Adluri Laxman Kumar | ఈ నెలాఖరు కల్లా మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని.. ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. శాసనసభ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ సభ్యులపై మండిపడ్డారు. గత రెండు సంవత్సరాలుగా వాళ్ల వ్యవహార శైలి చూస్తున్నాం. వారి పంతం నెగ్గించుకోవడానికే చూస్తారు. బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడే ముఖం బీఆర్ఎస్ నేతలకు లేదు. మా తప్పుంటే అసెంబ్లీలో నిరూపించండి. మూసీ అంశంలో రన్నింగ్ కామెంటరీ చేసింది మీరే. బీఆర్ఎస్ పార్టీ ఖతం అయినట్టే. ఉనికి కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. నరేగా పథకంపై ఏం మాట్లాడలేక.. బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడలేక సభ నుంచి వెళ్లిపోయారు. పేదవారి పథకంపై వారికి మాట్లాడే ఇష్టం లేదు. వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు సభలో కనీసం గౌరవం కూడా ఇవ్వలేదన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులకు వేడి నీళ్ల కోసం సోలార్ పవర్ ద్వారా పెట్టించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి చెప్పారు.