త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Election Fraud Indians Charged | అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నా ఆ ఒక్క తప్పు చేస్తే 5 ఏళ్లు జైలుకే.. ఇద్దరు భారతీయులకు షాక్

అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఉండదు. నిబంధనలు ఉల్లంఘించి ఓటేసిన ఇద్దరు భారతీయులకు 5 ఏళ్ల జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది.

J

International | Published On Oct 20, 2026, 11.09 am IST

US Election Fraud Indians Charged | అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నా ఆ ఒక్క తప్పు చేస్తే 5 ఏళ్లు జైలుకే.. ఇద్దరు భారతీయులకు షాక్

సంక్షిప్త సారాంశం

కాలిఫోర్నియాలో నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేశారన్న కారణంతో ఇద్దరు భారతీయులు (అమన్‌దీప్ కౌర్, కమలేష్ షా) సహా మొత్తం 28 మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లపై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ (DOJ) కేసు నమోదు చేసింది. ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు చేపట్టిన ప్రత్యేక దాడుల్లో భాగంగా ఇప్పటికే 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ (LPR) ఉన్నవారికి అక్కడ నివసించే హక్కు మాత్రమే ఉంటుంది కానీ, సిటిజన్‌షిప్ వచ్చే వరకు ఓటు వేసే అధికారం ఉండదు. తప్పుడు సమాచారంతో ఓటరుగా నమోదు చేసుకోవడం ఫెడరల్ నేరం. నేరం రుజువైతే గరిష్టంగా 5 ఏళ్ల పాటు ఫెడరల్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Advertisement
  • గ్రీన్ కార్డ్ ఉన్నా ఆ హక్కు లేదు
  • ఎలక్షన్ ఫ్రాడ్ కేసులో ఇద్దరు ఇండియన్స్‌పై అభియోగాలు
  • ఆపరేషన్ ప్రొటెక్ట్ ది ఓట్
  • గ్రీన్ కార్డ్ నిబంధన
  • కఠిన శిక్షలు

US Election Fraud Indians Charged | త్రినేత్ర న్యూస్ : అమెరికాలో స్థిరపడిన విదేశీయులకు, ముఖ్యంగా గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అక్కడి ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. కాలిఫోర్నియాలో జరిగిన 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేశారన్న ఆరోపణలతో ఇద్దరు భారతీయులతో సహా మొత్తం 28 మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లపై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ (DOJ) సోమవారం క్రిమినల్ అభియోగాలు మోపింది.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ప్రొటెక్ట్ ది ఓట్’ (Operation Protect the Vote) లో భాగంగా అధికారులు కాలిఫోర్నియా వ్యాప్తంగా తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయగా, అరెస్టయిన వారిలో ఈ ఇద్దరు భారతీయులు ఉన్నారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

చిక్కుల్లో పడ్డ ఇద్దరు భారతీయులు వీరే

జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. కాలిఫోర్నియాకు చెందిన అమన్‌దీప్ కౌర్ (30), కమలేష్ షా (67) అనే ఇద్దరు భారతీయులు నవంబర్ 2024 ఎన్నికల్లో అక్రమంగా ఓటరు రిజిస్ట్రేషన్ చేసుకుని తమ బ్యాలెట్ హక్కును వినియోగించుకున్నారు.

కమలేష్ షా (67): శాక్రమెంటో (Sacramento) నివాసి అయిన కమలేష్ షా, నవంబర్ 2024 సాధారణ ఎన్నికల రోజే అక్రమంగా ఓటరుగా నమోదు చేసుకుని, అదే రోజు ఓటు వేశారు.

అమన్‌దీప్ కౌర్ (30): రాంచో పలోస్ వెర్డెస్ (Rancho Palos Verdes) లో నివసిస్తున్న అమన్‌దీప్ కౌర్ ప్రస్తుతం అమెరికా సిటిజన్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమె డిసెంబర్ 2022లోనే తప్పుడు పద్ధతిలో ఓటరుగా రిజిస్టర్ చేసుకుని, 2024 నవంబర్ ఎన్నికల్లో ఓటు వేసినట్లు అధికారులు గుర్తించారు.

గ్రీన్ కార్డ్ ఉంటే ఓటు వేయొచ్చా?

చాలామంది గ్రీన్ కార్డ్ ఉంటే అమెరికా పౌరులతో సమానంగా అన్ని హక్కులు ఉంటాయని భావిస్తారు. కానీ చట్టప్రకారం గ్రీన్ కార్డ్ హోల్డర్లను ‘లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్స్’ (LPRs) అని మాత్రమే పిలుస్తారు.

వీరికి అమెరికాలో చట్టబద్ధంగా నివసించేందుకు, ఉద్యోగం చేసేందుకు అనుమతి ఉంటుంది కానీ, పూర్తిస్థాయి అమెరికా సిటిజన్‌షిప్ (పౌరసత్వం) రానంత వరకు ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉండదు.

రుజువైతే 5 ఏళ్ల ఫెడరల్ జైలు శిక్ష

నిందితులపై ప్రధానంగా రెండు తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు.

సిటిజన్‌షిప్ దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం.

అర్హత లేకపోయినా అక్రమంగా ఓటరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం.

ఈ నేరాలు రుజువైతే ఫెడరల్ చట్టాల ప్రకారం గరిష్టంగా 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

20 వేల మందిపై నిఘా

"గత వారం కాలిఫోర్నియా ఎన్నికల అధికారులకు మేము అందించిన 20,000 మందికి పైగా అనుమానిత నాన్-సిటిజన్ ఓటర్ల జాబితాలోనే ఈ 28 మంది పేర్లు ఉన్నాయి" అని యాక్టింగ్ డిప్యూటీ అటార్నీ జనరల్ ట్రెంట్ మెక్‌కాటర్ లాస్ ఏంజిల్స్‌లో మీడియాకు తెలిపారు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 22.7 కోట్ల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. అయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 90 మందిపై జస్టిస్ డిపార్ట్‌మెంట్ కేసులు పెట్టింది. వీరిలో 50 మంది అమెరికా పౌరసత్వం లేకుండానే ఓటు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Advertisement
Advertisement