Uttam Kumar Reddy | 2028 జూన్ నాటికి ఎస్ఎల్‌బీసీ నుంచి నీటి సరఫరా
Uttam Kumar Reddy | శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి కీలక ముందడుగు వేశామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
- ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని దాటిన తవ్వకాలు
- జర్మనీ నుంచి లోకోమోటివ్‌తో పనుల్లో వేగం
- కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
- మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి కీలక ముందడుగు వేశామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. 2028, జూన్ నాటికి నీటిని అందించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించి, పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని బలహీన శిలల మండలాన్ని దాటి తవ్వకాలు జరిగాయన్నారు. అదనపు యంత్రాలు, జర్మనీ నుంచి లోకోమోటివ్‌తో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కీలక నీటిపారుదల ప్రాజెక్టుల అమలుపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఆదివారం సచివాలయంలో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలోని బలహీన శిలల మండలాన్ని (షియర్ జోన్) జాగ్రత్తగా దాటడంతో పనుల వేగం పెంచేందుకు మార్గం సుగమమైందన్నారు. అదనపు యంత్రాలను రంగంలోకి దించి, తవ్విన రాళ్లు, మట్టిని బయటకు తరలించే వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగంతోపాటు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, అదనపు యంత్రాల వినియోగంపై చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలోని మెట్ట ప్రాంతాలకు 30 టీఎంసీలకు పైగా నీటిని అందించి, ఏళ్ల తరబడి వేధిస్తున్న నీటి కొరతను తీర్చాలన్నదే లక్ష్యమని తెలిపారు.
ఐదారు నెలల్లో 700 మీటర్లు..
గడిచిన ఐదారు నెలల్లో సొరంగం తవ్వకాలు సుమారు 700 మీటర్లు ముందుకు సాగినట్లు ప్రాజెక్టు బృందం మంత్రికి వివరించింది. అవుట్‌లెట్ వైపు సుమారు 450 మీటర్లు, ఇన్‌లెట్ వైపు 250 మీటర్ల మేర పురోగతి నమోదైందని తెలిపింది. తీవ్రమైన భూగర్భ, సాంకేతిక సమస్యలతోపాటు యంత్రాలు, తవ్విన పదార్థాల రవాణాలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ ఈ పురోగతి సాధించినట్లు పేర్కొంది. మొత్తం 43.968 కిలోమీటర్ల ప్రధాన సొరంగం పనులు సుమారు 79 శాతం పూర్తయ్యాయని, మరో 9.1 కిలోమీటర్ల మేర తవ్వకాలు మిగిలి ఉన్నాయని వివరించింది.
అత్యంత ప్రమాదకరమైన షియర్ జోన్‌ను దాటడం ప్రాజెక్టులో ముఖ్యమైన ముందడుగని ఉత్తమ్ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసిన అధికారులు, కార్మికుల కృషిని అభినందించారు. ఈ పురోగతిని కొనసాగిస్తూ సొరంగంలో 20 కిలోమీటర్లకు పైగా లోపల పనిచేస్తున్న సిబ్బంది భద్రతను కాపాడేందుకు అధికారులు, గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సొరంగం పనులకు నేతృత్వం వహిస్తున్న భారత సైన్యానికి చెందిన సొరంగ నిర్మాణ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఇన్‌లెట్ వద్ద ఎదురైన పరిస్థితులను వివరించారు.
మళ్లీ బలహీనమైన ప్రాంతం ఎదురైంది..
బలహీనమైన నేల, రాళ్లు ఒక్కసారిగా విరిగిపడే రాక్ బర్స్ట్ వంటి ప్రమాదకర పరిస్థితుల కారణంగా మరో ప్రమాదం జరగకుండా తొలి నెలల్లో తవ్వకాల వేగాన్ని ఉద్దేశపూర్వకంగానే తగ్గించినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) చిక్కుకుపోయిన ప్రాంతాన్ని చుట్టి వెళ్లేలా చేపట్టిన మళ్లింపు తవ్వకాల్లో మరింత బలహీనమైన శిలల మండలం ఎదురైందని వివరించారు.
ఈ ప్రాంతాన్ని సురక్షితంగా దాటేందుకు 140 మిల్లీమీటర్ల సీమ్‌లెస్ పైపులతో తవ్వకాలు జరిగే భాగానికి ముందుగా గొడుగు మాదిరి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బలమైన రిబ్‌లను అమర్చడం, దశలవారీగా తవ్వడం, ముందున్న శిలల పరిస్థితిని తెలుసుకునేందుకు పరీక్షా డ్రిల్లింగ్ చేయడం, అదనపు రక్షణ ఏర్పాట్లతో ప్రమాదాలను నియంత్రిస్తూ ముందుకు సాగినట్లు చెప్పారు. ప్రస్తుతం శిలల పరిస్థితి మెరుగుపడుతుండటంతో సాధారణంగా పనులు సాగించే అవకాశం ఏర్పడుతోందని తెలిపారు.
8 మీటర్ల మేర పురోగతి..
ప్రస్తుతం రెండు వైపులా కలిపి రోజుకు సుమారు ఎనిమిది మీటర్ల మేర పురోగతి నమోదవుతోందని ప్రాజెక్టు బృందం తెలిపింది. నిరంతరంగా సాధిస్తున్న పురోగతి రోజుకు ఏడు నుంచి ఏడున్నర మీటర్లుగా ఉందని, ఒకట్రెండు రోజుల్లో పది మీటర్లకు కూడా చేరిందని వివరించింది. అవుట్‌లెట్ వద్ద మూడు డ్రిల్లింగ్ భుజాలున్న బూమర్ యంత్రం ఇప్పటికే పనిచేస్తోందని, అక్కడ పనులు అవసరమైన వేగానికి చేరువలో ఉన్నాయని తెలిపింది. ఇన్‌లెట్ వద్ద కూడా ఇదే తరహా మరో యంత్రం అక్టోబరులో అందుబాటులోకి రానుందని పేర్కొంది. విద్యుత్‌తో నడిచే లోడర్లు, అధునాతన ఎక్స్‌కవేటర్లను కూడా పనుల్లో వినియోగిస్తున్నట్లు వివరించింది.
జర్మనీ నుంచి తెప్పిస్తున్న రైలు ఇంజిన్ (లోకోమోటివ్) అక్టోబర్ నెలాఖరుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని వినియోగంతో తవ్విన రాళ్లు, మట్టిని వేగంగా బయటకు తరలించవచ్చని, తద్వారా ఒక్కో దఫా పనికి పట్టే సమయం తగ్గుతుందని వివరించారు. సొరంగంలో 21 కిలోమీటర్ల వరకు దూరం నుంచి తవ్విన పదార్థాలను తరలించాల్సి రావడం ప్రధాన అవరోధంగా ఉందన్నారు. తరలింపు ఆలస్యమైతే రాళ్లు, మట్టి లోపల పేరుకుపోయి, వాటిని తొలగించే వరకు తవ్వకాలు నిలిపివేయాల్సి వస్తోందని తెలిపారు.
గతంలో ఒక్క దఫా పని చక్రం పూర్తయ్యేందుకు సుమారు 48 గంటలు పట్టేదని, ప్రస్తుతం దానిని 20 నుంచి 24 గంటలకు తగ్గించినట్లు ప్రాజెక్టు బృందం వివరించింది. అదనపు యంత్రాలు, వేగవంతమైన తరలింపు వ్యవస్థతో ఈ సమయాన్ని పది గంటలకు తగ్గించగలమని అంచనా వేసింది. అక్టోబర్ చివరి లేదా నవంబర్ ప్రారంభం నుంచి పనుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అవసరమైన యంత్రాలను సకాలంలో సమకూర్చి, తవ్వకాల ప్రతి దశలో సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి ఆదేశించారు.
ప్రధాన సొరంగం అనుసంధానమే లక్ష్యం
టన్నెల్-1లో రెండు వైపుల నుంచి సాగుతున్న తవ్వకాలు 2028 మే-జూన్ నాటికి కలిసే దశకు చేరుకుంటాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తవ్వకాలతోపాటే సొరంగం లోపలి గోడలను బలపరిచే స్ప్రే లైనింగ్ పనులు చేపడుతున్నారని, దీంతో సొరంగం అనుసంధానం పూర్తయ్యేలోపే లైనింగ్‌లో అధిక భాగాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని సమీక్షలో వివరించారు.
ప్రధాన సొరంగంతో పాటు టన్నెల్-2, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇతర అనుబంధ పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. వీటిలో ఏ పని అసంపూర్తిగా ఉన్నా నీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. సుమారు 7.1 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్-2లో సుదీర్ఘ విరామం తర్వాత లైనింగ్ పనులు తిరిగి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
ఈ సమీక్షలో ఎంపీలు కె. రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, కె. జైవీర్‌రెడ్డి, వేముల వీరేశం, అనిల్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఓ.వి. రమేష్‌బాబు, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి
- ●Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు
- ●Samula Ram Reddy | బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డికి సన్మానం
- ●KCR | కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర
- ●S Jaishankar Munich Security Conference | అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా మారుతున్న అమెరికా

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి

Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు

Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Samula Ram Reddy | బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డికి సన్మానం




