Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రహదారులపై విచ్చలవిడిగా వాహనాలను నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం.. లైసెన్స్‌లను కూడా రద్దు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్, వాహనాల స్టిక్కర్స్, విద్యార్థుల అవగాహన బుక్స్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పొన్నం స్వయంగా హెల్మెట్‌లను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, జేటీసీలు, డీటీసీలు, ఆర్టీఏ సభ్యులు నవీన్, సురేశ్ లాల్‌తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నేటి నుంచి జనవరి 31 వరకు జరగబోయే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో అందరూ విధిగా పాల్గొనాలని ఆదేశించారు. విద్యార్థులను, ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. రోడ్డు నిబంధనలు పాటిస్తామని ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల నుంచి హామీ పత్రం తీసుకోవాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతి విద్యార్థి చేత ప్రతిజ్ఞ చేయించాలని మంత్రి చెప్పారు. తెలంగాణలో అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే జరిగినట్లు డీజీపీ ఇటీవలే ప్రకటించారు. కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్‌ను తొలగిస్తూనే దానిపై అవగాహన కల్పించాలన్నారు. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, సీటు బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్ చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయన్నారు. శాశ్వత వికలాంగులై రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించినప్పటికీ నిత్యం వందల కేసులు నమోదు అవుతున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వెయ్యి మంది రవాణా శాఖ అధికారులు మాత్రమే ఉన్నారు. కానీ వాహనాలు మాత్రం కోటి 80 లక్షలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలన్నారు. యూనిసెఫ్ సూచనల మేరకు ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా పని చేద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.