త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kangana Ranaut | ప‌నికిమాలిన మాట‌లు వ‌ద్దు.. మీ వ‌ల్లే నా ప‌నితీరుపై విమ‌ర్శ‌లు.. మండి అధికారుల‌పై కంగ‌న ఆగ్ర‌హం

Kangana Ranaut | త‌న నియోజ‌క‌వ‌ర్గ అధికారుల‌పై మండి (Mandi) ఎంపీ కంగ‌న ర‌నౌత్ (Kangana Ranaut) తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం త‌న ఎంపీ నిధుల (MP funds) కింద రూ.11 కోట్లు అందుబాటులో ఉంటే రూ.50 ల‌క్ష‌లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారుల అల‌స‌త్వం కార‌ణంగా జాతీయ మీడియాలో త‌న ఎంపీ ప‌నితీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

D

National | Published On Sep 5, 2026, 4.43 pm IST

Kangana Ranaut | ప‌నికిమాలిన మాట‌లు వ‌ద్దు.. మీ వ‌ల్లే నా ప‌నితీరుపై విమ‌ర్శ‌లు.. మండి అధికారుల‌పై కంగ‌న ఆగ్ర‌హం
Advertisement

Kangana Ranaut | త్రినేత్ర‌.న్యూస్ : హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని మండి (Mandi) లోక్‌సభ నియోజకవర్గ అధికారుల‌పై ఎంపీ కంగ‌న ర‌నౌత్ (Kangana Ranaut) తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. అందుబాటులో ఉన్న ఎంపీ నిధుల‌ను (MP funds) ఉప‌యోగించుకోవ‌డంలో అల‌స‌త్వం వ‌హించ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఇవాళ మండి జిల్లా ప్రధాన కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశంలో కంగ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిధుల దుర్వినియోగం, పనుల్లో తీవ్ర జాప్యంపై అధికారులను గట్టిగా నిలదీశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం త‌న ఎంపీ నిధుల కింద దాదాపు రూ.11 కోట్లు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. అందులో కేవ‌లం రూ.50 ల‌క్ష‌ల‌ నుంచి రూ.60 ల‌క్ష‌లు మాత్ర‌మే అధికారులు ఖర్చు చేశారని తెలిపారు.

ప‌నికిరాని సాకులు వ‌ద్దు..

నిధులు ఉప‌యోగించుకోవ‌డంలో జాప్యంపై ఆమె బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారులను (BDO) తీవ్రంగా మంద‌లించారు. "ప్రతీ DISHA సమావేశంలోనూ ఎలాంటి ఇబ్బందులూ లేవని.. 90 శాతం నిధులు ఖర్చయిపోయాయని అధికారులు చెబుతూ వ‌స్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో లెక్కలు వేరుగా ఉన్నాయి. ఇక‌పై నాకు ఇలాంటి పనికిరాని సాకులు చెప్పకండి... వెంటనే పనులను పూర్తి చేయండి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్చుకు సంబంధించిన పనితీరు నివేదికను త‌న‌కు అంద‌జేయాల‌ని ఆదేశించారు.

40 శాతం నిధులు అన‌ర్హుల చేతుల్లోనే

త‌న ఎంపీ నిధుల్లో దాదాపు 30 నుంచి 40 శాతం అన‌ర్హులు, మోసపూరిత వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయ‌ని కంగ‌న ఆరోపించారు. వాటిని రికవరీ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిప‌డ్డారు. ఎన్ఓసీ (NOC) లేదా భూ అనుమతులు లేకుండానే కొన్ని ఏజెన్సీలు నిధులు తీసుకుని పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. పనులు ప్రారంభించని ఏజెన్సీలను పిలిపించి, అవసరమైతే ఆ నిధులను వెనక్కి తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

అధికారులు నాకంటే బాగా న‌టిస్తున్నారు..

అధికారుల అల‌స‌త్వం కార‌ణంగా జాతీయ మీడియాలో త‌న ఎంపీ ప‌నితీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని కంగ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మండిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రజలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటే.. అధికారులు మాత్రం తమ కార్యాలయాల్లో నవ్వుతూ, తనను దూషిస్తూ కాలక్షేపం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. "అధికారులు నా కంటే బాగా నటిస్తున్నారు" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నియోజ‌క‌వ‌ర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అలాగే అందుబాటులో ఉన్న MPLADS నిధులను సద్వినియోగం చేసుకోవాల‌ని అధికారుల‌ను ఈ సంద‌ర్భంగా కంగ‌న ఆదేశించారు.

Also Read..

యూస్‌మార్గ్ ఎన్‌కౌంట‌ర్‌.. ల‌ష్క‌రే క‌మాండ‌ర్ హ‌తం

పాకిస్థాన్‌కు గ‌ట్టి షాక్‌.. సింధు న‌దిపై భార‌త్ తొలి రాక్ చెక్ డ్యామ్‌

జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే

Advertisement
Advertisement