త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

B Vinod Kumar | రామ‌ప్ప ఆల‌యం ద‌గ్గ‌ర ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఓప్పుకోం

B Vinod Kumar | రామప్ప దేవాలయం దగ్గర సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 6, 2026, 1.56 pm IST

B Vinod Kumar | రామ‌ప్ప ఆల‌యం ద‌గ్గ‌ర ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఓప్పుకోం
Advertisement
  • ఆలయం ద‌గ్గ‌ర కాల్వలు తవ్వేదున్నా పైపుల‌తో నీళ్లు త‌ర‌లించాం
  • కేసీఆర్ ఉన్న‌ప్పుడు ఏ చిన్న ఇబ్బంది రాకుండా చూసుకున్నం
  • అక్క‌డ దొరికే బొగ్గు విద్యుత్ త‌యారీకి ఏమాత్రం పనికి రాదు
  • కిష‌న్‌రెడ్డి చొర‌వ తీసుకొని వెంట‌నే మైనింగ్ ఆలోచ‌న‌ను విర‌మింప‌జేయాలి
  • మీడియా స‌మావేశంలో మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్

B Vinod Kumar | త్రినేత్ర న్యూస్: రామప్ప దేవాలయం దగ్గర సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. వెంక‌టాపురం ద‌గ్గ‌ర చేప‌ట్టే మైనింగ్ ఆలోచ‌న‌ను త‌క్ష‌ణం విర‌మించుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఆల‌యం ద‌గ్గ‌ర కాల్వ‌లు త‌వ్వేదున్నా పైపుల‌తో నీళ్లు త‌ర‌లించామ‌ని గుర్తు చేశారు. అక్క‌డ జీ8 క్వాలిటీ బొగ్గు దొరుకుతుంద‌ని.. విద్యుత్ ఉత్ప‌త్తికి అది ఏమాత్రం స‌రిపోద‌ని చెప్పారు. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి వెంటనే సింగరేణి కాలరీస్‌తో మాట్లాడి ఓపెన్ కాస్ట్ ప్రతిపాదనను విరమింపజేయాల‌ని కోరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

కాకతీయులు 800 ఏండ్ల‌ కిందట రామప్ప దేవాలయం కట్టారు. గొప్ప శిల్ప సంపదకు ప్రతిరూపం రామప్ప దేవాలయం. ఒక్కొక్క శిల్పం గురించి గంటల పాటు చర్చించుకోవచ్చు. రామప్ప దేవాలయాన్ని యునెస్కో 2021, జూన్ 25న హెరిటేజ్ సెంటర్‌గా గుర్తించింది. హెరిటేజ్ సైట్ గా గుర్తించడం వెనక కేసీఆర్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుల కృషి ఉంది. కేంద్రానికి ఎన్నో లేఖలు రాస్తే కానీ ఇది సాధ్యం కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక దేవాలయం రామప్పనే.

బంగారం దొరికినా..

రామప్ప దేవాలయ‌మే కాదు.. అక్కడ రామప్ప చెరువు కూడా ఉంది. రామప్ప దేవాలయానికి కేవలం ఐదు కిలో మీటర్ల దూరంలోనే ఉన్న వెంకటాపురం గ్రామం సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు ప్రతిపాదించింది. ఆ గనికి మాజీ పీఎం పీవీ నరసింహ రావు పేరు పెట్టారు. ఆ గనిని 300 కిలోమీటర్ల లోతు తవ్వుతారట. ఈ బొగ్గు నిల్వలు కేవలం 19 సంవ‌త్స‌రాల‌కే సరిపోతాయని సింగరేణి నివేదికలోనే చెప్పారు. 19 ఏండ్ల‌ పాటు వచ్చే బొగ్గు కోసం 800 యేండ్ల నాటి రామప్ప దేవాలయాన్ని చరిత్రలో లేకుండా చేస్తారా? అక్కడ బంగారం దొరికినా రామప్ప దేవాలయానికి నష్టం కలిగించడానికి వీలు లేదు.

అక్క‌డ వ‌జ్రాలున్నా వెలికి తీస్త‌లే..

మధ్యప్రదేశ్‌లో ప్రఖ్యాత ఖజురహో దేవాలయం దగ్గర వజ్రాలు దొరుకుతాయి. కానీ దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా అక్కడ వజ్రాలు వెలికి తీయడం లేదు. 2021లో రామప్ప దేవాలయం దగ్గర బొగ్గు వెలికి తీసేందుకు ఆర్కియాలజీ సంస్థ అనుమతి తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా సింగరేణి ఆ అనుమతిని పక్కన బెట్టి ఏవో సంస్థలు చెప్పాయనే కారణంతో రామప్ప దగ్గర ఓపెన్ కాస్ట్ కు సిద్ధమవుతోంది.

కేసీఆర్ హయాంలో రామప్ప దేవాలయానికి చిన్న ఇబ్బంది కూడా రాకుండా జాగ్రత్త పడ్డాం. రామప్ప హెరిటేజ్ సైట్ ప్రాంతాన్ని విస్తరించేందుకు 2027, ఫిబ్రవరిలోగా మీ అభిప్రాయం చెప్పాలంటూ యునెస్కో లేఖ రాసింది. వెంకటాపురం దగ్గర ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఆలోచనను విరమించుకుని రామప్ప దేవాలయాన్ని రక్షించాలి. ఆ బొగ్గు గనిలో జీ 8 క్వాలిటీ బొగ్గు మాత్రమే దొరుకుతుంది. ఈ బొగ్గు విద్యుత్ ఉత్పత్తికి ఏ మాత్రం పనికి రాదు. కిషన్ రెడ్డి రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినపుడు కేంద్ర టూరిజం మంత్రిగా ఉన్నారు. ఇపుడు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. వెంటనే సింగరేణి కాలరీస్‌తో మాట్లాడి ఓపెన్ కాస్ట్ ప్రతిపాదన విరమింపజేయాలి.

ములుగు క‌లెక్టర్ జోక్యం చేసుకోవాలి..

ములుగు కలెక్టర్ రామప్ప పరిసర గ్రామాల అభివృద్ధి ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన వెంటనే జోక్యం చేసుకుని వెంకటాపురం ఓపెన్ కాస్ట్ మైనింగ్ నిర్ణయాన్ని రద్దు చేయాలి. రామప్ప దేవాలయం నిర్మాణానికి వాడిన సాండ్ బాక్స్ టెక్నాలజీ నే అయోధ్య రామ మందిర నిర్మాణానికి వాడారు. రామప్ప దేవాలయం విశిష్టత మరింత పెరగాలంటే ఏ శషభిషలు లేకుండా బొగ్గు తవ్వకాల ప్రతిపాదనను నిలిపేయాలి అని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.

ఈ ప్రెస్ మీట్‌లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, ములుగు బీఆర్ఎస్ నేత లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధి సి. కళ్యాణ్ రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement