త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR Resignation Demand | జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే

వెయ్యి రోజులుగా అసెంబ్లీకి రాకుండా, ప్రజలకు దూరంగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

J

Telangana | Published On Sep 5, 2026, 4.26 pm IST

KCR Resignation Demand | జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే
Advertisement
  • మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ మంత్రుల డిమాండ్
  • రేపు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం
  • అసెంబ్లీకి రాకుండా, ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కేసీఆర్ కేవలం జీతం మాత్రమే తీసుకుంటున్నారని మంత్రి పొన్నం విమర్శ
  • ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, మల్‌రెడ్డి రాంరెడ్డి సహా ఇతర ముఖ్య నాయకులు

KCR Resignation Demand | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. వెయ్యి రోజులుగా ప్రజలకు దూరంగా ఉంటూ, ప్రతిపక్ష పాత్రను గాలికి వదిలేసిన కేసీఆర్.. వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇందుకోసం రేపు (ఆదివారం) ఇందిరాపార్క్ ధర్నా చౌక్ (Dharna Chowk) వద్ద భారీ ఎత్తున 'మహా ధర్నా' నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ వెయ్యి రోజులుగా అసెంబ్లీకి (Assembly) రావడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండకుండా కేవలం ఎమ్మెల్యేగా జీతం మాత్రం తీసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన నిలబడాల్సిన కనీస బాధ్యతను ఆయన పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

Telangana Ministers Demand KCR's Resignation Ahead of Maha Dharna

రేపు జరగబోయే ఈ మహా ధర్నాలో కేసీఆర్ రాజీనామా డిమాండ్‌తో పాటు.. కాంగ్రెస్ (Congress) ప్రజా పాలనలోని వెయ్యి రోజుల ప్రగతిని ప్రజలకు వివరించనున్నారు. అదే సమయంలో గత పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలోని వైఫల్యాలను, అవినీతిని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలోని ప్రతి డివిజన్ నుంచి కనీసం 100 మందికి తగ్గకుండా కార్యకర్తలు ఈ ధర్నాకు తరలిరావాలని కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సన్నాహక భేటీలో మంత్రులతో పాటు అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితర కీలక నేతలు, ఎన్ఎస్‌యూఐ (NSUI), యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana Ministers Demand KCR's Resignation Ahead of Maha Dharna

Advertisement
Advertisement