త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Uttam | రూ.18,250 కోట్లతో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళిక

Minister Uttam | ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి కెప్టెన్‌ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని డాక్ట‌ర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శనివారం అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులతో రాష్ట్రస్థాయి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

P

Telangana | Published On Sep 5, 2026, 4.45 pm IST

Minister Uttam | రూ.18,250 కోట్లతో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళిక
Advertisement
  • 65 లక్షల టన్నుల సేకరణకు సన్నద్ధం..
  • అక్టోబర్‌ 15 నుంచి కొనుగోళ్లు
  • 8,283 కేంద్రాలు.. అక్టోబర్‌ 1 నాటికే సిద్ధం చేయాలి
  • రైతుకు గిట్టుబాటు ధరే లక్ష్యం
  • మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

రూ.18,250 కోట్ల అంచనా విలువతో చేపట్టనున్న వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి రాకూడదని, ధాన్యం విక్రయించిన అనంతరం చెల్లింపుల్లోనూ జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌–2026-27లో 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు.

8,283 కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా 8,283 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తమ్‌ తెలిపారు. ఇందులో 3,180 ఐకేపీ కేంద్రాలు, 4,372 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, 731 ఇతర కేంద్రాలు ఉంటాయన్నారు. అక్టోబర్‌ 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్‌ 1 నాటికే అన్ని కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం గ్రేడ్‌–ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 కనీస మద్దతు ధరగా ఉందని మంత్రి తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు ప్రాధాన్య సన్న రకాలకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లిస్తామన్నారు. బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్‌–15048, కేఎన్‌ఎం–1638, జై శ్రీరామ్‌, హెచ్‌ఎంటీ–సోనా, డబ్ల్యూజీఎల్‌–44, కేఎన్‌ఎం–7715 రకాలకు ఈ బోనస్‌ వర్తిస్తుందని వివరించారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ రకాలను ఎంపిక చేసినట్లు చెప్పారు.

ఎగుమతులతో రైతుకు మెరుగైన ధర

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినా, బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్నా రైతుకు గిట్టుబాటు ధర లభించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ బియ్యానికి దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయంగా స్థిరమైన ఎగుమతి మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి దీర్ఘకాలిక వ్యూహం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొన్ని సందర్భాల్లో కొనుగోలు ధర కంటే తక్కువకు విక్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఎగుమతులను ప్రోత్సహించి అంతర్జాతీయ మార్కెట్‌లో స్థిరమైన డిమాండ్‌ సృష్టిస్తే రైతులకు మెరుగైన ధర లభించడంతోపాటు ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చన్నారు.

119.57 లక్షల టన్నుల దిగుబడి అంచనా

ప్రస్తుత వానాకాలంలో 57.70 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 119.57 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఇందులో సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ద్వారా 45 లక్షల టన్నుల సన్న ధాన్యం, 20 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం.. మొత్తం 65 లక్షల టన్నులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. యాసంగి ధాన్యం ఉత్పత్తి వానాకాలం స్థాయికి చేరుకోవడం, కొన్ని సందర్భాల్లో దానిని అధిగమించడం తెలంగాణ వ్యవసాయ రంగంలో సానుకూల పరిణామమన్నారు. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ధాన్యం రాక గరిష్ఠ స్థాయికి చేరుతుందని ఉత్తమ్‌ తెలిపారు. నవంబర్‌లో 24.72 లక్షల టన్నులు, డిసెంబర్‌లో 25.32 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున గోదాములు, గన్నీ సంచులు, రవాణా వాహనాలు, హమాలీలు, తూకం, నాణ్యత నిర్ధారణ పరికరాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సీజన్‌కు 16.25 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని, ప్రస్తుతం 3.50 కోట్ల సంచులు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. మిగిలిన సంచుల సేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులు, రాష్ట్ర, కేంద్ర గిడ్డంగుల సంస్థల గోదాములు, రైతు వేదికలు, ప్రభుత్వ భవనాలు, ఇతర అనుమతించిన ప్రదేశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి జిల్లాకు సమగ్ర నిల్వ ప్రణాళిక రూపొందించాలన్నారు.

లారీలపై ముందస్తు పరిశీలన

రవాణా కాంట్రాక్టర్లకు అవసరమైన సంఖ్యలో లారీలు సొంతంగా ఉన్నాయా? లేదా సమకూర్చుకునేందుకు విశ్వసనీయ ఏర్పాట్లు ఉన్నాయా? అన్నది టెండర్ల దశలోనే నిర్ధారించాలని సూచించారు. రవాణా లోపాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపు నిలిచిపోకూడదన్నారు. ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్‌ ఆధారిత ట్రాకింగ్‌ తప్పనిసరి చేయాలని, పొరుగు రాష్ట్రాల నుంచి అనధికారికంగా ధాన్యం రాకుండా సరిహద్దు తనిఖీ కేంద్రాలను బలోపేతం చేయాలని ఆదేశించారు. ‘‘ధాన్యం కొనుగోలు యంత్రాంగం అంతా రైతు ప్రయోజనాల పరిరక్షణే పరమావధిగా పనిచేయాలి. కొనుగోలు కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాలి. రైతుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. తూకం, నాణ్యత పరీక్షల్లో పూర్తి పారదర్శకత పాటించాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తూ, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలి’’ అని మంత్రి స్పష్టం చేశారు. ‘రూ.18,250 కోట్ల విలువైన 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ప్రతి స్థాయిలోనూ సూక్ష్మ ప్రణాళిక అవసరం. రైతుకు సరైన ధర లభించాలి. చెల్లింపులు సకాలంలో జరగాలి. ఏ దశలోనూ రైతుకు అసౌకర్యం కలగకూడదు’ అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, సంచాలకుడు శ్యామ్‌ ప్రసాద్‌, అదనపు సంచాలకుడు రోహిత్‌ సింగ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement