుని.. అక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించండి మ‌రి.

Advertisement
Advertisement