త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deepti Jeewanji | దీప్తి జీవాంజి ప‌సిడి మెరుపులు..! పారా ఏషియ‌న్ గేమ్స్‌లో అదరగొట్టిన తెలంగాణ బిడ్డ

Deepti Jeewanji | పేదరికం.. చిన్నచూపు.. ఎన్నో అవమానాలు.. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. తెలంగాణకు చెందిన పారా అథ్లెట్‌ దీప్తి జీవాంజి మరోసారి సత్తాచాటింది. జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్‌ పారా గేమ్స్‌లో మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.

P

International | Published On Oct 20, 2026, 11.11 am IST

Deepti Jeewanji | దీప్తి జీవాంజి ప‌సిడి మెరుపులు..! పారా ఏషియ‌న్ గేమ్స్‌లో అదరగొట్టిన తెలంగాణ బిడ్డ
Advertisement

Deepti Jeewanji | పేదరికం.. చిన్నచూపు.. ఎన్నో అవమానాలు.. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. తెలంగాణకు చెందిన పారా అథ్లెట్‌ దీప్తి జీవాంజి మరోసారి సత్తాచాటింది. జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్‌ పారా గేమ్స్‌లో మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. 56.36 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కొత్త గేమ్స్‌ రికార్డు సృష్టించింది. జపాన్‌ అథ్లెట్‌ నీనా కన్నో (58.92 సెకన్లు) రజతం, అకానే కటో (1:00.26 నిమిషాలు) కాంస్యం సాధించారు. భారత్‌కు ఈ పోటీల్లో ఇది ఐదో స్వర్ణం.

పేదరికం నుంచి పరుగుల ప్రపంచంలోకి..

తెలంగాణలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి సాధారణ కూలీ కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు మేధో వైకల్యం కారణంగా చిన్నతనంలో దీప్తి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ఆమె రూపం, ప్రవర్తనపై కొందరు ఎగతాళి చేసేవారు. చివరకు ఆమెను అనాథాశ్రమానికి పంపాలని కూడా కుటుంబానికి సలహా ఇచ్చిన సందర్భాలున్నాయి. కుటుంబ అవసరాల కోసం వ్యవసాయ భూమిని సైతం విక్రయించాల్సి వచ్చింది. 15 ఏళ్ల వయసులో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో దీప్తి ప్రతిభను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కోచ్‌ ఎన్‌. రమేశ్‌ గుర్తించారు. ఆమెకు శిక్షణ అందించడంతో పరుగులో రాణించే అవకాశం లభించింది. అక్కడి నుంచి దీప్తి ప్రస్థానం కొత్త మలుపు తిరిగింది. కఠోర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంది.

ప్రపంచ రికార్డు నుంచి పారాలింపిక్స్‌ పతకం వరకు..

2023లో హాంగ్‌జౌలో జరిగిన ఏషియన్‌ పారా గేమ్స్‌లో 400 మీటర్ల టీ20 విభాగంలో స్వర్ణం సాధించిన దీప్తి.. 2024లో జపాన్‌లోని కోబేలో జరిగిన వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ పసిడి పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో 55.07 సెకన్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అదే ఏడాది పారిస్‌ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల టీ20 విభాగంలో 55.82 సెకన్లతో కాంస్య పతకం సాధించింది. మేధో వైకల్యం ఉన్న భారత అథ్లెట్‌గా పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2025 వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించింది. క్రీడారంగంలో విశేష ప్రతిభకు గుర్తింపుగా అర్జున అవార్డును అందుకుంది.

ప్రతి అడుగూ ఓ స్ఫూర్తి..

తాజాగా ఏషియన్‌ పారా గేమ్స్‌లో మరో స్వర్ణంతో తన ఖాతాలో ఘనతను చేర్చుకుంది. హీట్స్‌లో 57.57 సెకన్లతో రికార్డు నెలకొల్పిన దీప్తి.. ఫైనల్లో తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుని 56.36 సెకన్లతో కొత్త గేమ్స్‌ రికార్డు సృష్టించింది. ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్న ఆమె.. నేడు అంతర్జాతీయ వేదికపై దేశానికి కీర్తి తెస్తోంది. పరిస్థితులు ఎలా ఉన్నా పట్టుదల, కృషి ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చని దీప్తి ప్రస్థానం నిరూపిస్తోంది.

Advertisement
Advertisement