త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mohan Bhagwat | విభజనతో బలహీనపడ్డం.. ఐక్యతే మన బలం : మోహన్‌ భగవత్‌

Mohan Bhagwat | సమాజంలో విభేదాలు పెరిగినప్పుడు మనం బలహీనపడ్డామని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. భాష, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా భావోద్వేగ ఐక్యత, జాతీయ భావనకు ప్రాధాన్యమిచ్చినప్పుడే సమాజం బలంగా ఉంటుందని పేర్కొన్నారు.

P

National | Published On Oct 20, 2026, 10.42 am IST

Mohan Bhagwat | విభజనతో బలహీనపడ్డం.. ఐక్యతే మన బలం : మోహన్‌ భగవత్‌
Advertisement

Mohan Bhagwat | సమాజంలో విభేదాలు పెరిగినప్పుడు మనం బలహీనపడ్డామని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. భాష, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా భావోద్వేగ ఐక్యత, జాతీయ భావనకు ప్రాధాన్యమిచ్చినప్పుడే సమాజం బలంగా ఉంటుందని పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా నాగ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కేశవ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి, ఆయుధ పూజ నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై ఉందని భగవత్‌ అన్నారు. భౌతికవాదం, వ్యక్తిగత ప్రయోజనాలు, అపరిమిత వినియోగం ఆధారంగా సాగుతున్న జీవనశైలి అనేక సమస్యలకు కారణమవుతోందని పేర్కొన్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత, భిన్న నేపథ్యాల ప్రజల మధ్య సాన్నిహిత్యం, కుటుంబ వ్యవస్థలో విలువల పరిరక్షణ వంటి అంశాలకు భారత్‌ ఆలోచనలు మార్గనిర్దేశం చేయగలవని అభిప్రాయపడ్డారు.

సంత్‌ రవిదాస్‌ సేవలు చిరస్మరణీయం

సంత్‌ రవిదాస్‌ 650వ జయంతి సందర్భంగా ఆయన సేవలను భగవత్‌ గుర్తుచేశారు. విదేశీ దండయాత్రల సమయంలో స్వధర్మాన్ని అనుసరించే వారిపై అణచివేత, సమాజంలో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో సంత్‌ రవిదాస్‌ స్వధర్మ నిష్ఠ, సామాజిక సామరస్యం, భక్తి సందేశాలను వ్యాప్తి చేశారని తెలిపారు. తన జీవితం ద్వారా సమాజానికి ధైర్యం నింపి, ఆత్మవిశ్వాసాన్ని పెంచారని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రపంచం గమనిస్తోందని భగవత్‌ అన్నారు. భారత్‌లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, తప్పు ప్రవర్తనను సహించకూడదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు సహజమేనని, అయితే వాటి లక్ష్యం సమస్యలకు పరిష్కారాలు కనుగొనడమే కావాలని స్పష్టం చేశారు. చౌకబారు ప్రచారం కోసం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారతీయుల ఐక్యత సహజం

భారతీయులంతా ఒక్కటేనని, ఈ ఐక్యత ఎలాంటి ఒప్పందాలపై ఆధారపడినది కాదని భగవత్‌ అన్నారు. దేశం నుంచి ఏదైనా పొందితేనే భారత్‌కు చెందినవారమనే భావన సరికాదని పేర్కొన్నారు. దేశం మనకు ఏమిచ్చినా, ఇవ్వకపోయినా మనకున్నదంతా భారత్‌కు చెందినదేనని వ్యాఖ్యానించారు. హిందూ సమాజాన్ని ఐక్యంగా, బలంగా తీర్చిదిద్దడం అంటే ఇతర మతాలను వ్యతిరేకించడం కాదని స్పష్టం చేశారు. హిందూ ఆలోచనా విధానంలోనే సమ్మిళితత్వం ఉందని, పరస్పర గౌరవం, సద్భావన, నైతిక విలువలను బలోపేతం చేయడమే లక్ష్యమని ఆర్ఎస్ఎస్ చీఫ్ వివరించారు.

Advertisement
Advertisement