త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyberabad CP Ramesh | ఎవ‌రికైనా త‌ల్లే తొలి గురువు: సైబరాబాద్ సీపీ ర‌మేష్

Cyberabad CP Ramesh | ప్రతి ఒక్కరి జీవితంలో తన తల్లే తొలి గురువని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.ర‌మేష్ అన్నారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.

S

Hyderabad | Published On Sep 5, 2026, 3.16 pm IST

Cyberabad CP Ramesh | ఎవ‌రికైనా త‌ల్లే తొలి గురువు: సైబరాబాద్ సీపీ ర‌మేష్
Advertisement
  • గచ్చిబౌలి జ‌డ్పీహెచ్ఎస్‌లో ఉపాధ్యాయులను స‌న్మానించిన సీపీ
  • అనంత‌రం విద్యార్థులతో ముఖాముఖి

Cyberabad CP Ramesh | త్రినేత్ర‌.న్యూస్: ప్రతి ఒక్కరి జీవితంలో తన తల్లే తొలి గురువని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.ర‌మేష్ అన్నారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ‌నివారం గచ్చిబౌలిలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను సందర్శించి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఉపాధ్యాయులను సీపీ ఘనంగా సత్కరించారు. హెచ్ఎం రెహానా బేగం, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్‌ను ప్రత్యేకంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. “విద్యార్థులు ఉన్నతమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడమే ఉపాధ్యాయులకు మనం అందించే గొప్ప బహుమతి” అని చెప్పారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, రోడ్డు భద్రత, ట్రాఫిక్, మహిళల భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించడంలో ఉపాధ్యాయులు, పోలీసులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అనంతరం సీపీ ర‌మేష్‌ విద్యార్థులతో కాసేపు ముచ్చ‌టించారు. ఆ చిట్టి మ‌న‌సుల్లో మెదిలే అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంత‌రం వివిధ సమస్యలపై వారికి అర్థ‌మ‌య్యేలా వివ‌రించారు.

ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థి ప్రశ్న

ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించేలా చూడాలని, అలా చేయ‌నివారిపై జరిమానాలు వేయాల‌ని జూడ్ అనే విద్యార్థి సీపీని కోరాడు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించేలా అవగాహన కల్పించాలని విజ్ఞ‌ప్తి చేశాడు. విద్యార్థి ప్రశ్నకు స్పందించిన సీపీ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు.

మహిళల భద్రతపై..

మహిళలు, బాలికల భద్రత కోసం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విద్యార్థిని స్నేహిత సీపీని ప్రశ్నించగా, ఆయ‌న బదులిస్తూ మహిళలు, బాలికల రక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో SHE Teams నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళలు లేదా బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే డయల్ 100 లేదా 112 కి ఫోన్ చేసి పోలీసులను సంప్రదించాలని సూచించారు.

డ్రగ్స్‌పై ప్రశ్న

తమ పాఠశాలకు వచ్చే మార్గంలో ప‌లువురు వ్యక్తులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు కనిపిస్తున్నారని కొంతమంది విద్యార్థులు సీపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీపీ స్పందిస్తూ డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై క‌ఠిన‌ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు ఇలాంటి కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రోడ్డు దాటే సమయంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులను సంప్రదించి వారి సహాయం తీసుకోవాలని విద్యార్థినులకు సీపీ సూచించారు.

సైబర్ మోసాలపై..

విద్యార్థి నిఖిల్ మాట్లాడుతూ ఒక రోజు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి OTP చెప్పాలని కోరగా, OTP చెప్పిన వెంటనే తన ఖాతా నుంచి రూ.4,000 డెబిట్ అయ్యాయని సీపీ దృష్టికి తీసుకువచ్చాడు. ఇలాంటి మోసాల నుంచి ఎలా జాగ్రత్త పడాలని ప్రశ్నించాడు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ వ‌స్తే అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ఎవరైనా ఫోన్ చేసి OTP, బ్యాంక్ వివరాలు, PIN లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్ద‌న్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసులను సంప్రదించాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ రాయదుర్గం ఎస్‌హెచ్‌వో భూపతి, పోలీసు అధికారులు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement