త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TUWJ | హెల్త్ కార్డుల కోసం జ‌ర్న‌లిస్టుల పోస్టు కార్డు ఉద్యమం

TUWJ | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాల్లో పని చేస్తున్న జర్నలిస్టులు అందరికీ ప్రభుత్వం వెంటనే క్యాష్ లెస్ హెల్త్ కార్డులను ఇవ్వాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Oct 2, 2026, 11.08 pm IST

TUWJ | హెల్త్ కార్డుల కోసం జ‌ర్న‌లిస్టుల పోస్టు కార్డు ఉద్యమం
Advertisement

జర్నలిస్టులకు వెంటనే క్యాష్ లెస్ హెల్త్ కార్డ్ ఇవ్వాలి
వారం రోజుల పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం మరింత ఉదృతం చేస్తాం
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్య‌క్షుడు అల్లం నారాయ‌ణ హెచ్చ‌రిక‌

TUWJ | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాల్లో పని చేస్తున్న జర్నలిస్టులు అందరికీ ప్రభుత్వం వెంటనే క్యాష్ లెస్ హెల్త్ కార్డులను ఇవ్వాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చిందని, అందులో ఇళ్ల స్థలాలు, వంద కోట్ల రూపాయల సంక్షేమ నిధి, హెల్త్ కార్డ్స్, అక్రెడిటేషన్ కార్డ్స్, పెన్షన్ వంటివి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి అవుతున్నా... జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అల్లం నారాయణ గుర్తు చేశారు. ఇక గత ప్రభుత్వంలో అమలు అయిన హెల్త్ కార్డును ఈ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇది అత్యంత బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జర్నలిస్టులకు ఉన్న సౌకర్యాన్ని తొలగించారని, దానిని తిరిగి పునరుద్ధరించడం కోసం అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు గాంధేయ మార్గంలో శాంతి యుతంగా జర్నలిస్టులం నిరసన తెలుపుతున్నామని ఆయన చెప్పారు.

హెల్త్ కార్డుల కోసం టీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా శుక్రవారం సికింద్రాబాద్ రాంగోపాల్ పేట గాంధీ చౌక్ నుంచి పోస్టు కార్డు ఉద్యమాన్ని అల్లం నారాయణ ప్రారంభించారు. కొత్తగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా, గతంలో జేఎన్ జే హోసింగ్ సొసైటీకి ఇచ్చి పేట్ బషీరాబాద్ స్థలాన్ని తిరిగి తీసుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉన్న హెల్త్ కార్డును కూడా రద్దు చేశారని, నిత్యం పని ఒత్తిడితో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు ప్రభుత్వ ఉచిత హెల్త్ కార్డు అవసరం ఉందని అల్లం నారాయణ అన్నారు. గాంధీ అనుసరించిన మార్గంలో మొదటగా శాంతియుత పోరాటాన్ని చేస్తున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరోరూపంలో ఉదృతం చేస్తామని అల్లం నారాయణ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలు, సంఘాలు, సంస్థలను ఏకం చేసి ఉద్యమాలు చేసిన జర్నలిస్టులం, ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వకపోతే మరో సారి ఉద్యమిస్తామన్నారు.

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు కొత్తగా ఏమీ ఇవ్వకపోయినా, ఉన్న హెల్త్ కార్డులను తొలగించిందని అన్నారు. హెల్త్ కార్డుల కోసం పోస్టు కార్డ్ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించక పోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని సాగర్ హెచ్చ‌రించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు రమేష్ హజారీ, టెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, టీయూడబ్ల్యూజే కోశాధికారి పి.యోగనంద్, హైదరాబాద్ నగర ఇంచార్జ్ యార నవీన్ కుమార్, హైదరాబాద్ నగర అధ్యక్షుడు రాకేశ్ రెడ్డి, కోశాధికారి బాపు రావు, ఐజేయు నాయకుడు తిరుపతి నాయక్, కల్కూరి రాజు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఫోటో జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement