Vemula Prashanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని... హరీశ్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక కేసీఆర్ చావు కోరుతూ.. హరీశ్ రావుని బాడీ షేమింగ్ చేస్తూ రేవంత్ రెడ్డి రొడ్డ వాగుడు వాగారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. స్పీకర్ తీరును నిరసిస్తూ అసెంబ్లీ వాకౌట్ చేసి గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా ఖూనీ అవుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల పట్ల స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరం అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు ప్రయత్నిస్తే మైకులు ఆపేస్తూ సీఎంని విమర్శిస్తే మైక్ ఇవ్వబోమని స్పీకర్ హెచ్చరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దమైన ధోరణి, గొడ్డలిపెట్టు లాంటిదని అన్నారు. మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మూసి ప్రక్షాళన పై చర్చ సందర్బంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు లెవనెత్తారు. వాటికీ సూటిగా సమాధానం చెప్పకుండా సభ్యుల హక్కులను కాలరాస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా గంటకు పైగా వాడుకుంటూ బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. "ప్రతిపక్షం ముఖ్యమంత్రి భజన చేయడానికి అసెంబ్లీకి రావాలా? లేదా ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రావాలా?" అని ప్రశ్నించారు. అసెంబ్లీని గాంధీ భవన్‌లా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలా నడిపితే తాము అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీని అసెంబ్లీలా, రాజ్యాంగబద్ధంగా, సమాన న్యాయంతో స్పీకర్ నడిపితే మాత్రమే ప్రతిపక్షం అసెంబ్లీకి వస్తుందని తేల్చి చెప్పారు. ప్రజల గొంతుకను నొక్కే ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.